ఉపనిషత్ సుధ :
సామవేదం సామగానమే! అకార, ఉకార, మకార సంయుక్త అక్షరమే ఓం! ‘స’ అంటే స్త్రీ అంటే ప్రకృతి! ‘ఆ’ అంటే పురుషుడు అంటే పరమాత్మ! ‘మ’ అంటే జీవాత్మ... ‘సామ’ అంటే తత్త్వత్రయం. సమ్యక్ గీతమే సంగీతం! రాగ, భావ, తాళ, లయాత్మకమైంది వేదనాదం. ఈ నాదమే సృష్టినంతా ప్రణవ దశాబ్దంగా ఆవరించి ఉన్నది. ఆవేశించి ఉన్నది. ‘స’ అంటే గానమని, ‘ఆ’ అంటే నృత్యమని కూడా ఒక అర్థం! వేదాన్ని గానం చేసే వారిని ఛాందోగులంటారు.
గాన ప్రధానమైంది సామవేదం కనుక, ఛాందోగులు దానిని గానం చేస్తారు. తత్త్వమసి మహావాక్యాన్ని అనుగ్రహించిందీ ఛాందోగ్యఉ పనిషత్. తత్ త్వం అసి... సత్యం ఉన్నదని నిరూపించే ఈ ఉపనిషత్ విశిష్ఠమైంది. సత్యకామ, శ్వేతకేతు, నారద, ఇంద్ర, ఉద్దాలక, సనత్కుమార, ప్రజాపతి వంటి ఎందరివో ఉదంతాలు, ఈ ఉపనిషత్ నిండా పరుచుకుని ఉన్నయ్.
జ్ఞానకాంక్ష, జ్ఞానతృష్ణ, సచ్చీలత... ఈ అన్నిటికంటే ప్రాణమే సర్వోన్నతమైందని బోధించే సందర్భాలు ఎన్నెన్నో! ‘ఇంతవరకు వినలేని దానిని వినగలిగావా? తెలుసుకోవలసిన దానిని తెలుసుకోగలిగావా?’ అన్న ప్రశ్నే ఈ ఉపనిషత్. ఇది బ్రహ్మవిద్యా విలాసాన్ని గ్రహించే దిశగా నడిపిస్తుంది.
స్థూల పదార్థం ద్వారా మూల పరమార్థాన్ని గ్రహించగల ఉపాయాన్ని అభ్యాసం చేయమంటుంది. మూలపదార్థం మారదు. స్థూలంగా కనిపిస్తున్నది మారక తప్పదు. ఆ విధంగానే ఈ ప్రపంచం నిరంతరం మారుతుంటుంది. నడిపిస్తున్న శక్తి మాత్రం మారకుండా ఉంటుంది. నడిపిస్తున్న దానినే ‘అది’ అంటున్నాం! అది తేలికగా అందేది కాదు. కానీ, అందుకోవలసిందే అది!
పరమాత్మను అభీః అంటాం! అంటే భీతిలేని వాడు అని అర్థం. భయమెందుకు ఎరగడంటే, తనంతటి వాడు మరొకడు లేడు కనుక! సర్వాంగాలు ఆతడివే! నిరంగుడూ ఆతడే. భిన్న భిన్నంగా లేడు కనుక భేదభావమూ లేదు.
జీవుడికి అంతా భిన్నంగానే తోస్తుంది. జడాత్మకమైన శరీరంలోకి ఆత్మప్రజ్ఞ ప్రవేశించగానే సర్వాంగాగలలో, సర్వేంద్రియాలలో, మనసులోకి శక్తి ప్రవేశించి, కార్యకలాపాలు ప్రారంభమవుత య్. పరమాణువు నుంచీ ప్రాదుర్భవించిన ప్ర పంచం నిండా ఆత్మక్షేత్రమూ విస్తరించే ఉంటుం ది. అదే ‘తత్’! సత్యము, బ్రహ్మము, ఆత్మ... కేవలం పర్యాయ పదాలే! ప్రాణం, చైతన్యం, మనసు... ఇటువంటి పదాలే! ఇవన్నీ కలసే ఉంటున్నయ్.
కనుకనే, వాటిని ఒకటిగా గుర్తించలేక, వేరు వేరుగా భావిస్తున్నాం. పెనుమాయ, మాయ, నిజానికి చైతన్యానికి ఛాయలే! అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాలను సమన్వయం చేసుకోగలిగిన వ్యక్తి, విజ్ఞానమయ కోశంలో నిలచి, సత్యాన్ని గురించి మాట్లాడ గలుగుతున్నాడు, ఈ విజ్ఞానమంతా ఆత్మవిద్యకు సంబంధించిందే కనుక! ఇంతదాకా అధ్యాత్మ ప్రయాణం సాగించిన వాడికి మిగిలేది బ్రహ్మానందమే! ఆత్మానందమే! పరమానందమే!
ఆనందతారక స్థితిని అందుకునే వరకే ఆరాటం, ప్రయాస! అందుకున్న మరుక్షణం ‘తాను అది’ ఒకటై సంపూర్ణ సాయుజ్య వైభవాన్ని అనుభవిస్తున్నాడు. అదే కైవల్యం, ముక్తి, జీవన్ముక్తి! -ఛాందోగ్య ఉపనిషత్ పాటతో మొదలై ఉదాత్త, అనుదాత్త స్థాయిలను, ద్వంద్వాలను దాటి ఏకత్వాన్ని సర్వత్రా, అనుభవమయ, అనుభూతిమయ, ఆనందమయ స్థితిలో సంస్థితం కావాలని బోధిస్తున్నది!
వి.యస్.ఆర్.మూర్తి