calender_icon.png 1 April, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందించడమే లక్ష్యం

27-03-2025 01:13:54 AM

బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్

వేములవాడ, సిరిసిల్లలో పర్యటన

సిరిసిల్ల, మార్చి 26 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ ఫలాలు బి.సి. కులంలోని అందరికీ అందించడమే తమ లక్ష్యమని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ స్పష్టం చేశారు. పిచ్చగుంట్ల, బుడబుక్కల, దొమ్మరి, తమ్మలి తదితర కులాల స్థితిగతులను తెలుసుకునేందుకు బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు జిల్లా పర్యటనకు విచ్చేసి, ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా వేములవాడ మహాలక్ష్మి వీధిలోని దొమ్మరి వారు, న్యూ అర్బన్ కాలనీలోని పిచ్చ గూంట్ల వారు, సిరిసిల్ల మార్కెట్ యార్డ్ సనీయంలోని ఇందిరా నగర్ లోని పిచ్చ గూంట్ల వారు, గీతానగర్ సమీపంలోని దొమ్మరి వారితో సమావేశమయ్యారు. అంతకముందు ఉదయం వేములవాడలో తమ్మల కులం బాద్యులతో మాట్లాడారు. 

 తమ్మల పేరిట కులం సర్టిఫికెట్ ఇవ్వాలి 

తమ్మల కులం వారితో బీసీ కమిషన్ బాధ్యులు మాట్లాడారు.  తమ్మల కులానికి శూద్ర, నాన్ బ్రాహ్మణ్ పేరిట కులం సర్టిఫికెట్ ఇవ్వడం తో ఆలయాల్లో అర్చక, ఇతర ఉద్యోగాల్లో పొందడంలో ఇబ్బంది పడుతున్నామని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. తమకు తమ్మల పేరిట కులం సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు. తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

 దొమ్మరి కులం పేరు మార్చాలి

కులం సర్టిఫికెట్లో తమ కులం పేరు ను గాడే వంశీయులు గా మార్చాలని దొమ్మరి కులం బాద్యులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వేములవాడ, సిరిసిల్లలోని వారి ఇండ్లు, ఆర్థిక, విద్యా స్థితిగతులను కమిషన్ చైర్మన్, సభ్యులు తిరిగి పరిశీలించారు. వారి ఉపాధి మార్గాలు, ఆదాయ స్థితి,విద్యా స్థితి పై ఆరా తీశారు. కులం పేరు దొమ్మరి ఉండడంతో తాము సమాజంలో ఇబ్బంది పడు తున్నామని వివరించారు.విద్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో అవమానానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  కమిషన్ చైర్మన్ మాట్లాడారు. దొమ్మరి కులం పేరు సమస్యపై అధ్యయనం చేసేందుకు ఇక్కడికి వచ్చామని తెలిపారు. 

 విద్యా స్థితి వివరాలపై ఆరా

అనంతరం వేములవాడ లోని న్యూ అర్బన్ కాలనీ, సిరిసిల్ల ఇందిరానగర్ లోని పిచ్చగూంట్ల (వంశరాజ్), పలువురు ఇండ్లలోకి వెళ్ళి పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడారు. వారు చేస్తున్న పని, ఎన్ని కుటుంబాలు ఎందరు ఉన్నారో ఆరా తీశారు. నెలకు ఎంత ఆదాయం వస్తుంది? విద్యా స్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కులం పేరు పిచ్చగూంట్ల ఉండడంతో తాము సమాజంలో ఇబ్బంది పడుతున్నామని వివరించారు. విద్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో అవమానానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ ఫలాలు కులంలోని అందరికీ అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అందించే బిల్లు కు శాసన సభలో ఆమోదింపజేసిందని తెలిపారు.

కులం పేరిట ఇబ్బంది పడుతున్నవారు ఆత్మ న్యూనతా భావానికి గురికావద్దని పేర్కొన్నారు. పిల్లలను తప్పకుండా చదివించాలని, రిజర్వేషన్ ఫలాలు పొందాలని సూచించారు. ఆయా కులాల పేర్ల మార్పు అంశం వచ్చే నెలలో పరిష్కరిస్తామని తెలిపారు. బీసీ కులాల్లోని అందరికీ రాజ్యాంగ ఫలాలు అందించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటించామని గుర్తు చేశారు.

త్వరలో మిగతా జిల్లాల్లో పర్యటించి, ఆయా బీసీ కులాల స్థితిగతులను నేరుగా తెలుసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టిందని వివరించారు. అర్హులందరూ ఈ పథ కాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. బీసీ కులాల బాధ్యులు రాష్ట్ర ప్రభు త్వ పథకాలు వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.

తమ సమస్యలు పరిష్కరించాలని పలు కులాల ప్రతినిధులు బీసీ కమిషన్ చైర్మన్ కు విన్నవించారు. రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు పరిష్కరించేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో రాధా భాయ్, తహసీల్దార్లు విజయ్ ప్రకాష్ రావు, మహేష్ కుమార్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, జిల్లా బీసీ సంక్షేమ అధికారి రాజ మనోహర్ రావు, వివిధ బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.