calender_icon.png 17 January, 2025 | 11:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు ఆడిందే ఆట

07-07-2024 01:00:07 AM

అమ్యామ్యాలతో పాడిందే పాట

సీఎంఆర్ ఇవ్వని మిల్లులకే ధాన్యం

రా రైస్ మిల్లుకు యాసంగి ధాన్యం

సీఎంఆర్ బకాయిపై మౌనముద్ర

పౌరసరఫరాల శాఖ బాస్ నుంచి కిందిస్థాయి వరకు అదే తీరు

మంచిర్యాల జిల్లాలో సూడనొక్క సిత్రాలు

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, జూలై ౬ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో పౌరసరఫరాల శాఖలో అధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతుంది. కిందిస్థాయి ఉద్యోగుల తప్పి దాలపై చర్యలు తీసుకోవాల్సిన ఓ ఉన్నతాధికారే ‘మామూలు’గా తీసుకొని తనకు నచ్చినట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి తనకు నచ్చిన మిల్లర్లకు ధాన్యం కేటాయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారనే విమర్శలు గుప్పుమంటు న్నాయి.

సీజన్ చివరలో కొత్తగా మిల్లులకు అనుమతివ్వటం, కనీసం బియ్యం మరాడించే యంత్రాలు కూడా లేని మిల్లులకు వందల టన్నుల ధాన్యం కేటాయించటం, యాసంగి ధాన్యం పారాబాయిల్డ్ మిల్లులకే కేటాయించాలన్న నిబంధన ఉన్నా రా రైస్ మిల్లులకు కేటాయించటం, వందల టన్నుల సీఎంఆర్ బకాయి ఉన్న మిల్లులకే మళ్లీమళ్లీ ధాన్యం కేటాయించటం ఇలా ఒకటేమిటి.. జిల్లాలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారుల లీలలు కోకొల్లలు. 

అనుమతి ఎవరి కోసం?

2023-24 వానకాలం సీజన్‌లో జిల్లాలో 54 (20 బాయిల్డ్, 34 రా రైస్) మిల్లులకు ధాన్యం కేటాయించారు. ఈ సీజన్ 2023, నవంబర్ 6వ తేదీన ప్రారంభమై.. 2024, జనవరి 18వ తేదీన కొనుగోళ్లు ముగించారు. కాగా 34 రా రైస్ మిల్లుల్లో 8 (మాతేశ్వరి ఆగ్రోస్ లక్ష్మీపురం కన్నాల, సమత ఆగ్రోస్ అంకుశాపూర్ భీమారం, భవానీ ఇండస్ట్రీస్ పెద్దపేట దండేపల్లి, ఈశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ ఇందారం, శ్రీ రాజరాజేశ్వర రైస్‌మిల్ మద్దులపల్లి జైపూర్, రాజరాజేశ్వర ఇండస్ట్రీస్ మొర్రిగూడ జన్నారం, చాముండేశ్వరి ఇండస్ట్రీస్, శార్వాణీ ఇండస్ట్రీస్ లక్ష్మీపూర్, లక్షెట్టిపేట) మిల్లులకు డిసెంబర్ నెలాఖరు, జనవరి నెలల్లో అనుమతి ఇచ్చారు. ఇది కూడా ఒక్కో మిల్లుకు పెద్ద మొత్తంలో ముట్టజెబితేనే అనుమతి ఇచ్చారని మిల్లర్లు బాహాటంగానే చెప్పారు. సీజన్ పూర్తయిన తర్వాత ఈ మిల్లులకు ధాన్యం ఎలా వచ్చింది? ఇన్‌ఫ్రా కూడా రాకుండా మిల్లులకు అనుమతి ఎలా ఇచ్చారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

యాసంగిలో రా రైస్ మిల్లులకు సీఎంఆర్

ఏటా యాసంగి సీజన్‌లో ధాన్యాన్ని కేవలం బాయిల్డ్ రైస్ మిల్లులకే కేటాయిస్తుంటారు. రా రైస్ మిల్లులకు కేటాయిస్తే నూక ఎక్కువ వచ్చి ఎఫ్‌సీఐ, సివిల్ సప్లయ్‌లకు పంపే బియ్యం తిరస్కరణకు గురవుతుంది. జిల్లా అధికారులు కక్కుర్తిపడి ఈ ఏడాది 15 రా రైస్ మిల్లులకు ధాన్యం దించుకొనేందుకు అనుమతి ఇచ్చారు. మే ౨౫న 15 (వెంకట రమణ కోటపల్లి, సోమేశ్వర ఆస్నాద్, రాజరాజేశ్వర కత్తెరశాల, బీఎస్‌వై ముదిగుంట, మంజునాథ, బాలాజీ, అష్టలక్ష్మీ, రాజరాజేశ్వర మద్దులపల్లి, నందులపల్లి లక్ష్మీ శ్రీనివాస, వాసవి మాత, మాతేశ్వరి, జై యోగేశ్వర, చాముండేశ్వరి, భవానీ, సమత ఆగ్రో) రా రైస్ మిల్లులకు ప్రొసీడింగ్ ఇస్తే జూన్ ౨౨న మిల్ ట్యాగింగ్ ఇచ్చారు. అది కూడా ఒక్కో మిల్లుకు రూ.50 వేల నుంచి రూ. లక్ష ముట్టిన తర్వాతనే ఇచ్చారని మిల్లర్లు వాపోతున్నారు. వానకాలంలో మాత్రమే రా రైస్ మిల్లులకు ధాన్యం ఇచ్చే అధకారులు డబ్బులిస్తే ఏ కాలమైనా అనుమతులు ఇస్తున్నారనేది స్పష్టమైంది. డబ్బులు ఇచ్చిన మిల్లర్లు ట్యాగింగ్ ఇవ్వడం లేదని ఒత్తిడి తీసుకురాగా, సదరు అధికారి స్వయంగా ట్యాగింగ్ ఇచ్చారంటే సివిల్ సప్లయ్ శాఖలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

జీరో సీఎంఆర్ మిల్లులు నాలుగు

జిల్లాలో 2023-24 వానకాలంలో ప్రభుత్వం ధాన్యం ఇవ్వగా ఇప్పటివరకు ఒక్క ఏసీకే (290 క్వింటాళ్ల) బియ్యం ప్రభుత్వానికి తిరిగి ఇవ్వని మిల్లులు నాలుగు ఉన్నాయి. ఇందులో శార్వాణి ఇండస్ట్రీస్ లక్ష్మీపూర్ (2,186 మెట్రిక్ టన్నుల ధాన్యం పంపించగా 1,465 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాలి), శివసాయి ఇండస్ట్రీస్ మల్లిఖార్జున ట్రేడర్స్ ఇందారం (794 మెట్రిక్ టన్నుల ధాన్యం పంపించగా ప్రభుత్వానికి 532 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది), శ్రీ గణనాథ ఆగ్రో ఇండస్ట్రీస్ భీమారం (561 మెట్రిక్ టన్నుల ధాన్యం పంపించగా 376 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది), వెంకటేశ్వర రైస్‌మిల్ మందమర్రి (111 మెట్రిక్ టన్నుల ధాన్యం పంపించగా 74 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాలి) ఉండగా వీటిలో సీఎంఆర్ ఇవ్వడం లేదని కేవలం ఒకే ఒక ఇందారం శివసాయి ఇండస్ట్రీస్ మల్లిఖార్జున ట్రేడర్స్ యాజమానిపై కేసు నమోదు చేసి మిల్లు సీజ్ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. మిగతా మిల్లులపై అధికారులకు ఎందుకంత ప్రేమనో ఆ శాఖ అధికారులకే తెలియాలి.

15 శాతం సీఎంఆర్ ఇవ్వని మిల్లులకు తిరిగి ధాన్యం

జిల్లాలో 15 శాతం సీఎంఆర్ ఇవ్వని మిల్లులు పదికిపైగానే ఉన్నాయి. వాటికి కూడా యాసంగిలో ధాన్యం కేటాయించడంపై విస్మయం వ్యక్తమవుతుంది. వానకాలంలో 15 శాతం సీఎంఆర్ ఇవ్వని మిల్లులు బీఎస్‌వై ముదిగుంట, మాతేశ్వరి లక్ష్మీపూర్, వెంకటేశ్వర పెద్దపేట, లక్ష్మీనర్సింహ కలమడుగు, బాలాజీ టేకుమట్ల, ఈశ్వర ఆగ్రో ఇందారం, శ్రీలక్ష్మీ శ్రీనివాస నందులపల్లి, వాసవి మాత రేచిని, శ్రీ రాజరాజేశ్వర కత్తెరశాల, అన్నపూర్ణ ఆగ్రో కుందారం, నీలం బ్రదర్స్ పొన్నారం ఉండగా, వీటిలో కొన్నింటికి యాసంగిలో ధాన్యం దించుకునేందుకు అనుమతి ఎలా వచ్చిందో జిల్లా కలెక్టర్ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వానకాలం సీజన్‌కు సంబంధించి అసలు ధాన్యం మిల్లుల్లో ఉందో లేదో! కూడా తనిఖీలు చేయకుండా విచ్చలవిడిగా ప్రభుత్వ ధాన్యాన్ని మిల్లులకు కేటాయించారు. 

సిద్ధంగా లేని మిల్లులకూ ధాన్యం

జిల్లాలో ఇప్పటికీ కొన్ని మిల్లులు పూర్తిస్థాయిలో ధాన్యాన్ని బియ్యంగా మిల్లింగ్ చేసేందుకు సిద్ధంగా లేవు. అలాంటివాటికి సైతం 2023-24 వానకాలంలోనే అనుమతి ఇచ్చి వందల మెట్రిక్ టన్నుల ధాన్యం దింపారు. కొన్ని మిల్లుల్లో ఇంతవరకు సార్టెక్స్ మిషన్లు లేనేలేవు. వాటికిసైతం ధాన్యం కేటాయించారు. మిల్లింగ్‌కు మిల్లులు అనుకూలంగా ఉన్నాయో! లేవో కూడా చూడకుండా వెరిఫికేషన్ రిఫోర్టులు పంపించడం, సివిల్ సప్లయ్ కమిషనర్ నుంచి అనుమతులు రాకముందే మామూల్లు ముట్టజెప్పిన మిల్లుల్లో ధాన్యం దింపించారు. అలాంటి మిల్లులు ఇప్పటివరకు ఒక్క గింజ బియ్యం కూడా ప్రభుత్వానికి ఇవ్వలేదు. అయినా అధికారులు వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. అసలు కొత్తగా మిల్లులకు అనుమతులు అధికారుల లాభం కోసమా? మిల్లర్ల లాభం కోసమా? అని ప్రజలు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు.

డబ్బులిస్తే ఏదైనా ఓకే

పౌరసరఫరాల శాఖ బాస్ నుంచి మొదకొని జిల్లా బాధ్యుల వరకు డబ్బులిస్తే ఏ పనైనా నడుస్తది అనడానికి యాసంగి సీజన్‌లో రా రైస్ మిల్లులకు ఇచ్చిన ప్రత్యేక అనుమతే నిదర్శనంగా నిలుస్తున్నది. అసలు ధాన్యం దిగిందా! దిగలేదా..! ఉత్తుత్తి ట్రక్‌షీట్లతో డబ్బులు తీసుకున్నారా! అనేది కూడా ప్రశ్నార్ధకంగా మారింది. సివిల్ సప్లయ్ బాస్‌తోపాటు అందరికి డబ్బులు ముట్టడం వల్లనే ఇలా అడ్డదిడ్డంగా కేటాయింపులు, అనుమతులు ఇచ్చారని సక్రమంగా సీఎంఆర్ ఇస్తున్న మిల్లర్లు ఆరోపిస్తున్నారు.  

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను గడువులోపు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదు. పది శాతం సీఎంఆర్ ఇవ్వని మిల్లులను తనిఖీచేసి ధాన్యం నిల్వలు పరిశీలించి, నిల్వలు లేకుంటే కేసులు నమోదు చేయాలని సివిల్ సప్లయ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయని రైస్ మిల్లులను బ్లాక్ లిస్టులో చేర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించాం. నిర్లక్ష్యం వహించే మిల్లులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.

 కలెక్టర్ కుమార్ దీపక్