28-03-2025 01:44:32 AM
15 రోజుల్లో ఇంకో పంపు ఆన్ చేస్తాం : మంత్రి ఉత్తమ్
దేవాదుల మూడో ఫేజ్‌లో ట్రయల్ రన్ విజయవంతం
జనగామ/హనుమకొండ, మార్చి 27 (విజయక్రాంతి): దేవాదుల మూడో ఫేజ్ లో భాగంగా ఒక పంపు ట్రయల్ రన్ విజయవంతం కావడం సంతోషకరమని, 15 రోజుల్లో మరో మోటార్ ఆన్ చేస్తామని భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
హనుమకొండ జిల్లాలోని దేవన్నపేట పంపుహౌస్ వద్ద పంపు లిఫ్టింగ్ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్ అక్కడికి చేరుకుని మోటార్ ఆన్ చేసి లిఫ్టింగ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితమే పనులు ప్రారంభించేందుకు తాను వచ్చానని, సాంకేతిక లోపం వల్ల ఆలస్యమైందని చెప్పారు.
ఎట్టకేలకు పంపు ఆన్ చేయడంతో వేలాది ఎకరాలకు సాగు నీరు అందనుందన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ హయాంలోనే దేవాదుల పనులు ప్రారంభమయ్యాయని, మళ్లీ తమ హయాంలోనే పనులు త్వరలో పూర్తి కాబోతున్నాయని దీమా వ్యక్తం చేశారు.
ఈ ఏడాది చివరికల్లా దేవాదుల ఫేజ్ 3 పనులన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కెఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.