calender_icon.png 26 October, 2024 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి

26-10-2024 01:42:44 AM

  1. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత
  2. డబ్బుతోనే అభివృద్ధి సాధ్యం కాదు
  3. మంచి విజన్, చిత్తశుద్ధితోనూ సాధ్యమే..
  4. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 

ఖమ్మం, అక్టోబర్ 25 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిరికీ అందాలని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. ఖమ్మం కలెక్టరేట్‌లో శుక్రవారం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో కలిసి జిల్లా ప్రముఖులు, కళాకారులు, రచయితలు, క్రీడాకారులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు.

తాను కూడా పద్మశ్రీ వనజీవి రామయ్య లాగే తన కెరీర్‌ను  ప్రారంభించానని గుర్తుచేసుకున్నారు. ప్రకృతిని దైవంతో సమానమనే భావన ప్రతిఒక్కరిలో ఉండాలన్నారు. జిల్లాలోని ప్రభు త్వ పాఠశాలల్లో న్యూట్రిషన్ గార్డెన్ ఆలోచన తనకెంతో నచ్చిందని కితాబునిచ్చారు. జిల్లా పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు ఎంతో అవకాశం ఉందని, సారనాథ్‌లా నేలకొండపల్లిలోని బౌద్ధస్తూపాన్ని అభివృద్ధి చేయాల ని ఆకాంక్షించారు.

రాష్ట్రవ్యాప్తంగా పిల్లల కోసం ఎడ్యుకేషన్ టూర్ నిర్వహించాలని సూచించారు. కేవలం డబ్బుతోనే అభివృద్ధి సాధ్యం కాదని, మంచి విజన్, చిత్తశుద్ధితో కూడా సాధ్యమేనన్నారు. జిల్లాలో అనేక పురావస్తు శాఖ ప్రదేశాలు, దేవాలయాలు, స్టెప్ వెల్స్ ఉన్నాయని, ఆయా ప్రదేశాలను అభివృద్ధి చేస్తే జిల్లాకు మరింత పేరు వస్తుందన్నారు.

కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లా డుతూ.. గతంలో జిల్లాలో డెంగ్యూ, అనీమియా కేసులు అధికంగా నమోదయ్యేవని, కానీ కొన్నేళ్లుగా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తుందన్నారు. సమావేశంలో సీపీ సునీల్‌దత్,  అదనపు కలెక్టర్  డాక్టర్ శ్రీజ, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్, కాళోజీ అవార్డు గ్రహీత సీతారాం పాల్గొన్నారు.  గవర్నర్ కలెక్టరేట్‌లో ఫొటో ఎగ్జిబిషన్, స్టాల్స్‌ను సందర్శించారు. 

కొత్తగూడెంలో...

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 25 (విజయక్రాంతి): కొత్తగూడెం కలెక్టరేట్‌లో శుక్రవారం గవర్నర్ జిల్లా కళాకారులు, రచయితలు, ప్రముఖలతో ముఖాముఖి నిర్వ హించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజల్లో రక్తహీనత నివారించేందుకు కృషి చేస్తామన్నారు.

స్వచ్ఛభారత్‌లో భాగంగా జిల్లాలోని 481 గ్రామ పంచాయతీలు బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించడం సంతోషకరమన్నారు. గవర్నర్ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించారు. కలెక్టర్ జితేష్ పాటిల్ జిల్లాలోని ముఖ్యమైన దేవాలయాలు, పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి గురించి గవర్నర్‌కు వివరించారు.

గవర్నర్ వెంట మానుకోట ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకట్రావు ఉన్నారు. అనంతరం గవర్నర్ భద్రాచలంలోని మార్కెట్ సెంటర్‌లో రూ.46 లక్షలతో నిర్మించిన 20 పడకల తలసేమియా, సికిల్ ఎనీమియా వార్డును ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్  పొదెం వీరయ్య, ఐటీడీఏ పీవో రాహుల్ పాల్గొన్నారు.