calender_icon.png 23 December, 2024 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరుగైన విద్య, వైద్యమే లక్ష్యం

23-12-2024 01:52:50 AM

 వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ 

 నిజామాబాద్ జిల్లా రెంజల్‌లో పీహెచ్‌సీ ప్రారంభం

కామారెడ్డ్డి, డిసెంబర్ 22 (విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందించడం, సామాజిక భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించి, మాట్లాడారు.

ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్యం, విద్య, సామాజిక భద్రతను ప్రజలకు కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్గనిర్దేశంలో ముందుకెళ్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఆయా ప్రాంతాల అవసరాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్గ నిర్దేశంలో తీరుస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 300 పైచిలుకు హెల్త్ సబ్ సెంటర్లు, 170 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించామన్నారు.

మరో 85 అంబులెన్స్‌లను అందుబాటులోకి తెస్తామని వివరించారు. 102 అమ్మ ఒడి వాహనాలు కూడా ఆయా ప్రాంతాలకు సమకూరుస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని కాపాడేందుకు జాతీయ రహదారులపై ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాటికి అంబులెన్స్‌లను అనుసంధానం చేస్తామని తెలిపారు.

నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు క్యాన్సర్ చికిత్స కేంద్రాలతో పాటు వాస్క్యులర్ యాక్సెస్ సెంటర్‌లు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యతక ఉందని గుర్తించినట్టు తెలిపారు. వైద్య సేవల కోసం పేద ప్రజలు అప్పుల పాలు కాకుండా, ఆభద్రతాభావానికి గురికాకుండా వారికి అన్ని విధాలుగా ఆరోగ్య భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందన్నారు.

 ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందేలా ప్రతి చోట సరిపడా 90 శాతం వరకు ఖాళీలను భర్తీ చేస్తున్నామని మంత్రి దామోదర చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ఆలీ, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హుందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌అంతిరెడ్డి రాజిరెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఎంహెచ్‌వో రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.