08-04-2025 08:41:17 PM
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి..
కాటారం (విజయక్రాంతి): ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, భవిష్యత్ దేశ నిర్మాణం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉన్నదని, విద్యతో మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుందని వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా సేవలందిస్తూ, 26 సంవత్సరాలుగా ఉద్యోగ జీవితాన్ని పూర్తి చేసుకున్న పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షురాలు జన్నపురెడ్డి ఉమారాణి ఉద్యోగ విరమణ సన్మానోత్సవ కార్యక్రమం కాటారం ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు హాట్కర్ సమ్మయ్య, సభ సమన్వయకర్తగా సతీష్, రాజు నాయక్ లు వ్యవహరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ... అన్ని వృత్తుల్లో కెల్లా ఉపాధ్యాయ వృత్తి పరమ పవిత్రమైనదని, ఈ వృత్తిలో ఉన్న గౌరవం మరే ఇతర వృత్తిలో లేదన్నారు. సుదీర్ఘకాలం 26 ఏళ్ల పాటు వివిధ పాఠశాలల్లో అంకితభావంతో పనిచేసి ఎందరో పేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన ఘనత ఉమారాణికి దక్కుతుందని అన్నారు. ఎన్నో పదవులు స్వీకరించి రాష్ట్ర మహిళ అసోసియేట్ అధ్యక్షురాలుగా పనిచేస్తూ.. సంఘ అభ్యున్నతికి ఇతోధికంగా కృషి చేశారని ఉమారాణి సేవలను కొనియాడారు. ఉపాధ్యాయులందరికీ నగదు రహిత హెల్త్ కార్డులను ఇప్పిస్తానని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో రూపొందించిన విధంగా ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ సిపిఎస్ ను రద్దు చేస్తూ, పాత పెన్షన్ విధానాన్ని వర్తించేలా ఉత్తర్వులు ఇప్పిస్తానని తెలిపారు.
అతి త్వరలోనే మిగిలిపోయిన స్పౌజ్ బదిలీల ఆర్డర్లను ఇప్పించడంతో పాటు, ఆగిపోయిన మ్యూచువల్ ఆర్డర్లను కూడా త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడి ఉత్తర్వులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్, కాటారం మండల విద్యాశాఖ అధికారి శ్రీదేవి, పిఆర్టియు జిల్లా అధ్యక్షులు రేగురి సుభాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్ కుమార్, మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రవీందర్, తిరుపతి, వరంగల్ పిఆర్టియు జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఉమా మహేశ్వర్ , జిల్లా గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ బాబు, జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులు, జిల్లాలోని వివిధ మండలాల పిఆర్టియు శాఖ అధ్యక్ష కార్యదర్శులు, మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.