- తెలంగాణ, మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ విద్య
- పరిపాలన, ప్రజాసేవకూ ఏఐ వినియోగిస్తాం
- మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు
- సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
- గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ప్రారంభం
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) : భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) దేనని.. మైక్రోసాఫ్ట్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తం గా ఏఐ ఫౌండేషన్ అకాడమీతో కూడిన అద్వాంత (ఐ) జీఈ తెలంగాణను ప్రారంభించడంతో 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ విద్యను ప్రవేశపెట్టడంతో పాటు గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కోసం ఏఐను ఉపయోగించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌లో మరో కొత్త మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించుకోవడం మనందరికీ గర్వకారణమని అన్నారు. హైదరాబాద్ జర్నీ లో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. గచ్చిబౌలిలో 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన ప్రమాణాలతో మైక్రోసాఫ్ట్ నిర్మించి న కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం ప్రసం గించారు.
మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకుందని గుర్తుచేశారు. మైక్రోసాఫ్ట్ హైద రాబాద్ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్, ఇంపాక్ట్ క్రియేట్ చేసిందన్నారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని సీఎం తెలిపారు.
ఇది యువతకు మరింత సాధికారత కల్పిస్తుందని చెప్పడానికి తాను సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు తమ స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతం చేయడంతోపాటు మెంటార్షిప్, ఏఐ టూల్స్ మరియు గ్లోబల్ నెట్వర్క్ యాక్సెస్‌కు ఎంతగానో దోహదపడుతుందని సీఎం అన్నారు.
తమ ప్రభుత్వ సహకారంతో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేస్తుందని గర్వంగా చెబుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్రం ఏఐ నాలెడ్జ్ హబ్ సహా క్లౌడ్ ఆధారిత ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుందన్నారు. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ లీడర్‌షిప్ టీమ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఆవిష్కరణల పట్ల మైక్రోసాఫ్ట్ నిబద్ధత తమ తెలంగాణ రైజింగ్ విజన్‌కు ఎంతగానో తోడవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నేడు ప్రపంచంలోనే టెక్నాలజీ పవర్ హౌస్‌గా, సరికొత్త ఆవిష్కరణలకు, ప్రపంచ ప్రతిభను ఆకర్షించే నగరంగా మారిందని... మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ ఇతర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
రూ.15 వేల కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి..
హైదరాబాద్‌ను అన్నిరంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం రూ.15 వేల కోట్లతో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.
మెట్రో రైలు విస్తరణ, రీజనల్ రింగురోడ్డు, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, విద్యుత్తు వాహనాల ఉత్పత్తి కేంద్రంగా, క్వాంటమ్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్ రంగాలతో పాటు మూసీ పునరుజ్జీవన పథకం ద్వారా ఈ నగరం సుస్థిరాభివృద్ధికి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తోందని మంత్రి పేర్కొన్నారు.
మైక్రోసాఫ్ట్ సంస్థతో హైదరాబాద్ అనుబంధం మూడు దశాబ్దాల నాటిదని, తాజాగా 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన భవనం నిర్మించడం ద్వారా తన అంకితభావాన్ని చాటుకుందని ఆయన ప్రశంసించారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో భారీ ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోందని ఆయన తెలిపారు.
దేశంలోనే హైదరాబాద్‌ను అతిపెద్ద డేటా సెంటర్ల హబ్‌గా మారుస్తోందని కొనియాడారు. ఏఐ సిటీలో తమ కృత్రిమ మేధ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్టు ఆ సంస్థ ప్రకటించడం తమ ప్రభుత్వ విశ్వసనీయతకు నిదర్శనమన్నారు. సాంకేతిక దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్‌లను ప్రపంచ టెక్నాలజీకి అందించిన ఘనత ఈ నగరానిదన్నారు.
నూతన ఆవిష్కరణలకు మూలస్థంభంగా స్థానం సంపాదించుకుందన్నారు. ప్రపంచంలోని ప్రతి మూలన జరిగే సాంకేతిక విప్లవానికి ఈ నగరం ఏదో రకంగా భాగస్వామిగా ఉంటోందన్నారు. ఇక్కడితో తాము సంతృప్తి చెందడం లేదన్నారు. ఇది ఒక ఆరంభం మాత్రమే అని.. సుదీర్ఘ ప్రస్థానానికి బాటలు వేస్తున్నామన్నారు.
52 ప్రపంచస్థాయి పరిశోధన కేంద్రాలు, 30కి మించిన విశ్వవిద్వాలయాలు, 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు, 60 లక్షల మంది ఉత్సాహం ఉరకలెత్తే శ్రామికశక్తితో హైదరాబాద్, తెలంగాణ వెలుగులీనుతోందని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. 90 లక్షల ఇళ్లను డిజిటల్ కనెక్టివిటిలోకి తీసుకొస్తున్నాస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఏఐపై శిక్షణ అందించే మూడు కార్యక్రమాలు ఇవే
* అద్వాంత (ఐ) జీఈ తెలంగాణ ప్రోగ్రాం పేరిట మైక్రోసాఫ్ట్ 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ కోర్సును పరిచయం చేసేందుకు ఏఐ ఫౌండేషన్స్ అకాడమీ ప్రారంభిస్తోంది. దీంతో దాదాపు 50 వేల మందికి విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది.
* ఏఐ -ఇండస్ట్రీ ప్రో పేరుతో మరో కార్యక్రమాన్ని చేపడుతుంది. రాష్ర్టమంతటా 20వేల మంది పరిశ్రమల నిపుణులకు నైపుణ్యాలను నేర్పిస్తుంది.
* ఏఐ -గవర్న్ ఇనీషియేటివ్ పేరుతో రాష్ర్టంలోని దాదాపు 50 వేల మంది ప్రభుత్వ అధికారులకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ప్రొడక్టివిటీ వంటి కీలకమైన రంగాలలో శిక్షణ ఇస్తుంది. తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపించనుంది. ఏఐ నాలెడ్జ్ హబ్‌తో పాటు ఏఐ అభివృద్ధికి క్లౌడ్-ఆధారిత మౌలిక సదుపాయాలు ఇందులో ఉంటాయి. రాష్ర్టంలో వేలాది మంది ఉద్యోగులకు ఉపయోగపడేలా రీసేర్చీ, కేస్ స్టడీస్, ఉత్తమ పరిశోధన పద్ధతులు అందుబాటులో ఉంచుతుంది.
డేటా సెంటర్లపై పెట్టుబడుల రెట్టింపు...
మైక్రోసాఫ్ట్‌తో ఎంఓయూ కుదుర్చుకున్న తెలంగాణ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధితో పాటు రాష్ర్టంలో హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్లలో తన పెట్టుబడులను రెట్టింపు చేస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. వీటికి అదనంగా రూ. 15వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌కు అతిపెద్ద డేటా హబ్‌గా అవతరించనుంది.
ఈ ప్రణాళికలకు సంబంధించి మైక్రోసాఫ్ట్ కంపెనీ రాష్ర్ట ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ ప్రతినిధులను అభినందించారు.
1.2 లక్షల మందికి ఏఐ శిక్షణ
ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో తమ క్యాంపస్ ను విస్తరించింది. గచ్చిబౌలిలో 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన ప్రమాణాలతో కొత్త భవనం నిర్మించింది. ఇందులో 2500 మంది ఉద్యోగులకు సరిపడే సదుపాయాలుంటాయి.
ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు గురువారం మైక్రోసాఫ్ట్ కొత్త భవనం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ మరో కీలక నిర్ణయం ప్రకటించింది. తెలంగాణ ప్రభు త్వం భాగస్వామ్యంతో రాష్ర్టంలో దాదాపు 1.2 లక్షల మందికి అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ శిక్షణను అందించేందుకు మూడు కొత్త ప్రోగ్రాంలను ప్రకటించింది.