11-04-2025 01:35:54 AM
యంగ్ ఇండియా నా బ్రాండ్: సీఎం రేవంత్‌రెడ్డి
రాజేంద్రనగర్, ఏప్రిల్ 10: నా బ్రాండ్ యంగ్ ఇండియా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో యంగ్ ఇండియా స్కూల్‌ను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. యేటా లక్షల మంది ఇంజినీరింగ్ పట్టభద్రులు బయటకు వస్తున్నా.. వారిలో ఏమాత్రం నాణ్యత లేదన్నారు. అలాంటి వారి కోస మే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ని ప్రారంభించుకున్నామని, దానిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌తో తీసుకొచ్చినట్టు చెప్పారు.
యువతకు ఉపాధి కల్పించడమే తన సంకల్పమని సీఎం స్పష్టం చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్)లో భాగంగా ప్రైవేట్ కంపెనీలు, ఐటీ కంపెనీలు పోలీస్ స్కూల్‌కు ఆర్థిక సాయం అందించాలని సూచించారు. గండిపేట మండలం నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను గురువారం సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు, మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, కంభంపాటి అనిల్‌కుమార్, డీజీపీ డాక్టర్ జితేందర్, హైదరాబాద్ సీపీ, యంగ్ ఇండియా స్కూల్ చైర్మన్ సీవీ ఆనంద్‌తో కలిసి ప్రారంభించారు.
అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఖాకీ డ్రెస్ వేసుకున్న హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి వరకు వారి పిల్లలను ఇక్కడి పాఠశాలలో చదివించొచ్చాన్నారు. తనకు పోలీసు శాఖపై ప్రత్యేక అవగాహన, అనుబంధం ఉందన్నారు. పోలీసుల పిల్లల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. గత అక్టోబర్ 21న శంకుస్థాపన చేసి కొద్దిసమయంలోనే ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
తాను సీ ఎం అయి 16 నెలలు అయిందని, మీ బ్రాం డ్ ఏంటని పలువురు విశ్లేషకులు, విలేకర్లు అడుగుతున్నారని, నా విజన్ ఎంటో అర్థం చేసుకునే స్థితిలో వారు లేరని ఈ సందర్భం గా సీఎం వారికి చురకలు అంటించారు. ప్ర తీ ఒక్కరికి ఒక బ్రాండ్ ఉంటుందని, తెల్లబి య్యం చూస్తే ఎన్టీఆర్ గుర్తుకొస్తారని, ఐటీ అంటే చంద్రబాబు.., జలయజ్ఞం, ఉచిత విద్యుత్ అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ గుర్తుకొస్తారని..
అవి వాళ్ల బ్రాండ్ అని, నా బ్రాండ్ యంగ్ ఇండియా అని ముఖ్యమంత్రి ప్రకటించారు. పీవీనరసింహరావు దేశానికీ దార్శనికుడు అని, ఆయన ఒక విజన్‌తో ప్రపంచానికి మనమేంటో చాటి చెప్పా రని తెలిపారు. మనం ప్రపంచంతో పోటీ ప డుతున్నామని, ప్రజలు ఇచ్చిన అధికారం పె త్తనం చెలాయించడానికి కాదని పేర్కొన్నారు.
ప్రజాపాలన మా విధానం..
నూట నలభై కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశం నుంచి ఎంతోమంది క్రీడాకారు లు ఒలంపిక్స్‌లో పాల్గొన్నా ఒక్క గోల్డ్ మె డల్ కూడా రాకపోవడం విచారకరమని సీ ఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తా ను సౌత్ కొరియన్‌లో స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఒకమ్మాయిని కలిశానని, ఆమె గోల్డ్ మెడల్ సాధించినట్లు చెప్పిందని సీఎం పే ర్కొన్నారు.
యువత ఉపాధి కోసం తాను కంపెనీల యజమానులతో మాట్లాడితే.. చాలామంది యువత దరఖాస్తులు కూడా నింపలేని పరిస్థితిలో ఉన్నట్లు వారు చెప్పారని సీఎం విచారం వ్యక్తం చేశారు. అలాంటి వారి కోసమే యంగ్ ఇండియా స్కిల్ యూ నివర్సిటీని ప్రారంభించామన్నారు. గొప్పపేరున్న పారిశ్రామికవేత్త ఆనంద్ మహీం ద్రాను ఒప్పించి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌గా చేశామని, దాన్ని ఆయన విజయవంతంగా నడిపిస్తున్నారని తెలియజేశారు.
రాజకీయాలకు అతీతంగా అపోలో గ్రూప్స్ నడిపిస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలాంటి వారిని అందులో డైరెక్టర్లుగా నియమించినట్లు గుర్తుచేశారు. సిరాజుద్దీన్, నిఖత్ జరీన్‌కు డీఎస్పీ పోస్టులు ఇచ్చినట్లు తెలిపారు. 4 ఏళ్లు యూనివర్సిటీలో చదివిన వారికి విదేశాల్లో చదువుకునే అవకాశం ఇస్తామన్నారు. ఫస్ట్ బ్యాచ్‌లో అందరికీ అవకాశాలు ఉద్యోగాలు వచ్చాయని, సిలబస్ నుంచి శిక్షణ వరకు కార్పొరేట్ కంపెనీలే కల్పిస్తున్నట్లు సీఎం తెలియజేశారు.
ప్రతీ నియోజకవర్గంలో ఒక స్కూల్..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో అధునాతన వసతులు కల్పిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రతీ ని యోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతీ స్కూల్‌కు రూ.200 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినట్లు తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఉన్న ప్రభుత్వ బడుల విధానంలో మార్పులు తీసుకొచ్చి ప్రీ స్కూల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు.
ప్రైవేట్, ప్రభుత్వ స్కూళ్లకు తేడాలు ఉన్నాయని, మన విద్యావిధానంలో లోపం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపేందుకు మొగ్గు చూపిస్తున్నారన్నారు. ప్రాథమి క స్థాయిలోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకోకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్నారు. అందుకే ఫ్రీ రవాణాతోపాటు వారికి లంచ్ కూడా ఇచ్చేం దుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
“ప్రైవే ట్ స్కూళ్లకు దీటుగా పోలీసుల కోసం ప్రత్యే క స్కూల్ ప్రారంభించాం.. మీరొక ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేయండి.. మీ వెంట నేను ఉన్నా.. ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉ న్నా..” అని భరోసా ఇచ్చారు. అనంతరం స్పోర్ట్స్ డ్రెస్, వాటర్ బాటిల్స్ తదితరాలు ఉన్న మ్యాజిక్ బాక్స్‌లను సీఎం విద్యార్థులకు అందజేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో పోలీస్ స్కూల్: మంత్రి శ్రీధర్‌బాబు
అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇం డియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అతితక్కువ కాలంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించుకోవడం కోసం సీఎం ఎంతో కృషి చేశారని అభినందించారు. డీజీ పీ డాక్టర్ జితేందర్ మాట్లాడుతూ.. పోలీసు ల సంక్షేమం కోసం సీఎం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలియజేశారు.
హైదరాబాద్ సీపీ, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ చైర్మన్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. యంగ్ ఇండియా స్కూల్‌ను పోలీసుల పిల్లలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓపెన్ కేటగిరి లో ఎక్కువ ఫీజు ఉండటంతో కొన్ని సీట్లు మిగిలిపోయాయని, ఫీజును తగ్గించేందుకు కమిటీతో చర్చలు జరుపుతున్నామన్నారు.
యంగ్ ఇండియా స్కూల్‌ను మనం ఊహించలేదని, సీఎం ప్రత్యేక కృషితో ప్రారంభిం చినట్లు వివరించారు. అంతుకు ముందు యంగ్ ఇండియా స్కూల్‌కు ఆర్థిక సాయం చేసిన విశాల్ గోయల్, ఎస్వీ రెడ్డి, శరత్‌ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.