11-04-2025 01:28:48 AM
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి
నల్లగొండ, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మేల్యే కుందూరు జైవీర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలో నిర్మించిన బస్తీ దవఖానను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైలాన్ కాలనీలో కమలానెహ్రూ ఆసుపత్రికి అనుసంధానంగా బస్తీ దవాఖాన పనిచేస్తుందని అన్నారు.
హాలియాలో సైతం బస్తీ దవాఖాన ఏర్పాటు చేసేలా వైద్యఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడతానన్నారు. త్వరలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను నియోజకవర్గానికి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. ఆయా సబ్ సెంటర్ల పరిధిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు కృషి చేయాలన్నారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ,మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రామకృష్ణ ,ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.