మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
గజ్వేల్, ఆగస్టు 14: హైదరాబాద్‌కు మరో మణిహారంగా ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం చేపడుతున్నామని, అక్టోబర్ చివరివారంలో ఆర్‌ఆర్‌ఆర్ నార్తర్న్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. బుధవారం గజ్వేల్‌లో తిరంగా ర్యాలీలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. హైదరాబాద్‌కు గ్రామాలను అనుసంధానం చేయాలన్న ఉద్దేశంతో ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి ప్రతిపాదించి, తెలంగాణ ప్రభుత్వాన్ని నివేదికలు సమర్పించాలని కోరారన్నారు.
గత ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం చేయడంతో ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి 3 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని, దానిలో మొదటి ప్రతిపాదనల వల్ల ఖర్చు, భూసేకరణ తగ్గుతుందని గుర్తించి దానినే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫైనల్ చేసినట్లు చెప్పారు. 2021 డిసెంబర్ నుంచి భూసేకరణ పనులు ప్రారంభమైనా గత తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా భూసేకరణ పనులు నత్తనడకన సాగాయన్నారు. నార్తర్న్ రహదారికి సంబంధించి 158.645 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగుతుందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ.17,239కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు.