calender_icon.png 15 January, 2025 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి ముఠా గుట్టురట్టు

25-08-2024 02:39:41 AM

నల్లగొండ, ఆగస్టు 24 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. నిందితులు రెండు కార్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకకు సరుకు తరలిస్తుండగా పట్టుబడ్డారు. జిల్లా కేంద్రంలోని డివిజన్ పోలీస్ కార్యాలయంలో శనివారం డీఎస్పీ శివరాంరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. తిప్పర్తి మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్ సమీపంలో నార్కెట్‌పల్లి అద్దంకి రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.

ఇదే సమయంలో అటుగా వస్తున్న రెండు కార్లను ఆపారు. నిందితులు కారు దిగి పరారవుతుండగా పోలీసులు నలుగురిని పట్టుకున్నారు. మరో ఇద్దరు చేతికి దొరకలేదు. అనంతరం కార్ల డిక్కీల్లో పోలీసులు 81 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు హైదరాబాద్‌లోని బాచుపల్లి ప్రాంతానికి చెందిన వారిగా, మరొకరిని కర్ణాటకలోని బీదర్ జిల్లా భాల్కి ప్రాంతవాసిగా గుర్తించారు. కర్ణాటకకు చెందిన తమన్ అనే వ్యక్తి ఆదేశాల మేరకు గంజాయి కొనుగోలు చేసి తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి  1.63 క్వింటాళ్లు ఉంటుందని, దాని విలువ రూ.40.95 లక్షలకుపైగా ఉంటుందన్నారు.

కొత్తపల్లిలో గంజాయి పట్టివేత

భీమదేవరపల్లి, ఆగస్టు 24 (విజయక్రాంతి): గంజాయి అమ్ముతున్న యువకుడిని ముల్కనూర్ పోలీసులు అరెస్టు చేశారు. యువకుడి నుంచి 250 గ్రాముల గంజాయిని ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఎల్కతుర్తి సీఐ పులి రమేశ్, ముల్కనూర్ ఎస్సై సాయిబాబా తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారులో శుకవారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఓ వ్యక్తిని పట్టుకున్నారు. అతడిని సోదా చేసి 250 గ్రాములు గంజాయి పట్టుకున్నారు.