calender_icon.png 23 October, 2024 | 3:02 AM

అక్కడ అమ్మాయి వస్తువుతో సమానం!

03-10-2024 12:00:00 AM

హైదరాబాద్ పాతబస్తీ అంటే.. ఒకప్పుడు బాల్య వివాహాలు.. అలర్లు.. కర్ఫ్యూలు.. ఆందోళనకరమైన వాతావరణం. ఇలాంటి వాతావరణానికి చాలామంది దూరంగా ఉంటారు. కొందరైతే చూసిచూడనట్టు ఊరుకుంటారు. కానీ ఓ మహిళ మాత్రం అక్కడి పరిస్థితులను చక్కదిద్దెందుకు నడుం బిగించింది.

ఆవిడే జమీలా నిషాత్. షాహీన్ అనే సంస్థను స్థాపించి అన్యాయాలకు విరుద్ధంగా పోరాడి ఎంతోమంది చిన్నారులను రక్షించింది. ‘షాహీన్ సంస్థ’ రెండు దశబ్దాలు పూర్తయిన సందర్భంగా ఆమె అనుభవాలను విజయక్రాంతితో పంచుకున్నారు..  

హైదరాబాద్ పాతబస్తీలోని సుల్తాన్ షాహి ఏరియాలో ఉంది ‘షాహీన్ ఉమెన్స్ రిసోర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్’. పాతబస్తీ మహిళలు ఎందుకు వెనుకబడి ఉన్నారు? చదువు, అల్లర్లు ఎందుకు జరుగుతాయి? దానికి పరిష్కారం కనుక్కోవాలని షాహీన్ స్థాపించాను. మొదట్లో చాలా కష్టంగా అనిపించింది. తర్వాత అలవాటుగా మారింది. ప్రతిరోజు ఛాలెంజింగ్‌గా తీసుకొని సంస్థ కోసం పని చేస్తున్నా.

ఒక రచయితగా, ఆర్టిస్టుగా కోరుకునేది ఒక్కటే సమాజానికి మంచి జరగాలని. పాతబస్తీలోని చాలా ఘటనలు నన్ను రాయించేలా చేశాయి. బొమ్మలు గీసేలా కూడా చేశాయి. కానీ అలా వారి ఆవేదనను నేను కూర్చొని రాసుకోవడం, బొమ్మలు గీయడం వల్ల ఎలాంటి మార్పు కనిపించలేదు నాకు. ప్రజలను చైతన్య పరచడానికి ఇంకా ఏదన్నా పని చేయాలని ఆలోచించాను. ఆ ఆలోచనతో పాతబస్తీలో ఆసక్తి ఉన్న అమ్మాయిలకు ఇంగ్లీషు నేర్పించాను. 

షహీదా అమ్మాయి ద్వారా.. 

దానికంటే ముందు ఓ విషయం చెప్పాలి. 2002 హైదరాబాద్‌లో ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు వెళ్లాను. పోటీలో చిన్న పిల్లలు డ్రాయింగ్ వేస్తున్నారు. షహీదా అని ఒక 12 ఏళ్ల అమ్మాయి చాలా ఏకాగ్రతతో బొమ్మ వేస్తోంది. వేసిన బొమ్మనే మార్చి మార్చి చూసుకుంటోంది. ఆ బొమ్మ తనకే నచ్చనట్లుంది. దాన్ని పక్కన పెట్టి మరో బొమ్మ వేసింది. నేను అదంతా గమనిస్తున్నా. ‘ఏం బొమ్మ వేశావు’ అని అడిగాను.

‘నా బొమ్మ. ఆ బొమ్మలో ఉన్నది నేనే’ అన్నది అమ్మాయి. ఇంతకీ షహీదా వేసిన బొమ్మలేమై ఉండవచ్చు. ముందు వేసింది రెక్కలు లేని పక్షి బొమ్మ. తర్వాత వేసింది పంజరంలో బందీగా ఉన్న పక్షి బొమ్మ. 12 ఏళ్ల అమ్మాయి తన పరిస్థితిని ఒక్క బొమ్మలో చెప్పింది. మాటల్లో చెప్పడం చేతకాక కాదు. తాను చెప్పినా వినడానికి ఎవరూ సిద్ధంగా లేకపోవడం వల్ల. కనీసం షహీదా బొమ్మ రూపంలోనైనా చెప్పగలిగింది.

షహీదా లాంటివారు చాలామంది ఈ సమాజంలో ఉన్నారు. అలాంటి వారి కోసం ఒక వేదిక కావాలి అని ‘షాహీన్’ స్థాపించాను. షాహీన్ అంటే.. ఎత్తుకి ఎగరగలిగిన శక్తివంతమైన పక్షి. అలా షాహీన్ ఉమెన్స్ రీసోర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటుకు దారి తీసిన మొట్టమొదటి ఘటన ఇది. పంజరంలోని పక్షి బొమ్మను గీయడం.. దానికి ఎదగటానికి రెక్కలు కూడా ఉన్నాయని తెలియజేయడం మా సంస్థ ప్రధాన లక్ష్యం.

అత్యంత బాధాకరమైన ఘటన..

అత్యంత బాధాకరమైన ఘటన ఏందంటే.. రెహానా అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె తండ్రి చనిపోయాడు. త ల్లి ఒక్కతే ఆమెను సాకుతున్నది. బ్రోకర్ ఆమె తల్లిని మభ్యపెట్టి.. దుబాయ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ అరబ్ షేక్‌లకు ఇచ్చి పెళ్లి చేయించాడు. అలా ఆమెకు దాదాపు 17 సార్లు పెళ్లి చేయించాడు బ్రోకర్.

ఆ అమ్మాయి కన్నా అందంగా ఉ న్న మరో అమ్మాయి షేక్‌కు దొరికితే.. విడాకులు ఇస్తాడు షేక్. అలా బ్రోకరే.. దగ్గర ఉండి ఒకరు విడాకులు ఇస్తే.. మరొకరికి ఇచ్చి పెళ్లిళ్లు చేశాడు. అ మ్మాయి ఎంతో వేదనతో ఇంటికి చేరుకుంటే.. తల్లి దగ్గరకు తీసుకోలేదు. మేమే దగ్గరకు తీసుకొని చేరదీశాం. 

ఇప్పుడు రె హానా తన కా ళ్ల మీద తాను నిలబడి ఉన్నది. దుబాయ్ షేక్‌లకు అమ్మాయి అంటే ఒక వస్తువుతో సమానం.  

‘కుబూల్ హై?’ వెబ్ సిరీస్..

మా సంస్థలో జరిగిన ఒక ఘటన ఆధారంగా తీసిన చిత్రమిది. బాల్య వివాహాలు, దానితో పోరాడే, అంగీకరించే సమాజం గురించి ఈ చిత్రం మాట్లాడుతుంది. మనకు ఎంతో అందంగా కనిపించే హైదరాబాద్.. పాతబస్తీలో ఉండే చీకటి కోణాల్ని వెలికి తీసి ఆవిష్కరించిన చిత్రమిది.

పేద ముస్లింలు వాళ్ల అమ్మాయిలకి 13వ ఏట రాగానే డబ్బులకి ఆశపడి పెద్ద వయసు కలిగిన అరబ్ షేక్‌లకు ఇచ్చి పెళ్లి చేయడం..! తర్వాత ఆ ఆడపిల్లల జీవితం ఎలా ఉంటుంది? అసలు ఏ ఉద్దేశంతో షేక్‌లు ఎక్కువ డబ్బులు ఇచ్చి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారు? నేరాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? పోలీసులకు తెలిసినా వాళ్ల ఇన్వాల్వ్‌మెంట్ ఎలా ఉంటుంది? అనే అంశాల చుట్టూ కుబూల్ హై వెబ్ సిరీస్ తీశారు . 

- రూప