21-03-2025 01:39:30 AM
ఎమ్మెల్యే కోవలక్ష్మి
కుమ్రం భీం ఆసిఫాబాద్,మార్చి20(విజయ క్రాంతి): నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే కోవలక్ష్మి ఉన్నారు. శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ సౌజన్యంతో తన ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని యువతులకు స్థానిక రోజ్ గార్డెన్ లో నిర్వహించిన జాబ్ మేళా కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. దానికోసమే నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని ద్వారా హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీలో ఉత్పత్తి కేంద్రాల వద్ద ప్యాకింగ్ సెక్షన్ లో యువతులు పని చేయాల్సి ఉంటుందని తెలిపారు.
నియోజకవర్గ నుండి 2000 మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. యువతులు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా ముందుకు రావాలన్నారు. జాబ్ మేళా నిర్వహణకు యువతులు పెద్ద ఎత్తున తరలి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు నాయకులు మాట్లాడుతూ వెనుకబడిన నియోజకవర్గంలో యువతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిని అభినందించారు.
ఎస్కేఎస్‌ఎస్ ఫీల్ మేనేజర్లు కృష్ణ, శివ లు మాట్లాడుతూ యువతులకు 19,000 రూపాయలు వేతనం చెల్లించడంతోపాటు ఈఎస్‌ఐ, పిఎఫ్ ఉంటుందన్నారు. అవకాశాలు ఎప్పుడు రావని వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే కృషితో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత ఆమెకు విధేయులుగా ఉండాలన్నారు. వెంటనే ఉద్యోగంలో చేరిన వారికి బోనస్ చెల్లించడం జరుగుతుందన్నారు. అనంతరం యువతుల వద్ద నుండి అప్లికేషన్లు స్వీకరించడంతోపాటు హైదరాబాద్ వరకు వెళ్లడానికి సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.
జాబ్ మేళాకు స్పందన రావడం పట్ల పార్టీ నాయకులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు కోవ సాయినాథ్, సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహమ్మద్, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్, మాజీ ఎంపీపీ సౌందర్య, జిల్లా నాయకులు పోచయ్య, సంజీవ్, గంధం శ్రీనివాస్, నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.