calender_icon.png 23 December, 2024 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదరగొట్టిన అమ్మాయిలు..

23-12-2024 12:21:21 AM

  1. అండర్-19 ఆసియా కప్ స్వాధీనం 
  2. హాఫ్ సెంచరీతో మెరిసిన తెలంగాణ చిన్నది

బంగ్లా ప్లేయర్లు బుసలు కొడుతున్న వేళ.. మన ఖమ్మం సివంగి గొంగడి త్రిష జూలు విదిల్చింది. అర్ధ సెంచరీతో జట్టును ఆదుకోవడమే కాకుండా... తొలి ఎడిషన్ కప్‌ను కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించింది.

విజయక్రాంతి ఖేల్ విభాగం: భారత అండర్-19 అమ్మాయిలు అదరగొట్టారు. మలేషియాలో జరిగిన ఆసియా అండర్- 19 టీ20 ట్రోఫీని గెలుచుకున్నారు.ఆదివారం జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్‌పై 41 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి ట్రోఫీని సొంతం చేసుకున్నారు. తెలంగాణకు చెందిన త్రిష (52) అర్ధసెంచరీతో మెరిసి జట్టుకు విజయాన్ని అందించింది. 

దక్కని శుభారంభం

మొన్నీ మధ్యే జరిగిన అండర్-19 ఆసియా కప్ మెన్స్ టోర్నీలో భారత జట్టు బంగ్లాదేశ్ కుర్రాళ్ల చేతిలో కంగుతింది. ఇక్కడ కూడా ఫైనల్ బంగ్లాతోనే అని కంగారుపడ్డ భారత అభిమానులకు ఆదిలోనే షాక్ తగిలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత అమ్మాయిలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఓపెనర్‌గా వచ్చిన కమలిని (5) ఐదో ఓవర్లోనే పెవిలియన్‌కు చేరుకుని నిరాశపర్చింది. ఇక తర్వాత వచ్చిన సనిక (0) కూడా అదే ఓవర్లో పెవిలియన్‌కు చేరడంతో భారత్ ఐదు ఓవర్లకే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. 

బిడ్డ కోసం పట్నానికి.. 

త్రిషది ఉమ్మడి ఖమ్మం జిల్లా. త్రిష తండ్రి ఓ ప్రైవేట్ కంపెనీలో ఫిట్‌నెస్ ట్రైనర్‌గా జాబ్ చేసేవాడు. తన కూతురులో ఉన్న జిజ్ఞాస, టాలెంట్‌ను గుర్తించిన ఆయన సొంతూరును, ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి సికింద్రాబాద్‌కు వచ్చేశాడు. త్రిష ఏడేళ్ల వయసులోనే సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో జాయిన్ అయి ఆటలో మెలకువలు నేర్చుకుంది. 

అక్కడ కూడా త్రిషనే.. 

త్రిష కేవలం ఇక్కడే కాకుండా జనవరిలో జరిగిన అండ ర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్ గెలు పులో కూడా కీ రోల్ పోషించింది. సౌతా ఫ్రికాలో జరిగిన ఈ టోర్నీలో భారత్ 7 వికెట్ల తేడాతో ఇం గ్లండ్ అమ్మాయిల మీద విజయం సాధించింది.

మెరిసిన తెలంగాణ చిన్నది.. 

ఇక ఆ దశలో తెలంగాణ చిన్నది గొంగడి త్రిష అర్ధ సెంచరీతో జట్టును ఆదుకుంది. త్రిష కేవలం 47 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసింది. త్రిష బ్యాట్ ఝలిపించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేయగలిగింది.

త్రిషది మన భద్రాచలం కావడం గమనార్హం. త్రిష హైదరాబాద్ అండర్-19 జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహిస్తుంది. 118 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ అమ్మాయిలు 18.3 ఓవర్లు ఆడి కేవలం 76 పరుగులే చేయగల్గారు. దీంతో భారత అమ్మాయిలు మొదటి ఆసియా కప్ వుమెన్ అండర్-19 ట్రోఫీని చేజిక్కించుకున్నారు.