25-01-2025 12:00:00 AM
ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న కోట్లాది విలువైన వనరులను బహుళ జాతి కంపెనీలకు, కార్పొరేట్లకు దోచిపెట్టడం కోసం భారత ప్రభుత్వం దేశ మూలవాసులైన ఆదివాసీలపై అతిక్రూరంగా మారణకాండను కొనసాగిస్తూనే ఉంది. అలాగే వారికి మద్దతుగా ఉద్యమిస్తున్న ఉద్యమకారులను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేస్తూ దానికి ‘ఆపరేషన్ కగార్’ పేరుతో లక్షలాది బలగాలతో మధ్య భారతాన్ని సరిహద్దు ప్రాంతంగా మారుస్తూ యుద్ధ స్థితిని కొనసాగిస్తుంది.
ఇది గాజా, ఉ క్రెయిన్‌ల స్థితిని దాటిపోయింది. మనపక్కన ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీల జీవితంపై భారత సైన్యం తీవ్రంగా దాడి చేస్తున్న విధానాన్ని మానవతావాదులు, ప్రజాస్వామ్యవాదులుగా అన్ని రాజకీయ పార్టీలు నిలదీయడానికి ముం దుకు రావాల్సిందిగా తెలుగు రాష్ట్రాల్లోని హక్కుల సంఘాలన్నీకూడా పత్రికాముఖంగా ప్రజలందరికీ పిలుపునిస్తున్నాయి.
తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే సబ్బండ వర్గాలు కదిలి తెలంగాణను సాకారం చేసుకోగలిగామో, అలాగే ఆదివాసీల హననా న్ని నిలువరించడానికి,ఉద్యమాన్ని బతికించుకోవడానికి మనవంతు బాధ్యతగా ముం దుకు రావాల్సిందిగా పిలుపునిస్త్తున్నాం.
ఆర్నెల్ల పాప హత్యతో మొదలు
ఏడాది కాలంగా మధ్యభారత, గోదావరి తీర అరణ్యాలలో సాగుతున్న మారణ కాండల్లో ఇప్పటికే మరణించిన వారిని వ్యక్తులుగా చెప్పడం కష్టమై 300 సంఖ్యతో పేర్కొంటున్నారు. 2024 జనవరి 1న ఆరు నెలల పాప నుంగ్లీ సోడితో ప్రారంభమైన కగార్ హత్యాకాండ గత ఏడాదిలో 300 వరకు వస్తే, ఈ ఏడాది ప్రారంభంలో నెల పూర్తి కాకుండానే 50 సంఖ్యను దాటేసింది.
ఆపరేషన్ కగార్ అణచివేత ఛత్తీస్‌గఢ్ అబూజ్‌మడ్ ప్రాంతంలో అందులో నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాలోని మొత్తం 4 వేల కిలోమీటర్ల దట్టమైన అటవీ ప్రాంతంలో కొనసాగుతోంది. ఇందులో 237 గ్రామాల్లో గోండు, మోరియా, అబూజ్, హల్వా తెగలకు చెందిన 35 వేల మంది ఆదివాసీలు జీవిస్తున్నారు. ఇక్కడ ఇనుప ఖనిజం, గ్రాఫైట్, సున్నపురాయి, యురేనియంతో పాటు 28 రకాల 70 కోట్ల టన్నుల ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పజెప్పడానికే కేంద్రం ఇప్పటికే 104 ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలు 2005 నుంచి కొనసాగుతున్నాయి. కానీ ఇక్కడున్న ఆదివాసీలు జల్, జంగిల్, జమీన్‌పై తమకే హక్కు ఉందని పోరాటం ద్వారా చేస్తున్నారు. రాజ్యాంగం, చట్టాలు కూడా వారికి అనుకూలంగానే ఉన్నాయి. 1996లో వచ్చిన‘పేసా’ చట్టం గ్రామ సభల తీర్మానమే అంతిమంగా చెబుతూ అడవిపై ఆదివాసీలకే హక్కు ఉందని బలంగా ప్రకటిస్తున్నది.
‘ఆపరేషన్ కగార్’ పేరుతో 650 పోలీసు క్యాంపులను 7 లక్షల పోలీసు బలగాలను,వందలాది డ్రోన్లను పదుల సంఖ్యలో హెలికాప్టర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగిస్తూ ఆదివాసీల హననానికి, మావోయిస్టుల నిర్మూలనకు యుద్ధం కొనసాగిస్తున్నాయి.
ప్రజాస్వామిక దేశంలో ప్రజలు, ఉద్యమకారులు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే హక్కు, అవకాశం ఉంది. ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించడం కన్నా ఉద్యమాల అణచివేతనే పరిష్కారంగా భావిస్తూ ఇప్పటికి 50 ఏళ్లుగా దాన్నే కొనసాగిస్తూ ఇప్పటికే 20 వేలకు పైగా ఎన్‌కౌంటర్ హత్యలను కొనసాగించాయి.
ఆపరేషన్ గ్రీన్‌హంట్
2005 నుండి సల్వాజుడుం పేరుతో వేలాది మంది ఆదివాసీలను రమణ్‌సింగ్ ప్రభుత్వం హత్య చేసింది. ప్రొ.నందిని సుందర్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రజాస్వామిక బాధ్యత వలన సల్వాజుడుం రద్దయింది. కానీ అందులో పని చేసిన వారందరిని డీఆర్‌జీ బలగాల పేరుతో కొత్త ఫోర్స్‌గా ప్రభుత్వంలో చేర్చుకున్నారు. సల్వా జుడుం తర్వాత 2009 లో ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ ప్రకటించబడింది.
దీనితో సీఆర్‌పీఎఫ్ బలగాలతో పాటు డీఆర్‌జీ బలగాలు కూడా ఆదివాసులపై దాడులు చేస్తూ హత్యాకాండను కొనసాగించాయి. అందులో భాగంగానే 2012లో జరిగిన బాసగూడ హత్యాకాండ. 2013 లో ఎడిసిమెట్టలో కూడా ఇటువంటి మారణకాండనే కొనసాగించారు. ఒక్కక్క ఎన్ కౌంటర్ ఘటనలో 17 మంది ఆదివాసీలు మరణించారు. ఇందులో స్కూలుకు వెళుతున్న మైనర్ బాలురు ఐదుగురు ఉన్నారు.
దానిపై ఏర్పాటు చేసిన జస్టిస్ అగర్వాల్ ఏకసభ్య కమీషన్ కూడా ఇది ఎన్‌కౌంటర్ కాదని స్పష్టం చేసింది. 2011 నుండి ఆపరేషన్ గ్రీన్‌హంట్ రెండవ దశ అమలవుతూ వస్తుంది. ఈ కాలంలో ఆదివాసీల అక్రమ అరెస్టులు నిర్విరామంగా కొనసాగాయి. సుక్మా, దంతెవాడ, జగల్పూర్, రాయపూర్ జైళ్లన్నీ ఆదివాసీలతో నిండిపోయాయి. అందరిపై ఉపా కేసులు, ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక భద్రతా చట్టం కేసుకూడా మోపారు.
2017 నుండి ‘ఆపరేషన్ సమాధాన్’ పేరుతో డ్రోన్లతో దాడి ప్రారంభించారు. ఈ స్థితిలోనే అక్కడ ఉన్న జర్నలిస్టులకు పత్రికా స్వేచ్ఛ లేకుండా పోయింది. అడవిలోకెళ్ళి ఎవరు వార్తలు సేకరించినా వారిని కాల్చి పారేయండని అధికారులు బహిరంగంగా మాట్లాడిన స్థితి నేడు అమలవుతున్నది. అందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రహదారి అవినీతి కేసును బయటకు తీసినందుకు ముఖేస్ చంద్రాకర్ అనే యువ జర్నలిస్టు దారుణ హత్య.
ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో బస్తర్ టాకీస్, బస్తర్ జంక్షన్‌ల పేరుతో య్యూట్యూబ్ ఛానళ్లు అక్కడ జరుగుతున్న ఎన్ కౌంటర్ దాడులను, హత్యాకాండలను ప్రజలకు అందించడంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్లకు పూర్తిగా కొమ్ము కాస్తున్న డబుల్ ఇంజన్ సర్కార్ల్ ముఖేష్ చంద్రాకర్‌ను హత్య చేయించారు.
తెలంగాణలోనూ ఎన్‌కౌంటర్లు
2024 జనవరి 1 నుంచి ప్రారంభమైన ‘ఆపరేషన్ కగార్’ 6 నెలల పాప మంగ్లీ సోడి హత్యతో మొదలైంది. ఆమె బీజాపూర్ జిల్లా మూద్దూం గ్రామానికి చెందిన పాప. పోలీసులు కాల్పులు జరిపి 6 నెలల పాపను చంపేసి ఎన్‌కౌంటర్‌గా ప్రకటించారు. తల్లి ఎక్కడ నిజం చెబుతుందో అని బిడ్డ అంత్యక్రియలకు రానీయకుండా దూరం పెడతారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ నిజస్వరూపం.
ఆ తర్వాత పదుల సంఖ్యలో జరిగిన ఎన్‌కౌంటర్లన్నీ కూడా అమాయక పౌరులను పట్టుకుని కాల్చి చంపినవే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రఘునాథపాలెంలో ఆరుగురు, ములుగు జిల్లా చల్పాక ఎన్‌కౌంటర్‌లో ఏడుగురితో పాటు ఇప్పటికి తెలంగాణలో 26 మందిని హతమార్చారు. ఇలా ఛత్తీస్‌గఢ్‌ప్రాంతంలోనే కాక తెలంగాణ ప్రాంతంలో కూడా కగార్ హత్యాకాండ కొనసాగుతోంది. 50 ఏళ్ళుగా ఎన్‌కౌంటర్ హత్యలను ప్రభుత్వ హత్యలుగానే హక్కుల సంఘాలు ప్రకటిస్తున్నాయి..
ఆ విధంగానే నిజనిర్ధారణ నివేదికలు కూడా ప్రజలకు అందిస్తున్నా యి. కానీ ‘ఆపషన్ కగార్’ హత్యాకాండలపై నిజ నిర్ధారణలు చేసే అవకాశం కల్పించకుండా పూర్తి నిర్బంధాన్ని అమలు చేస్తూ ఏకపక్షంగా ఎనౌకౌంట్ల పేరుతో హత్యలను కొనసాగిస్తున్నారు. నిజమైన ఎన్‌కౌంటర్లయితే నిజనిర్ధారణలు చేయడానికి ఎందుకు ప్రభుత్వాలు భయపడుతు న్నాయి? ఆదివాసీలను ఉద్యమకారులను పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి ఎన్‌కౌంటర్లుగా ప్రకటిస్తున్నారని దీంతోనే మనకర్థ్ధమవుతుంది.
అందువల్లనే జరిగిన 300పైగా ఎన్‌కౌంటర్ హత్యలన్నింటినీ ప్రభుత్వ హత్యలుగానే మనందరం పరిగణించాలని కోరుతున్నాం. ‘ఆపరేషన్ కగార్’ను నిలిపివేయడానికి, దాని పేరుతో జరుగుతున్న హత్యాకాండలను నిలువరించడానికి మనవంతుగా బాధ్యత పడదా మని, దీనికి ప్రజలు ప్రజాసంఘాలు ప్రజాస్వామిక వాదులు కలిసి రావాలని హక్కుల సంఘాలుగా పిలుపునిస్తున్నాం.
పౌర హక్కుల సంఘం, తెలంగాణ (సీఎల్‌సీ),
మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్),
ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపీడీఆర్),
పౌర హక్కుల పరిరక్షణ కమిటీ, (పీయూసీఎల్),
పౌరహక్కుల పర్యవేక్షణ కమిటీ (సీఎల్‌ఎంసీ)
మా డిమాండ్లు
ఆపరేషన్ కగార్ వెంటనే ఆపు చేయాలి. దేశ సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించడం కోసం ఎంవోయులను కుదుర్చుకొని కొనసాగిస్తున్న హత్యాకాండలను వెంటనే నిలిపివేయాలి. ఎంవోయులను రద్దు చేయాలి. ఏడాది కాలంగా జరిగిన, జరుగుతున్న అన్ని ఎన్‌కౌంటర్లపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలి.