calender_icon.png 6 October, 2024 | 10:05 AM

లక్ష్యం కొండంత.. వచ్చేది గోరంత

06-10-2024 02:18:45 AM

సెప్టెంబర్‌లో భారీగా తగ్గిన జీఎస్టీ వృద్ధిరేటు

గతేడాది సెప్టెంబర్‌లో 17 శాతం గ్రోత్

2024లో కేవలం 1 శాతం మాత్రమే

హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖ రాబడులు ఆశించిన స్థాయిలో రాకపోవడం ప్రభు త్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. 2024-25 లో వాణిజ్య పన్నుల శాఖకు రూ.85 వేల కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ధేశించింది. ప్రతినెల 18 శాతం వృద్ధిరేటును సాధించడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చని ప్రభుత్వం భావించింది.

కానీ వాణిజ్య పన్నులశాఖ నెలలవారీగా లక్ష్యాన్ని చేరుకోలేకపోతోం ది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏ నెలలో కూడా జీఎస్టీ వసూళ్లలో 18 శాతం వృద్ధి సాధించలేదు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అతితక్కువగా ఒక్క శాతం మాత్ర మే వృద్ధిరేటు నమోదు కావడం ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేసింది. ఈ ఏడాది అధికంగా ఏప్రిల్, మేలో 11 శాతం చొప్పున జీఎస్టీ వృద్ధిరేటు నమోదైంది. జూన్‌లో 5.3 శాతం, జులైలో 2 శాతం, ఆగస్టులో 4 శాతంగా ఉంది.

2023, సెప్టెంబర్‌లో భారీగా వృద్ధిరేటు

2023-24 ఆర్థిక సంవత్సరంలోని సెప్టెంబర్ మాసంలో జీఎస్టీ రాబడులు భారీగా పెరిగాయి. 2022లో పోలిస్తే.. 2023లో 17 శాతం ఎక్కువ జీఎస్టీ రాబడులు వచ్చాయి. కానీ ఈ ఏడాది కేవలం 1 శాతం మాత్రం ఎక్కువ వసూలైంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది రెండు త్రైమాసికాల్లో కలిసి గతేడాది కంటే 7 శాతం ఎక్కువ జీఎస్టీ వసూలైనట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇదే సమయానికి గతేడాది జీఎస్టీ వసూళ్లలో వాణిజ్య పన్నుల శాఖ 13 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంటే.. ఈ ఏడాది దాదాపు ఆరుశాతం తగ్గింది.

8 శాతం నుంచి 9 శాతం మాత్రమే వృద్ధి

జీఎస్టీ వసూళ్లు ఆశించిన స్థాయిలో రాకపోవడంపై ప్రభుత్వం ఆలో చనలో పడింది. ప్రభుత్వ ట్యాక్స్ రెవెన్యూలో జీఎస్టీ వాటా 63 శాతంగా ఉంది. ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభుత్వానికి వాణిజ్య పన్నుల శాఖలో 100 శాతం రాబడిని సాధించడం అనివార్యంగా మారిం ది.

ఈ క్రమంలో జీఎస్టీ వసూళ్లను ఎలా పెంచాలనే అంశంపై కమిషనర్‌తో పాటు అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం సగటున 18 శాతం వృద్ధిని లక్ష్యంగా నిర్ధేశించగా.. వాణిజ్య పన్నుల శాఖ ఎంత కష్టపడినా 8 శాతం నుంచి 9 శాతానికి మించి వార్షిక వృద్ధిరేటు నమోదయ్యే పరిస్థితి కనపడటం లేదని వాణిజ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.