జైనమతానికి మొదటి నుంచి కొలనుపాక ప్రధాన కేంద్రంగా ఉంది. తెలంగాణలో నేటికీ ఆకట్టుకుంటున్న ఏకైక జైన క్షేత్రంగానూ పేరుంది. కళ్యాణి చాళుక్యుల కుమార తైలపుడు ఇక్కడ జైనాలయం నిర్మించాడు. ఈ దేవాలయం శ్వేతంబర శాఖకు ప్రధానమైంది. ఈ ఆలయంలో జైన తీర్థంకరుల విగ్రహాలు, అద్భుత కట్టడాలు నేటికీ పదిలంగా ఉన్నాయి.
ఆ విశేషాలే ఈవారం ఖజానాలో..
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని శ్వేతంబర ఆలయం జైనుల పవిత్ర తీర్థ స్థలంగా విరాజిల్లుతోంది. ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక ఆనవాళ్లున్న కొలనుపాక దక్షిణ భారతదేశంలోనే జైన ఆలయంగా గుర్తింపు పొందింది. దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్ర గల ఆలయంలో జైన తీర్థంకరుల్లో ముఖ్యులైన ఆదిదేవ్ రిషబ్‌నాధ్. నేమీనాధ్, మహావీర్ విగ్రహాలు కొలువైనాయి.
జైన ధర్మంలో మొట్టమొదటి తీర్థంకరుడు రిషబ్‌నాధ్‌ను ఆదిదేవుడిగా వ్యవహరిస్తారు. ఈ ఆలయ సముదాయంలో 24 మంది తీర్థంకరులు విగ్రహాలతోపాటు జైనుల ప్రధాన దేవత, భగవాన్ మాణిక్యదేవ్ విగ్రహాలు కూడా కనిపిస్తాయి. హైదరాబాద్ నగరానికి 77 కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయాన్ని పౌర్ణమి రోజుల్లో 15 సార్లు సందర్శించి పూజలు చేస్తే జీవితంలోని కష్టాలు దూరమవుతాయని శ్వేతంబరుల ప్రగాఢ విశ్వాసం.
సన్యాస దీక్ష చేపట్టడం జైనుల ప్రధాన ఆచారం. భౌతికమైన కోరికలు కాదు.. స్వచ్ఛమైన మనస్సుతోనే మోక్షం ప్రాప్తిస్తుందని ప్రగాఢ నమ్మకం. జీవిత చరమాంకంలో తమ ప్రతిజ్ఞను నెరవేర్చడానికి సన్యాస దీక్షకు ఈ క్షేత్రం ప్రసిద్ధమైనదిగా భావిస్తుంటారు. ఈ క్షేత్రంలో ప్రతి 12 ఏళ్లకు మహా మస్తకాభిషేకం అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మహావీరుడి విగ్రహాన్ని పాలు, తేనే, పెరుగుతో అభిషేకించి, కుంకుమ పువ్వుతో కప్పి ఉంచుతారు. ఈ ఉత్సవాలకు దేశ నలుమూలల నుంచి జైనులు భారీగా తరలివచ్చి మహావీరుడి ఆశీస్సులు పొందుతారు.
ప్రాచీన ఆలయం
కొలనుపాక శ్వేతంబర జైన ఆలయం ద్రవిడ శిల్పశైలిలో అద్భుతంగా నిర్మించారు. 4వ శతాబ్ధానికి పూర్వమే తెలంగాణ ప్రాంతంలో జైన మత ప్రాబల్యం ఎక్కువగా ఉండేదని, జైన ధర్మ వ్యాప్తికి ప్రధాన కేంద్రంగా కొలనుపాక ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. కొలనుపాక జైన ఆలయ పరిసరాల్లో 20 జైన శాసనాలు లభ్యంకావడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొంటారు. రాష్ట్రకూటుల కాలంలో కూడా కొలనుపాక జైన ధర్మ ప్రచార కేంద్రంగా విరాజిల్లింది. పౌరాణిక ఆధారాల ప్రకారం కొలనుపాక జైన ఆలయాన్ని మహారాజు దుశ్యంతుడు, శకుంతల తనయుడు భరత చక్రవర్తి నిర్మించినట్టుగా కూడా చెబుతుంటారు.
అద్భుత శిల్ప కళ
కొలనుపాక ఆలయ ప్రవేశ ద్వారం కోటను తలపిస్తుంది. ద్వారానికి ఇరువైపుల నల్లటి ఐరావతాలు లోపలికి ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటాయి. ఎర్రటి ఇసుక రాయితో ఆలయం, ప్రాకార మండపాలు నిర్మించగా, తెల్లరాతితో స్తంభాలను ఏర్పాటుచేశారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ ప్రాకారం విస్తరించగా ఆలయం మాత్రం ఒక ఏకరం స్థలంలో నిర్మితమైంది. అయితే ప్రాచీన నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకోగా, ఆలయ పాలక మండలి 2005లో పునరుద్ధరించారు.
రాజస్థాన్ రాతి శిలలతో 150 మంది శిల్పులు శ్రమించి నిర్మించిన ఆలయ ముఖ మండప, ప్రాకార ద్వారాలు ప్రస్తుతం కనువిందు చేస్తున్నాయి. ఈ ఆలయం జైన తీర్థంకరుల అందమైన చిత్రాలతో అలంకరించి ఉంటుంది. జైన తీర్థంకరులల్లో అతి ముఖ్యుడు మహావీర్ విగ్రహం ప్రపంచంలోనే విలువైన విగ్రహంగా భావిస్తుంటారు. అలాగే మాణిక్యనాథ్ విగ్రహం, ఆదినాథ్ విగ్రహం అత్యంత ముఖ్యమైనవే. ఆలయానికి ఇరువైపుల ఎనిమిది మంది తీర్థంకురుల విగ్రహాలు ప్రత్యేక శైలిలో నెలకొల్పారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయాన్ని జైనులు మాత్రమే కాకుండా ఇతర ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు సందర్శిస్తుంటారు.
కాకతీయుల పతనం తర్వాత..
కొలనుపాక ఒకప్పుడు ఏడు వేల గ్రామాలకు రాజధాని. ఆ గ్రామ ప్రజలకు వీరశైవ తత్వాన్ని బోధించి, మోక్షమార్గాన్ని అనుసరించేలా చేయడం కుల గురువుల బాధ్యత. ఆచార్యుల బతుకుదెరువు, కులమఠంలోని సన్యాసుల పోషణ, శివ పూజల నిర్వహణ కోసం ఏడువేల గ్రామాలవారు ధనం, ధాన్యం ఇచ్చేవారు. కాబట్టే, కులమఠాల్లో ధూపదీప నైవేద్యాలకు లోటు రాలేదు. శివరాధన, వీరశైవ బోధన నిరాటంకంగా కొనసాగింది. కాకతీయుల పతనం తర్వాత ముస్లింలు అధికారంలోకి వచ్చారు.
దీంతో వీరశైవులకు కష్టాలొచ్చాయి. కొలనుపాక కులమఠాలకు ఇచ్చే దానాలపై సుల్తానులు పన్ను విధించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. దీంతో కొలనుపాక గురువులు, మఠాధిపతులు నేరుగా గోల్కొండ నవాబు వద్ద గోడు వెళ్లబోసుకున్నారట. ఆ విన్నపానికి ఏలినవారు సానుకూలంగా స్పందించారు. గ్రామగ్రామాన వీరశైవం ప్రచారం చేసుకోవడానికి.. దాన, ధర్మాలు స్వీకరించడానికి అనుమతిస్తూ ఫర్మానా జారీ చేసినట్టు చరిత్రలో ఉంది.
ఆ పేరు ఎలా వచ్చిదంటే
కొలను అంటే సరస్సు, పాకా అంటే గుడిసె అని అర్థం. ఇక్కడ చాలా సరస్సులు, గుడిసెలు ఉండేవి కాబట్టి దీనికి ఈ కొలనుపాక పేరు వచ్చింది. అయితే ఇక్కడ ఉన్న సోమేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని చాళుక్యులు 800 సంవత్సరాల క్రితం స్థాపించారు.
తీర్థంకరులు, బాహుబలి విగ్రహాలు
కొలనుపాకలోని ప్రసిద్ధ జైన దేవాలయ ప్రాంగణంలో ఉన్న జైనశిల్ప సంగ్రహాలయంలో వందలోపు శిల్పాలు, శాసనాలు ఉన్నాయి. ఇవి ఎంతో అపురూపమైనవని చరిత్రకారులు చెబుతున్నారు. వీటిలో జైనముఖి స్తంభాలు, జైన స్తూప ప్రతిమ, యక్షిణులు, గురువులు, తీర్థంకరులు, బాహుబలి విగ్రహాలు ముఖ్యమైనవి. సంగ్రహాలయం బయట కనిపించిన ఓ రాతిస్తంభంపై జైన మహావీరుడు, వ్యాస పీఠానికి ఎదురుగా వ్యాఖ్యాన ముద్రలో కూర్చున్న జైన గురువు ప్రతిమలు ఉన్నాయి. శాసనాల్లోని లిపిని బట్టి ఇవి కల్యాణి చాళుక్యుల కాలం (10,11వ శతాబ్దాలు) నాటివని తెలుస్తోంది.
మీరు చూడాలనుకుంటున్నారా?
కొలనుపాకలో ఆలయానికి చేరుకోవాలంటే ముందుగా భువనగిరి కేంద్రం నుంచి సుమారు 34 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలనుపాక ఆలయానికి చేరుకోవాలి. ఆ తర్వాత కొలనుపాక బస్టాండ్ నుంచి జైన దేవాలయానికి ఆటోలు లేదా గుర్రపు బగ్గీల్లో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి అయితే 77 కిలోమీటర్ల ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు పర్యాటకుల సందర్శన కోసం తెరిచే ఉంటుంది.
వన్ డే ట్రిప్‌లో కూడా ఈ ప్రాంతాన్ని చూసేయొచ్చు. పర్యాటకుల కోసం తెలంగాణ టూరిజం ఓ స్పెషల్ టూర్ ప్యాకేజీ కూడా ప్రకటించింది. ఈ ప్యాకేజీలో భాగంగా అతి తక్కువ ధరతో కొలనుపాకలోని జైన మందిరంతోపాటు యాదాద్రి ఆలయాన్ని కూడా సందర్శించొచ్చు.