calender_icon.png 8 November, 2024 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చికిత్స పొందుతూ బాలిక మృతి

30-06-2024 12:58:00 AM

  • ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

నిర్మల్, జూన్29 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక శనివారం అనుమానస్పద స్థితిలో మృతి చెందడంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కుబీర్‌కు చెందిన పల్లవి (13) కడుపు నొప్పితో బైంసాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శుక్రవారం చేరారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి బాలికకు ఆపరేషన్ చేసినట్టు కుటుం బీకులు తెలిపారు. ఆపరేషన్ తర్వాత బాలిక ఆరోగ్యం క్షీణించడంతో మృతిచెందిందని చెప్పారు.

ఆరోగ్యం క్షీణిస్తున్నా వైద్యులు తమకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని, ఆపరేషన్ వికటించడంతోనే పల్లవి మృతిచెందిందని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి ఎదటు ధర్నా చేశారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భైంసా పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేయగా వాగ్వాదం చోటు చేసుకుంది. తప్పకుండా న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చి, బాలిక మృతదేహాన్ని నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.