calender_icon.png 4 October, 2024 | 6:26 PM

గోమాత వైభవం

04-10-2024 12:00:00 AM

సుబ్రమణియన్ స్వామి :

పాశ్చాత్య ప్రభావం ఉన్న మన మేధావులు ఆవు ప్రస్తావన వచ్చినప్పుడల్లా వెక్కిరిస్తారు. అదే మేధావులు యోగాపై మొదట చిన్నబుచ్చుకున్నారు. ఇప్పుడు విందులు, వినోదాల సమావేశాలలో ప్రాణాయామం చేయడం ఒక ఫ్యాషన్‌గా మారింది. పాశ్చాత్య దేశాలలో గోహత్యకు సంబంధించిన వాదనలు ఇప్పుడు వివాదాస్పదంగా లేవు.

ఒకప్పుడు సన్యాసులను ‘దేవతలు’ అంటూ ఎగతాళి చేసిన వారే ఇప్పుడు తమ శ్వేతజాతీయులతో కలిసి ఆశ్రమాలకు తరలి వస్తున్నారు. ఎవరికి తెలుసు, త్వరలో వారి పెరట్లో కూడా ఒక ఆవు వెలుస్తుందేమో.

15 కోట్ల ఆవులు

భారతదేశంలో 15 కోట్ల ఆవులు ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటీ సంవత్సరానికి సగటున 200 లీటర్లకు తక్కువ కాకుండా పాలు ఇస్తుంది. ఒకవేళ ఇజ్రాయెల్ ఆవు మాదిరిగానే వాటికి తగినంత పోషకాహారం, సరైన సంరక్షణ అందించగలిగితే 11,000 లీటర్ల వరకూ ఇవ్వగలవు. ఈ లెక్కన చూస్తే, మన ఆవు ఒక్కటే ప్రపంచం మొత్తానికి కావలసిన పాలను అందించగలదు. నేడు మనం ఉత్పత్తి చేసే ఆవు పాలు ప్రపంచంలోనే అత్యంత చౌకైనవి. మెరుగైన ఉత్పత్తితో మనం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఎగుమతిదారుగా మారగలం కూడా. తద్వారా భారతదేశానికి అతిపెద్ద విదేశీ మారక ద్రవ్యమూ రాబట్టవచ్చు.

సాక్షాత్ విష్ణు స్వరూపం

ఋగ్వేదంలో ఆవును దైవత్వానికి ఎత్తారు. భరద్వాజ మహర్షి బోధించిన శ్లోకం ఆవు సద్గుణాన్ని గొప్పగా కీర్తిస్తుంది. అథర్వ వేదం ఆవును అధికారికంగానే శ్రీవిష్ణువుగా పేర్కొంది. భారతీయ సమాజం ఆవును గోమాతగా సంబోధిస్తుంది. పాల సముద్ర మథనం వల్ల ఆవు ఆవిర్భవించిన విషయం మనకు తెలుసు. అయిదు దివ్య కామధేనువులు (నంద, సుభద్ర, సురభి, సుశీల, బహుళ) పాల కడలి నుండి ఉద్భవించాయి. అవి ఆవుపట్ల గౌరవాన్ని, అపారమైన విశ్వాసాన్ని సూచిస్తాయి.

రక్షణకు కఠిన చట్టాలు ఉండాలి

2003లో జస్టిస్ జి.ఎం.లోధా ఆధ్వర్యంలోని పశువులపై ఏర్పాటైన జాతీయ కమిషన్ తన సిఫార్సులను అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వానికి సమర్పించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల దృష్ట్యా ‘ఆవును, దాని సంతానాన్ని’ రక్షించడానికి కఠినమైన చట్టాలను రూపొందించాలని ఆ నివేదిక కోరింది. రాష్ట్ర విధాన నిర్దేశిక సూత్రాల ప్రకారం, ‘రాజ్యాంగ పరమైన ఆవశ్యకతగానూ దీనిని భావించాలి’.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ఇలా చెబుతోంది: “వ్యవసాయం, పశుపోషణను ఆధునిక, శాస్త్రీయ మార్గాల్లో నిర్వహించడానికి రాష్ట్రం (స్టేట్) ప్రయత్నిస్తుంది. ప్రత్యేకించి, జాతులను సంరక్షించడానికి, మెరుగు పరచడానికి, ఆవులు దూడలను, ఇతర పాలను ఇచ్చే పశువుల వధ నిషేధానికి చర్యలు తీసుకోవాలి”.

1857 నాటి మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో బహదూర్ షా జాఫర్‌ను కొద్ది కాలంపాటు ఢిల్లీలో చక్రవర్తిగా నియమించారు. అప్పుడు ఆయన చేసిన ఒక ప్రకటనపై అతని హిందూ ప్రధాని, ‘గోహత్యను మరణశిక్ష విధించగల నేరం’గా పరిగణించారు. మహారాజా రంజిత్ సింగ్ రాజ్యంలో ‘ఉరిశిక్ష విధించడానికి అర్హమైన ఏకైక నేరంగా గోహత్యను మాత్రమే పేర్కొన్నారు.

నాలుగు రకాల ప్రయోజనాలు

అటు వేదశాస్త్రాలు, ఇటు ఆయుర్వేద - ఆధునిక విజ్ఞానం మేరకు భారతీయ దేశీయ ఆవు మానవ ఉపయోగానికి నాలుగు ఉత్పత్తులను అందిస్తున్నది. అవి: పాలు, నెయ్యి, గోమూత్రం, గోమయం. ఆవు పాలలో కొవ్వు, కార్బోహైడ్రేట్స్, ఖనిజాలు, విటమిన్ మాత్రమేకాదు, రేడియేషన్ నుంచి శరీరాన్ని సంరక్షించగల నిరోధకశక్తి కూడా ఉంది. మెదడు కణాల పునరుత్పత్తికి ఆవుపాలు దోహదం చేస్తాయి.

ఆవు నెయ్యి అనేక శారీరక రుగ్మతలను పోగొడుతుంది. యజ్ఞయాగాలలో దీనిని వాడడం వల్ల గాలిలోని ఆక్సిజన్ స్థాయిని మెరుగు పరుస్తుంది. మొత్తం 8 రకాల మూత్రాలను ఈ రోజుల్లో ఔషధ ప్రయోజనాలకు ఉపయోగిస్తుండగా, వాటిలో ఆవు మూత్రాన్ని ఉత్తమమైందిగా నిపుణులు పరిగణిస్తున్నారు. అమెరికన్లు దీని పేటెంట్ కోసమూ కృషి చేస్తున్నారు.

యాంటీ క్యాన్సర్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు గలదిగా గోమూత్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ‘రోగ నిరోధక -మాడ్యులేటర్’ లక్షణాలనూ కలిగి ఉంది. రోగనిరోధక లోపంతో వచ్చే వ్యాధుల నివారణకూ గోమూత్ర చికిత్స ఉపయోగ పడుతుందని నిపుణులు అంటున్నారు.

ఆవు మూత్రాన్ని ఒక ఔషధంగా అనేక శాస్త్రగ్రంథాలు సూచిస్తున్నాయి. పార్సీలు సైతం ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. చివరగా, గోమయం (పేడ) కూడా గోమూత్రం అంత స్థాయిలో విలువైంది. పర్యావరణాన్ని శుద్ధి చేయడానికి దీనికి ఉపయోగిస్తారు. కారణం, ఇది రేడియమ్‌ను కలిగి ఉండటమేకాక రేడియేషన్ ప్రభావాలను తనిఖీ చేస్తుందనీ నిపుణులు అంటున్నారు.