రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
వనపర్తి, జనవరి 22 ( విజయక్రాంతి ) : సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకే అందించాలనేదే ప్రభుత్వం ఉద్దేశమని, కాబట్టి ప్రజలు గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాల అమలుకోసం నిర్వహిస్తున్న గ్రామ సభల్లో భాగంగా బుధవారం రెండో రోజు గోపాల్ పేట్ మండలంలోని తాడిపర్తి గ్రామంలో జరిగిన గ్రామ సభకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు.
గ్రామ సభను ఉద్దేశించి వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకే అందాలనే ఉద్దేశ్యంతో అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి అర్హులైన వారి జాబితా రూపొందించడం జరిగిందన్నారు. ఈ జాబితాలో ఇంకా ఏమైనా మార్పు చేర్పులు, అభ్యంతరాలు ఉన్నాయా అనేది ప్రజల సమక్షంలో పెట్టీ ప్రజల అభిప్రాయాలు, సూచనలు తీసుకురావడం జరుగుతుందన్నారు.
లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని ఇంకా ఎవరైనా నిజమైన లబ్ధిదారులు ఉంటే గ్రామ సభలో కానీ మండలంలోని ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పథకాల అమలు విషయంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, తహసిల్దార్ తిలక్ రెడ్డి, ఎంపిడివో, ఇతర అధికారులు, ప్రజలు, పాల్గొన్నారు.