సీఐ రామకృష్ణారెడ్డి...
నడిగూడెం (విజయక్రాంతి): దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని సీఐ రామకృష్ణారెడ్డి అన్నారు. నడిగూడెం మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో గురువారం డివైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన గంజాయి డ్రగ్స్ నిర్మూలన పోస్టర్ ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యువత మాదక ద్రవ్యాలకు, గంజాయి అలవాటుపడి ఎంతోమంది తమ జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారని, డ్రగ్స్, గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్ కు సహకరించాలని యువతను కోరారు. దేశభవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, తాత్కాలిక ఆనందం కోసమో, క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడేందుకో, లేదంటే స్నేహితుల ప్రభావం వల్లనో, స్టైల్ కోసమే కొందరు మాదక ద్రవ్యాలకు ఆకర్షితులవుతుండడం బాధాకరమని పేర్కొన్నారు. జీవితం చాలా విలువైనదని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్, మండల ఉపాధ్యక్షుడు నోసిన అంజి, కాసాని రాంబాబు దున్నభిమన్యుడు, నరసయ్య ఆంజనేయులు, జమ్మి వేణు తదిరులు పాల్గొన్నారు.