calender_icon.png 17 January, 2025 | 12:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంతదూరం వెళ్తే అంతే టోల్

11-09-2024 03:34:03 AM

ప్రయాణించిన దూరాన్ని బట్టే వసూలు

అమల్లోకి జీఎన్‌ఎస్‌ఎస్ టోల్ ఫ్రీ విధానం

హైవేలపై 20 కిలోమీటర్ల వరకు జీరో ఫీజు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ రహదారులపై టోల్ వసూలు వ్యవస్థలో మరో అత్యాధునిక సాంకేతికతను కేంద్ర ప్రభుత్వం పరిచయం చేసింది. ఫాస్టాగ్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ ఐడెంటిఫికేషన్ విధానాలకు తోడుగా గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టం (జీఎన్‌ఎస్‌ఎస్) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానాన్ని ఉపయోగించే వాహనాలు టోల్ రహదారులపై ఎంత దూరం ప్రయాణిస్తే అంతే దూరానికి టోల్ ఫీజు వసూలు చేస్తారు.

అంతేకాదు.. ఒకరోజులో ఒక ప్రైవే టు వాహనం ఒకే నిర్దేశిత మార్గంలో వెళ్లేటప్పుడు ౨౦ కిలోమీటర్లు, తిరిగి వచ్చేటప్పు డు ౨౦ కిలోమీటర్ల లోపల దూరానికి టోల్ ఫీజును వసూలు చేయరు. అంతకు మించి వాహనం ప్రయాణిస్తే ఆటోమేటిక్‌గా వాహనందారుడి బ్యాంకు అకౌంట్ నంబర్ నుంచి టోల్ ఫీజు కట్ అయిపోతుంది. ఈ మేరకు నేషనల్ హైవేస్ ఫీ (డిటర్మినేషన్ ఆఫ్ రేట్స్ అండ్ కలెక్షన్) రూల్స్ రూల్స్‌ను కేంద్రం మంగళవారం జారీచేసింది. 

మూడు విధానాలు

* కొత్త మార్గదర్శకాల ప్రకారం హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే ప్రైవేటు వాహనాలకు 20 కిలోమీటర్ల వరకు ఎలాంటి టోల్ ఫీజును వసూలు చేయరు. ఒక రోజుకు 20 కిలోమీటర్ల ప్రయాణానికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ మినహాయింపు జీఎన్‌ఎస్‌ఎస్ వ్యవస్థను వాడే వాహనాలకే వర్తిస్తుందని కేంద్ర రహదారుల మంత్రిత్వశాఖ జారీచేసిన ఉత్తర్వుల్లో తెలిపింది. 

* జాతీయ రహదారులు, శాశ్వత వంతెనలు, బైపాస్‌లు, టన్నెళ్లు తదితర  రహదారులపై రోజూ ఒకే ప్రాంతంలో ప్రయాణించే డ్రైవర్, ఓనర్ లేదా మెకానికల్ వాహన ఇన్‌చార్జి జీఎన్‌ఎస్‌ఎస్ ఆధారిత ఫీజు విధానాన్ని వాడుతున్నట్టయితే వారికి రోజుకు 20 కిలోమీటర్ల ప్రయాణం వరకు జీరో ఫీజు ఉంటుంది. ఇది ఒకవైపు వెళ్లటానికి 20 కిలోమీటర్లు, తిరిగి రావటానికి 20 కిలోమీటర్ల దూరానికి వర్తిస్తుంది. నిత్యం ఒకే ప్రాంతంలో ప్రయాణించే వాహనాలకు ఇది వర్తిస్తుంది. జాతీయ పర్మిట్ ఉన్న వాహనాలకు ఇది వర్తించదు అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

* జీఎన్‌ఎస్‌ఎస్ విధానం కోసం టోల్ గేట్ల వద్ద ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేస్తారు. ఇందులో నుంచి వెళ్లే వాహనాలకు జీఎన్‌ఎస్‌ఎస్ పరికరం ఉంటే ఆటోమెటిక్‌గా టోల్ చెల్లించబడుతుంది. ఈ వ్యవస్థ లేని వాహనాలు ఈ లేన్‌లో వెళ్తే సాధారణ టోల్ ఫీజుకంటే రెట్టింపు వసూలు చేస్తారు.

* జీఎన్‌ఎస్‌ఎస్ టోల్ విధానంలో భౌతిక టోల్ గేట్లతోపాటు వర్చువల్ టోల్ గేట్లు కూడా అందుబాటులోకి వస్తాయి. అంటే ఒక టోల్ గేట్ దాటిన తర్వాత వాహనం మరో టోల్ గేట్ వద్దకు చేరుకోకుండానే టోల్ రహదారి నుంచి దిగి వెళ్లిపోతే.. ఆ వాహనం దిగిన చోటును వర్చువల్ టోల్ గేట్‌గా ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. అక్కడి వరకు లెక్కగట్టి టోల్ తీసేసుకొంటుంది. దీనివల్ల వాహనందారుడికి డబ్బు ఆదా అవుతుంది. 

* జీఎన్‌ఎస్‌ఎస్ విధానం వల్ల టోల్‌గేట్ వద్ద వేచి ఉండే సమయం కూడా భారీగా తగ్గనున్నది. ప్రస్తుతం టోల్ గేట్ వద్ద ఒక్కో వాహనం సగటున ౭౧౪ సెకన్ల పాటు ఆగుతున్నది. జీఎన్‌ఎస్‌ఎస్ వల్ల అది ౪౭ సెకన్లకు తగ్గుతుందని భావిస్తున్నారు. 

* దేశంలోని జాతీయ రహదారులపై టోల్ వసూలు వ్యవస్థను మరింత బలోపేతం, పారదర్శకంగా మార్చేందుకు ఫాస్టాగ్, ఆటోమెటిక్ నంబర్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌తోపాటు జీఎన్‌ఎస్‌ఎస్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్టు రోడ్లు, జాతీయ రహదారుల శాఖ జూలైలో ప్రకటించింది.