24-04-2025 02:21:15 AM
హనుమకొండ, ఏప్రిల్ 23(విజయక్రాంతి): 14 ఏళ్ల పాటు నిర్విరామంగా అన్నివర్గాల సమన్వయంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషిచేసిన బీఆర్‌ఎస్, ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజల గుండెచప్పుడును వినిపించడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకల ఏర్పాట్లను ఆయన బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడానికో, ప్రజల్ని రెచ్చగొట్టడానికో సభను నిర్వహించడం లేదని, 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న వేడుక మాత్రమేనని ఉద్ఘాటించారు. గతంలో ఉద్యమ పార్టీగా బీఆర్‌ఎస్‌ను హిమాలయాల స్థాయికి తీసుకువెళ్లిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు.
గులాబీ జెండా అన్ని వర్గాలకు అండగా ఉంటుందని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా గులాబీ జెండా వైపే చూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే తమ పార్టీ పనిచేస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. పాతికేళ్ల బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుక చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని కేటీఆర్ వెల్లడించారు.
వేడుకకు వచ్చే ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు, అతిథులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. 1,250 ఎకరాల్లో నిర్వహించనున్న వేడుకకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతాయని తెలిపారు. ఇందులో వెయ్యి ఎకరాలు పార్కింగ్ కోసం కేటాయించినట్టు పేర్కొన్నారు.
తాగునీటి వసతి, వైద్య సహాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ సరఫరాపై నమ్మకం లేకపోవడంతో ప్రత్యేకంగా సభ పూర్తయ్యేంతవరకు విద్యుత్ జనరేటర్లతో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు కేటీఆర్ స్పష్టం చేశారు. అంతకుముందు పహల్గాం ఉగ్రదాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించారు.