calender_icon.png 28 November, 2024 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాటుసారా నిర్మూలనే లక్ష్యం

18-05-2024 01:37:04 AM

మూడు నెలల్లో పూర్తిగా అరికట్టేలా చర్యలు

నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై ప్రత్యేక నిఘా

అధికారుల సమావేశంలో కమిషనర్ శ్రీధర్ ఆదేశాలు

దాడులతోనే నాటుసారా నిర్మూలన సాధ్యమన్న డైరెక్టర్ కమలాసన్ రెడ్డి 

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17 (విజయక్రాంతి): ఎక్సైజ్ శాఖ లక్ష్యాలను చేరుకోవాలంటే అధికారులతో పాటు సిబ్బంది నిబద్ధతతో పని చేయాలని ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం అబ్కారీ భవన్‌లో తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పూర్తిగా నిషేధించిన నాటుసారా తయారీ, మళ్లీ 26 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో తయారవుతున్నట్లు దాడుల్లో బయటపడిందన్నారు.

మూడు నెలల్లో నాటుసారాను పూర్తిగా అరికట్టాలని ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్, పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. నాటుసారా విషయంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్‌గా ఉందన్నారు. నాటుసారాతో పాటు ఎన్నికల సందర్భంగా చాలా ప్రాంతాల్లో నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉన్నందున  అలాంటి వాటిపై ప్రత్యేకమైన నిఘా పెట్టి దాడులు నిర్వహించాలని ఆదేశించారు. పట్టణాల్లో, ఫంక్షన్ హళ్లలో, ఫామ్‌హౌజ్‌ల్లో జరిగే పార్టీల్లో మద్యం వినియోగానికి ఎక్సైజ్ శాఖ అనుమతులు ఇస్తున్నప్పటికీ.. ఆయా ప్రదేశాల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మార్కెట్‌లోకి రాకుండా ఎక్సైజ్ శాఖ నిఘా పెట్టాలని సూచించారు.

ప్రధానంగా వేసవిలో బీరు స్టాక్ తక్కువగా ఉన్నందున, సరఫరా పెంచి మద్యం దుకాణాల్లో బీర్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాలు, వాణిజ్య పన్నుల శాఖ సూచనలను పాటించాలని కోరారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీ.బీ.కమలాసన్ రెడ్డి మాట్టాడుతూ.. నాటుసారా తయారీకి వినియోగించే ముడి సరుకు రవాణాపై ప్రత్యేక నిఘా పెంచి, దాడులు నిర్వహించి నాటుసారా తయారీని అరికట్టాలన్నారు. ఆగస్టు నాటికి నాటుసారాను పూర్తిగా నిర్మూలించడానికి ప్రణాళికలు రూపొందించుకుని కార్యాచరణ చేపట్టాలని ఆదేశిం చారు.

నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యాన్ని రవా ణా కాకుండా చర్యలు చేపట్టాలని, కల్తీ కల్లు తయారీకి వినియోగించే సీహెచ్, అలం, డైజోఫాం లాంటి పదార్థాలను దాడులు నిర్వహించి పట్టుకోవాలని, గంజాయి, నార్కోటిక్, ఇతర మత్తు మందుల తయారీ, దిగుమతి, అమ్మకాలపై నిఘా పెట్టాలని ఆదేశించారు. అవసరమైతే జిల్లాల్లోని పోలీసుల సహకారం తీసుకుని నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపాలని కోరారు. సమావేశంలో తెలంగాణ జిల్లాల ఏసీలు, డీసీలు, డీపీఈఓలు పాల్గొన్నారు.