calender_icon.png 19 April, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పనే లక్ష్యం

18-04-2025 12:33:57 AM

రూ. 3 కోట్లతో అంతర్ రాష్ట్ర రోడ్ నిర్మాణం.. ఎస్పీ రోహిత్ రాజ్ 

చర్ల ఏప్రిల్ 17 (విజయక్రాంతి): నిషేదిత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలకు విద్య,వైద్యం,రవాణా సౌకర్యాలు అందించడమే లక్ష్యం మని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు.చర్ల మండలం పూసుగుప్ప నుండి చత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దు వరకు నిర్మితమైన 2 కిలోమీటర్ల బీటి రోడ్డునుగురువారం ఆయన సందర్శించారు.

చర్ల నుండి ద్విచక్ర వాహనాల ద్వారా పూసుగుప్ప వరకు ఇప్పటి వరకు పూర్తయిన , నిర్మాణంలో ఉన్న కాజ్ వే లు,కల్వర్ట్ ల పనులను పరిశీలించారు. అనంతరం పూసుగుప్ప చేరుకొని అక్కడ నుండి ఇటీవల పూర్తయిన రెండు కిలోమీటర్ల బీటీ రోడ్డును సందర్శించారు. సుమారుగా రూ 3 కోట్ల  వ్యయంతో పూసుగుప్ప నుండి చత్తీస్గడ్ లోని రాంపురం, భీమారం గ్రామాలలో నివసించే ఆదివాసి ప్రజలకు ఉపయోగపడేలా ఈ రోడ్డును నిర్మించడం జరిగిందన్నారు.

నిషేధిత మావోయిస్టులు ఆదివాసి ప్రజలను అభివృద్ధికి దూరం చేయాలని చూస్తున్నారని ,ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ద్వారా వారికి విద్య,వైద్యం,రవాణా వంటి కనీస సౌకర్యాలను అందించటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. అతి త్వరలోనే పూసుగుప్ప,చెన్నాపురం గ్రామాలలో దాదాపుగా పూర్తయిన మొబైల్ హాస్పిటళ్లను ప్రారంభించనున్నామని అన్నారు.  ఆదివాసీ ప్రజలకు ఉపయోగపడే ఏ అభివృద్ధి కార్యక్రమాన్నైనా ముందుండి పూర్తి చేయడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు .

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస పాలసీకి ఆకర్షితులై మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వివిధ క్యాడర్లకు చెందిన చాలామంది ఇప్పటికే లొంగిపోయారని, మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న మిగిలిన నాయకులు సభ్యులు కూడా లొంగిపోయి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్బంగా కోరారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,చర్ల సిఐ రాజు వర్మ,ఎస్‌ఐ నర్సిరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.