- కేంద్ర బృందానికి ప్రభుత్వం నివేదిక
- నాలుగైదు రోజుల్లో ప్రధాని, హోంమంత్రిని కలుస్తాం
- రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం, సెప్టెంబర్ 14 ( విజయక్రాంతి): వరదల వల్ల రాష్ట్రంలో దాదాపు రూ.10,300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, ఈమేరకు కేంద్ర బృందానికి నివేదించామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన నియోజకవర్గంలోని కూసుమంచి, పాలేరు, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, కేంద్రం నుంచి సత్వరం వరద నిధులు విడుదల చేయాలని కోరుతున్నామన్నారు.
ఇప్పటికే ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ తీసుకున్నామని, నాలుగైదు రోజుల్లోనే ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలుస్తామన్నారు. వరద నష్టంపై అంచనా వేసేందుకు కేంద్ర పరిశీలకులు సైతం నష్టాన్ని చూసి చలించి పోయారని గుర్తుచేశారు. కూసుమంచి మండలం హట్యాతండా వద్ద పాలేరు ఎడమ కాల్వకు పడిన గండిని యుద్ధప్రాతిపదికన పూడ్చే విధంగా చర్యలు తీసుకోవా లని అధికారులను ఆదేశించారు.