కోరి రెండుసార్లు కొరివి దెయ్యాన్ని తెచ్చుకుంటే పదేండ్లు ఉద్యోగాలివ్వకుండా తిప్పలు పెట్టారు
ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రంకెలేస్తున్నారు
నోటిఫికేషన్లను గుంటనక్కల్లా అడ్డుకుంటున్నారు
బీఆర్‌ఎస్ నేతలపై సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
కొత్త టీచర్లకు నియామక పత్రాలు అందజేత
హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): తండ్రి, కొడుకు, కూతురి ఉద్యోగాలు ఊడగొట్టినందుకే తెలంగాణ యువతకు ఉద్యోగా లొచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు రెండుసార్లు (బీఆర్‌ఎస్ పాలనను ఉద్దేశించి) కోరి కొరివి దెయ్యాన్ని తెచ్చుకున్నారని, ఆ కొరివి దెయ్యాన్ని రెండుసార్లు సీఎంను చేసినా రాష్ర్టంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదని మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ వచ్చిన వెంటనే ఇవ్వాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ మూడేళ్లు ఆలస్యంగా 2017లో ఇచ్చారని, పైగా నోటిఫికేషన్ ఇచ్చిన రెండేళ్ల తర్వాత 2019లో నియామకాలు చేపట్టారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు ముగిసిన 65 రోజుల్లోనే 10,006 మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేస్తున్నదని తెలిపారు.
‘మిమ్మల్ని చూస్తుంటే దసరా పండుగ మూడురోజుల ముందే వచ్చినట్లుగా ఉంది’ అని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. ఎల్బీస్టేడియంలో బుధవారం జరిగిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగుల విజ్ఞప్తుల మేరకు డీఎస్సీని వాయిదా వేసి టెట్‌ను మరోసారి నిర్వహించి నియామకాలు చేపట్టినట్లు గుర్తుచేశారు.
నా మాటే నిజమైంది
‘తండ్రీ కొడుకుల (కేసీఆర్, కేటీఆర్) ఉద్యోగాలు ఊడగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని నేను ఆనాడు చెప్పాను.. నా మాటే నిజమైంది. మేం ఇచ్చిన మాట ప్రకారమే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు వరుసగా చేపడుతున్నాం’ అని సీఎం రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తల్లా నిరుద్యోగులు ఇల్లుఇల్లు తిరిగి బీఆర్‌ఎస్ ఓడేందుకు ప్రచారం చేశారని, కాంగ్రెస్‌కు అండగా నిలబడ్డారని కొనియాడారు.
‘మీరందరూ మాకు కొలువులిచ్చారు.. కాబట్టే మేము మీకు కొలువులిస్తున్నాం’ తెలిపారు. ఎక్కడైతే తా ను సీఎంగా బాధ్యతలు చేపట్టానో అక్కడి నుంచే అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందజేశానని గుర్తుచేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన 65 రోజుల్లోనే 10,006 ఉపాధ్యా య నియామకపత్రాలు అందిస్తున్నామని వెల్లడించారు.
విద్యాశాఖలో కీలక నిర్ణయాలు తీసుకున్నాం
తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వ పాఠశాలలు, టీచర్ల పాత్ర కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యాశాఖలో కీలక నిర్ణ యాలు తీసుకున్నామని, 34 వేల మంది టీ చర్ల బదిలీలతో పాటు 21వేల మంది టీచర్ల కు పదోన్నతులు కల్పించామని తెలిపారు. ‘కొన్ని కొరివి దెయ్యాలు మీకు ఉద్యోగాలు రాకుండా ప్రయత్నం చేశాయి. నోటిఫికేషన్ల ను అడ్డుకుంటున్నారు. మీ కుటుంబాల్లో సంతోషాన్ని చూసేందుకు అన్నింటినీ ఎదుర్కొని మీకు నియామకపత్రాలను అందజే స్తున్నాం.. మీ సంతోషం చూసి కొంతమంది కండ్లల్లో కారం కొట్టుకుంటున్నారు’ అని బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.
పదేండ్లలో ఉద్యోగాలెందుకు ఇవ్వలే?
గత పదేళ్లలో కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్.. పేదోళ్ల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు చేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘నీ బిడ్డ కవిత.. నీ బంధువు వినోద్ కుమార్ ఎన్నికల్లో ఓడిపోతే ఆరు నెలల్లో ఉద్యోగాలిచ్చిన నువ్వు..పేదోళ్లకు ఉద్యోగాలెందుకివ్వలేదు? వాళ్లు సలహాలు ఇవ్వరు.. కానీ మేం చేస్తుంటే కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారు.
ఈ కార్యక్రమం జరగొద్దని కుట్రలు చేశారు. పదేళ్లు ఏలినవారు పది నెలల తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని రెంకలేస్తున్నారు. ఆ అవకాశం తెలంగాణ ప్రజలు వారికి ఇవ్వరు. తెలంగాణ సమాజంపై బీఆర్‌ఎస్‌కు ఎందుకంత కోపం?’ అని నిలదీశారు.
11న ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శ్రీకారం
అన్ని నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభిస్తున్నామని, ఈ నెల 11న వాటి నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని సీఎం తెలిపారు. విద్యకు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించామని, 75 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా ఆధునీకరిస్తున్నామని చెప్పారు. ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ.125 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఐటీఐలను అప్‌గ్రేడ్ చేసి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. రాష్ట్రంలో ఏటా 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ పూర్తిచేసి బయటకు వస్తున్నారని, వారు సరైనా నైపుణ్యం లేక ఉద్యోగాలు పొందలేక ఇబ్బంది పడుతున్నారని సీఎం అన్నారు. అలాంటివారికి నైపుణ్యం అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.
స్కిల్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు సాంకేతిక శిక్షణ ఇచ్చి.. ఉద్యోగ అవకాశాలను కల్పించడమే కాకుండా క్రీడలపై కూడా దృష్టి సారించామని సీఎం తెలిపారు. ఒలింపిక్స్ వేదికల్లో దేశం పరిస్థితి ఏంటో చూశామని, నాలుగు కోట్లు జనాభా ఉన్న దక్షిణ కొరియాకు 32 పతకాలు వస్తే.. 140 కోట్ల జనాభా ఉన్న భారత్‌కు ఆ తరహాలో ఎందుకు పతకాలు రాలేదని అందరూ ఆలోచించాలని అన్నారు.
‘తెలంగాణ యువత మత్తుకు బానిసలయ్యారు. వ్యసనాలకు బానిసలై.. యువత తప్పుదోవ పడుతున్నది. 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ నుంచి అత్యధికంగా పథకాలు రావాలి. ఇందుకు త్వరలోనే గచ్చిబౌలిలో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయబోతున్నాం’ అని సీఎం తెలిపారు.
విద్యా కమిషన్ ద్వారా వందేళ్లకు ప్రణాళిక
విద్యా కమిషన్ ద్వారా విద్యారంగంలో రాబోయే వందేళ్లకు అవసరమయ్యే ప్రణాళికలు రచించబోతున్నామని సీఎం తెలిపారు. ఇందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని నియమించినట్లు చెప్పారు. డీఎస్సీ అభ్యర్థులంతా చప్పట్లు కొడుతుండగా.. ‘గట్టిగా చప్పట్లు కొట్టాలి.. కేసీఆర్ గుండె పగిలేలా కొట్టాలని’ అని సీఎం అన్నారు. 10 నుంచి పదహారు మంది అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం 10,006 మంది నూతన ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించారు.
డీఎస్సీని ఆపాలని కుటిల ప్రయత్నాలు చేశారు: భట్టి విక్రమార్క
కొలువుల కోసం పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో బీఆర్‌ఎస్ గత పదేళ్లు డీఎస్సీ గురించి ఆలోచించలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నామని చెప్పారు.
డీఎస్సీపై ప్రతిపక్షం ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా, ఆటంకాలు సృష్టించినా అనుకున్న సమయానికి డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. అందరూ ఆశ్చర్యపోయేలా నియామకాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి, ఎమ్మెల్సీలు కోదండరాం, నర్సిరెడ్డి, ఏవీఎన్ రెడ్డి, కే కేశవరావు, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రంగారెడ్డి, సీఎస్ శాంతి కుమారి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంకేతిక విద్యాకమిషనర్ శ్రీదేవసేన, విద్యాశాఖ కమిషన్ ఆకునూరి మురళి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇవీ నర్సింహారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
గొప్పవాళ్లంతా చదువుకున్నది సర్కారు బడుల్లోనే
గొప్పగొప్ప వాళ్లంతా చదువుకున్నది సర్కారు బడుల్లోనేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘నేను ప్రభుత్వ బడిలో చదువుకున్న.. సీఎం అయ్యాను. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేశవరావు, కోదండరాం వంటి ఎందరో ప్రభుత్వ బడిలోనే చదివారు. కార్పొరేట్ బడిలో చదువుకోలేదు. మీలాంటి టీచర్లు చెప్పిన చదువుతోనే ఈ స్థాయికి వచ్చాం.
ప్రభుత్వ బడుల్లో పిల్లలను చదివించేందుకు ప్రజలు నామూషీగా భావిస్తున్నారు. నిరుపేదలు పుస్తెలు అమ్మి ప్రైవేటు పాఠశాలలకు పిల్లల్ని పంపే పరిస్థితి మారాలి. ప్రభుత్వ ఉపాధ్యాయులే అందుకు మార్గాలను అన్వేషించాలి.
తెలంగాణలోని 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది చదువుతున్నారు. ప్రైవేటులో 10 వేల పాఠశాలలు ఉంటే 34 లక్షల మంది చదువుతున్నారు. ప్రైవేటులో మీ కంటే ఎక్కువ చదువుకున్నవారు, అనుభవం ఉన్నవారు బోధిస్తున్నారా?’ అని టీచర్లను ప్రశ్నించారు.