calender_icon.png 24 October, 2024 | 12:44 PM

Breaking News

బ్రహ్మజ్ఞాన పుణ్యఫలం

12-07-2024 01:00:00 AM

కలకుంట్ల జగదయ్య

తస్మాదధ్యాయ మాద్యం యఃపఠతే శ్రుణుతే స్మరేత్ 

అభ్యసేత్తస్య సభవేత్ భవాంభోధిర్దురత్తరః ॥

పూర్వం సుశర్మ అనే వ్యక్తి సర్వవిధాల భ్రష్టుడై మరణిస్తాడు. నరకాన్ని కూడా అనుభవించి మరుజన్మలో ఎద్దుగా పుడతాడు. ఆ ఎద్దు ఒకనాడు ఒకానొక పర్వత ప్రాంతంలో బరువులు మోస్తూ, నేలకూలి మరణయాతన అనుభవిస్తూ ఉంటుంది. ఆ దారిన పోయే బాటసారులు దాని యాతనను చూసి బాధ పడుతూ ఉంటారు. వారిలో ఒక వేశ్యకూడా ఉంది. ఆమె ఎద్దు పరిస్థితికి చాలా ఆవేదన చెందుతుంది. అప్పుడు “నేనేమైనా పుణ్యం చేసి వుంటే ఆ ఫలాన్ని ఈ ఎద్దుకు ధారపోస్తున్నాను. దీనికి సద్గతులు కలగాలి” అని మనసారా స్మరించుకుంది. 

ఆ పుణ్యఫలంతో ఎద్దు మరుజన్మలో బ్రహ్మ జ్ఞానిగా జన్మిస్తుంది. పూర్వజన్మ స్మృతివల్ల ఆ బ్రహ్మజ్ఞాని ఆ వేశ్య ఇంటికి వెళతాడు. “నాకు నువ్వు ధారబోసిన పుణ్యమేమిటి?” అని అడిగాడు. ఆమె తనకేమీ తెలియంది. కానీ, అక్కడే వున్న ఆమె పెంపుడు చిలుక బ్రహ్మజ్ఞానిని చూసి, “అయ్యా! తొలుత నేనొక ముని ఆశ్రమంలో తిరిగే దాణ్ణి. ఆ ఋషి నిత్యం భగవద్గీత ప్రథమాధ్యాయాన్ని పఠించేవాడు. క్రమంగా నాకూ అది అలవాటైంది. ఇంతలో విధి వశంతో నేను ఈ వేశ్య పరమయ్యాను. నా అలవాటు ప్రకారం నేను ప్రథమా ధ్యాయాన్ని నాదైన భాషలో పారాయణం చేస్తున్నాను. నామీద ప్రేమతో ఈమె దానిని శ్రద్ధగా ఆలకించింది కదా. అదే నీకు మేలు చేసిన పుణ్యం” అంది. 

“అవునా! భగవద్గీత ప్రథమాధ్యాయాన్ని విన్నంతనే ఇంతటి పుణ్యం వస్తుందా? ఇక ఆ శ్లోకాన్ని పారాయణ చేయడం వల్ల మరెంత పుణ్యమో కదా” అని ఆ జ్ఞాని నిత్యం ప్రథమాధ్యాయాన్ని పఠించి జన్మాంతర ముక్తిని పొందాడు.

ఆత్మజ్ఞాన ప్రాప్తి

శ్లో॥ శిక్షితప్తేన పూతాత్మ పఠన్నధ్యాయ మాదరాత్  

ద్వితీయ మాససాదోచ్చెరినిరవద్యం పరం పదమ్ ॥

పూర్వం దేవశర్మ అనే సదాచార సంపన్నుడు ఒకడు వుండేవాడు. ఆత్మ జ్ఞానాన్ని పొందాలనుకొని అతను ఒక సాధువును ఆశ్రయించాడు. సాధువు అతనిని ‘మిత్రవంతుడు’ అనే మేకల కాపరివద్దకు పంపుతాడు. దేవశర్మ వెంటనే మిత్రవంతుని కలిశాడు. అప్పుడు మిత్రవంతుడు ఇలా అన్నాడు దేవశర్మతో  “అయ్యా! నేనొకనాడు ఒకచోట మేకలను కాస్తుంటే, ఒక పెద్దపులి వచ్చింది. దానిని చూసి నాతోపాటు మేకల మంద చెల్లా చెదరయ్యింది. కానీ, కొన్ని మేకలు పులికి చిక్కాయి. ఆశ్చర్యంగా, పులి ఆ మేకలను తినలేదు. పైగా, మేకలు పులితో స్నేహంగానూ మెదిలాయి. నేను ‘ఏమిటీ వింత!’ అని ఆలోచిస్తూ, అక్కడే ఉన్న ఒక వృద్ధ కోతిని కారణం అడిగాడు. 

దానికి అది అంది కదా, ‘ఓ మిత్రమా! పూర్వం ఒక యోగేంద్రుడు ఇక్కడి శిలా ఫలకంపై భగవద్గీతలోని ద్వితీయ ఆధ్యాయాన్ని చెక్కించాడు. దానిని సుకర్మ అనే వ్యక్తికి ఇయ్యగా, అతను దానిని ఇక్కడే వుంచి, పారాయణం చేసి ఆత్మ జ్ఞానాన్ని పొందాడు. ఆ సిద్ధ పురుషుడు నడయాడిన ఈ స్థలంలో పులి సామరస్యంగా కలిసి ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు’. ఆ వానరం సూచన మేరకు నేనుకూడా ఆ శిలల మీది గీత రెండవ అధ్యాయాన్ని పారాయణం చేస్తున్నాను”. మిత్రవంతుడు చెప్పిన దానిని విన్న దేవశర్మ తానుకూడా ఆ శిలలమీది భగవద్గీత ద్వితీయ అధ్యాయాన్ని పఠించి ఆత్మజ్ఞానం పొందాడు.