25-01-2025 12:00:00 AM
ఎన్నాళ్ల నుంచో ‘ఉత్తరకాశికి వెళ్లాలి, గంగోత్రిని దర్శించాలి’ అన్న కోరిక 2023లో నెరవేరింది. హైదరాబాదు నుంచి డెహ్రాడూన్‌కు విమానంలో వెళ్లి అక్కడ్నించి గుట్టలమీదుగా నాలుగు గంట ల ప్రయాణిస్తే కాని ఉత్తరకాశి రాదు. దారి లో ఆకాశాన్ని తాకే దేవదారు వృక్షాలు దారి కి ఇరుపక్కల స్వాగతం చెప్పాయి. ఆపిల్ పళ్ల వృక్షాలు పొట్టిగా ఉండి, అడుగడుగునా కనువిందు చేశాయి.
ఉత్తరకాశిలోని ‘శివానందాశ్రమం’లో నా బస. ఆశ్రమానికి ఆనుకొని గంగమ్మ ప్రవహిస్తుంది. ఉత్తరకాశి నుంచి మరో 4 గంటలు ప్రయాణించి గంగోత్రిని దర్శించాను. దగ్గర నుంచి హిమాలయాలను దర్శించే భాగ్యం కలిగింది. ఎన్ని యుగాల నుంచి గంగమ్మ ప్రవహిస్తుందోగాని, ఆమె వేగానికి అడ్డు లేదు.
ఆ జలాల పవిత్రతకు, మాధుర్యానికి, శుభ్రతకు పెట్టింది పేరు. భారతదేశ ఔన్నత్యం గురించి చెప్పాలనుకున్నప్పుడు హిమాలయాలతోపాటు గంగమ్మ విశేషాలు మొదట చెప్పుకోవాల్సిందే. ఆ పరమపావని గంగోత్రిని దర్శించినంతనే జన్మధన్యమైనంత అనుభూతి కలిగింది.
అక్కడ ఉన్న ఆ వారం రోజుల్లో ఆశ్రమానికి ఎదురుగా ప్రవహిస్తున్న గంగమ్మపై నూరు పద్యాలు చెప్పే అవకాశం లభించిం ది. అది ‘గంగోత్రి వైభవం’ పేరుతో ముద్రణకు నోచుకున్నది. చల్లని వాతావరణం, చక్కని శివక్ష్రేతం, బ్రహ్మచారులు, సన్యాసులతో నిండి వుండే ఉత్తరకాశి మనలోని ఆ ధ్యాత్మిక భావాలను మరింతగా ప్రేరేపిస్తుంది.
అక్కడి ‘బ్రహ్మ విద్యాపీఠం’లో ఆచార్య విష్ణుతీర్థుల వారితో పరిచయం కలిగింది. వారు నాకిష్టమైన ‘బృహదారణ్యకోపనిషత్తు’ను శిష్యులకు బోధిస్తుంటే, 4 రోజులు వినే భాగ్యం కలిగింది. అలాగే, ‘కైలాసానంద పీఠం’ అధిపతి ఆచార్య శర్వానంద్‌తో పరిచయమవడమే కాకుండా అద్వైతం మీద చర్చించడమూ జరిగింది. ఆయన
“ఈ ప్రపంచం పరమాత్మ నుంచి పుట్టింది. తిరిగి పరమాత్మలోనే కలిసి పోతుంది” అన్నారు.
“శ్వేతాశ్వతోపనిషత్’లోని వాక్యాలను ఉదాహరిస్తూ, “సృష్టిలో మూడు ముఖ్య త త్తాలు ఉన్నాయి” అని నేను వాదించాను.
మా యాంతు ప్రకృతిం విద్యాత్
మా యినంత మహేశ్వరమ్
శ్వేతా. (4 అనే పంక్తులను ఉదాహరిస్తూ )
“ప్రకృతికి మాయ అనే పేరుంది. పరమేశ్వరుడు మాయినుడు. ప్రకృతికంటే పరమేశ్వరుడు వేరైన వాడు..” అన్నాను
మా వాదం హిందీలోనే సాగింది. కొంతసేపు వాదన జరిగిన తర్వాత ఇద్దరం ఆ పరమేశ్వరుణ్ణి ఓంకారంతో స్మరించాం. ఇది మరవలేని అద్భుత సంఘటన. గంగోత్రిని దర్శించడానికి ప్రపంచం నలుమూలల నుంచి కూడా యాత్రికులు వస్తుంటారు. ఎవరు వచ్చినా వారిని పవిత్రులను చేయగలిగిన శక్తిశాలి గంగమ్మ.
పరశురాముని ఆలయం
ఆశ్రమంలో ఉన్నంతసేపు గంగా తరంగాల నుంచి వచ్చే ఓంకార ధ్వనిని చెవులా రా విన్నాను. ఎందరో సన్యాసులు గంగాతీరం వెంట ఆశ్రమాలను నిర్మించుకున్నా రు. ఉత్తరకాశిలోనే పరశురాముడు తపస్సు చేసినట్లు చెప్తారు. పరశురాముని ఆలయం కూడా ఉంది. అక్కడ ఉత్తరకాశిలో కొలువుదీరిన మహేశ్వరుణ్ణి దర్శించడానికి ఎందరో భక్తులు వస్తుంటారు. విశ్వనాథుని ఆలయానికి అభిముఖంగా శక్తి ఆలయం ఉంది.
అక్కడే తాడి చెట్టంత త్రిశూలం స్థాపితమై ఉంది. అది చిటికెన వేలుతో తాకితే కదులుతుందన్నారు, ఆశ్చర్యమే. దేవాసుర యుద్ధంలో దేవతలకు శక్తితో ప్రదానం చేసిన త్రిశూలంగా ఐతిహ్యం ఉంది. ఆ త్రిశూలాన్ని చూస్తే, దాన్ని పట్టుకొని యుద్ధం చేసిన వీరుడెంతటి బలవంతుడో, ఆజానుబాహుడో అనిపిస్తుంది.
శంకరులతోపాటు ఎంతోమంది మహానుభావులు ఇక్కడ తపస్సు చేశారు. వారు అనేక సిద్ధులు సాధించడానికి గంగాదేవి ఎంతో సహకరించినట్లు అర్థమవుతోంది. గంగోత్రి నుంచి ఉత్తరకాశికి వస్తున్న దారి ఇరుకైంది. కొండలమీద కారులో ప్రయాణం చేయాలంటే ఎంతో చోదనా (డ్రైవింగ్) నైపుణ్యం ఉండాలి.
ఉత్తరకాశికి ప్రయాణం చేసేటప్పుడు గంగా ప్రవాహం మన వెంటనే ఉంటుంది. కొండలు ఎంత ఎత్తయినవో లోయలూ అంతే లోతైనవి. ఉత్తరాఖండ్ దేవభూమిగా ప్రసిద్ధి చెందింది. ‘దివ్య విశ్వవిద్యాలయం’ అక్కడి కొండలమధ్య ప్రశాంతమైన స్థలంలో వెలసింది.
మనకోసమే దిగివచ్చిన గంగమ్మ
ఉత్తరాఖండ్‌లోని లోయలు పాతాళ లోకాన్ని గుర్తుకు తెస్తాయి. గంగానది భస్మమైన సగరపుత్రులను తిరిగి బతికించడానికి ఆకాశం నుంచి భూమిపైకి వచ్చినట్లు పురాణాలు చెబుతాయి. కానీ, ఆ గంగ నిజంగా భారతదేశ వాసులను కరుణించడానికే ఈ భూమిమీదికి దిగి ఉంటుంది.
ఉత్తరకాశిలో గంగామాత నాతో చెప్పించిన పలుకులు ఉదాత్తమైనవి ఒకచోట చూచిన ఉవ్వెత్తునను నీవు ప్రవహించుజాడ సంప్రాప్తమయ్యె ఒకచోట గాంచిన ఉజ్జలమ్ముగ నీవు సాగివచ్చిన తీరు సంభవించె ఒకచోట వీక్షింప ఉత్తమురాలైన ఉలిద రీతిగ నీవె ఉంటివమ్మ ఒకచోట పరికింప ఉద్వేగమున నీవు పరిగెత్తి వచ్చిన భంగితోచె ఐననేమి యుగయుగాల అవనిపైన పయన మొనరించి చూపు ప్రభావమెట్లు గణన సేయక యుందును, కరుణ గలుగు
దేవతవు నీవు! గంగమ్మ గావవమ్మ!
ఇంతటి పవిత్రమైన గంగను గురించి భర్తృహరి ఎగతాళి చేయడం నాకే మాత్రం నచ్చలేదు. ఆకాశం నుంచి శంభుని శిరస్సునుంచి హిమాద్రి నుంచి భూమిమీదికి వచ్చి ఆ తర్వాత పవనాంధో లోకానికి (పాతాళానికి) పడిపోయిందట గంగ. వివేకం కోల్పోయిన వాడు కూడా పైనుంచి కిందపడి పోతాడని కవి అభిప్రాయం మరి. అంత ఎత్తుగల హిమాలయం నుంచి కిందికి దూకే గంగమ్మ ఆకాశగంగగా పేరొందింది. కానీ, ఆమె ఆకాశం నుంచి దిగినా, భూలోక వాసుల కోసమేనన్నది నిశ్చయం.
వ్యాసకర్త సెల్: 9885654381