calender_icon.png 17 January, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుండపోత

02-09-2024 01:02:59 AM

నగరంలో రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షం

నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు

కలెక్టర్, జీహెచ్‌ఎంసీ మేయర్, కమిషనర్ సుడిగాలి పర్యటనలు

59 పునరావాస కేంద్రాల ఏర్పాటు

జీహెచ్‌ఎంసీ, కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం హైదరాబాద్ మహానగరాన్ని ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందనం అయ్యాయి. నాలాలు, చెరువులు, కుంటలకు సమీపంలోని కాలనీల్లోని ఇండ్లు నీటమునిగాయి. వాయుగుండం ప్రభావంతో నగరం లో శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు భారీ వర్షం కురిసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాగల 24 గంటల్లో బలహీనపడి ఉత్తరాంధ్ర తీరం దాటి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, హైడ్రా, హెచ్‌ఎండీఏకు సంబంధించిన అన్ని విభాగాల అధికారులు 610 బృందాలుగా ఏర్పడి సహాయక చర్యలు చేపట్టారు. కూకట్‌పల్లి, అల్లాపూర్ ప్రాంతంలో సుమారు 20 ఇండ్లు నీటమునిగాయి.

వెంటనే స్పందించిన అధికారులు నీటమునిగిన ఇండ్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతా లకు తరలించారు. నగరంలో మొత్తం 115 ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. 24 చోట్ల నీరు నిలిచింది. నగరంలోని సుమారు 28 చెరువులు పూర్తిగా నిండి మత్తడి దూకాయి. లోతట్టు ప్రాంతాల్లో మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ అమ్రపాలి పర్యటించారు. హుస్సే న్ సాగర్ నాలా పరీవాహక ప్రాంతా ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటు న్నారు. నగరంలో ఎక్కడా కూడా గోడలు కూల డం కానీ, ప్రాణనష్టం సంభవించలేదు. 

అత్యధికంగా బీహెచ్‌ఈఎల్‌లో...

శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు నగరంలోని బీహెచ్‌ఈఎల్ ప్రాంతం లో అత్యధికంగా 8.53 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గచ్చిబౌలిలో 8.13 సెం.మీ,  కేపీహెచ్‌బీలో 7.83 సెం.మీ, హైదర్‌నగర్‌లో 7.78 సెం.మీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 7.65 సెం.మీ, గాజుల రామా రం, మహాదేవ్‌పూర్‌లో 7.60 సెం.మీ,  యూసుఫ్‌గూడ లో 7.48 సెం. మీ, హయత్‌నగర్, షేక్‌పేట్‌లో 7.28 సెం.మీ, వనస్థలిపురం లో 7.18 సెం.మీ, సౌత్‌హస్తినాపు రంలో 7.18 సెం.మీ, కాప్రా, సరూర్‌నగర్‌లో 7.15 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమో దు అయ్యిందని టీజీడీపీఎస్ అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నగరంలోని మలక్‌పేట్‌లో అత్యధికంగా 4.68 సెం.మీ వర్షం కురిసింది.

అలాగే బతుకమ్మకుంటలో 4.48 సెం.మీ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌లో 3.68 సెం.మీ, షేక్‌పేట్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, బాలాజీనగర్‌లో 3.35 సెం.మీ, యూసుఫ్‌గూడ, సఫిల్‌గూడలో 3.33 సెం.మీ, కేపీహెచ్‌బీలో 3.28 సెం.మీ, రాజేంద్రనగర్‌లో 3.18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. రెండురోజులు గా విరామం ఇవ్వకుండా కురిసిన వర్షం కారణంగా నగరంలో ఊష్ణో గ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోయా యి. దీంతో నగ రం పూర్తిగా చల్లబడింది. పనుల కోసం బయటకు వెళ్లాల్సిన వారు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతా ల్లో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డా రు. జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

అప్రమత్తమైన అర్బన్ ఫారెస్ట్రీ విభాగం..

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి) : నగరంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పార్కులు, రహదారుల వెంబడి పెద్ద పెద్ద చెట్లను, కొమ్మలను తొలగించే పనిలో హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం నిమగ్నమైంది. హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదే శాలతో పార్కులు, రహదారులు, ఓఆర్‌ఆర్‌పై విరిగిపడిన చెట్లకొమ్మలను ఎప్పటిక ప్పుడు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో కూకట్‌పల్లి పటేల్‌కుంట పార్కు, కొత్వాలగూడ ఎకో పార్కు, సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్‌పైన విరిగిన కొమ్మలను ఆదివారం తొలగించారు. భారీ వర్షాల నేపథ్యంలో అర్బన్ ఫారెస్ట్రీ సిబ్బంది అప్రమ త్తంగా ఉన్నట్లు డైరెక్టర్ ప్రదీప్ కుమార్ శెట్టి తెలిపారు.

వర్షంలోనూ సేవలు..

రెండు రోజులుగా వర్షం కురుస్తున్నప్ప టికీ ప్రజలకు ఇబ్బందులు కలగవద్దని.. విద్యుత్, జీహెచ్‌ఎంసీ, జలమండలి, హైడ్రా అధికారులు, సిబ్బంది సేవలందిస్తున్నారు. మేడ్చల్‌లో విద్యుత్ సరఫరాకు అంతరా యం కలగడంతో ట్రాన్స్‌ఫార్మర్‌పై నిలబడి విద్యుత్ ఉద్యోగులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. గడ్డి అన్నారం వద్ద ఫీడర్‌పై చెట్టు విరిగి పడటంతో చెట్టు కొమ్మలను తొలగించారు. వాటర్‌లాగింగ్ పాయింట్లు, లోతట్టు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ, జలమండలి సిబ్బంది క్షేత్రస్థాయిలో సేవలందించారు. డీఆర్‌ఎఫ్ సిబ్బంది కూడా వర్షాన్ని లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారు.  

విరిగిన స్తంభాలు, కూలిన చెట్లు..

వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో దాదాపు రెండుగంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముషీరాబాద్, చిక్కడ్ పల్లి, నారాయణగూడ తదితర ప్రాం తాల్లో కాసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శేరిలింగంపల్లి, అత్తాపూర్‌లో చెట్లు విరిగి పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అధికారులు విద్యుత్‌ను పునరుద్ధరించారు. మారేడ్‌పల్లిలో చెట్టు కూలడంతో విద్యుత్ స్తంభం విరిగిపడింది. 

మణికొండ సబ్‌స్టేషన్ సందర్శన..

మణికొండలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారుకీ తనిఖీ చేశారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్యలుంటే కంట్రోల్ రూకు ఫోన్ చేయాలని సూచించారు. స్కాడా కార్యాలయాన్ని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ రోనాల్డ్‌రాస్‌తో కలిసి సందర్శించారు.

అత్యవసరమైతేనే బయటకు రావాలి

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అన్నారు. కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులకు ఆదివారం పలు సూచనలు చేశారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో ఆదివారం రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సుధీర్‌బాబు పాల్గొన్నారు. 

స్తంభాలకు దూరంగా ఉండాలి

  1. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ అధికారులు సూచించారు. 
  2. తడిసిన కరెంట్ స్తంభాలు, పార్క్‌లు, స్టేడియంలలోని కరెంట్ స్తంభాలను ముట్టుకోవద్దు.
  3. తడిచిన చేతులతో స్టార్టర్లు, మోటార్లు, ఇంట్లోని స్విచ్ బోర్డులను, కరెంట్‌కు సంబంధించిన వేటినీ ముట్టుకోవద్దు. 
  4. కరెంట్ వస్తువులకు చిన్నపిల్లలను దూరంగా ఉంచాలి.
  5. ఉతికిన బట్టలను ఇనుప తీగలపై వేయకూడదు.
  6. తెగిన విద్యుత్ తీగలు, వైర్లను తాకొద్దు.
  7. వర్షం పడుతున్న సమయంలో టీవీ, ఫ్రిడ్జ్, కంప్యూటర్లను ఆఫ్ చేయాలి.
  8. కరెంట్ లైన్ల కింద సెల్‌ఫోన్ మాట్లాడకూడదు.
  9. ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైర్లు ఏమైనా డ్యామేజైతే విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. 

పాములు, వన్యప్రాణులను పట్టుకోవడానికి..

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి) : నగరంలో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద నీటి ప్రవాహంతో పాములు, ఇతర వన్య ప్రాణులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మొసలి వంటి వన్యప్రాణులను గుర్తించినట్లయితే తెలంగాణ అటవీశాఖ 1800 42505364, పాముల విషయంలో స్థానిక స్నేక్ క్యాచర్స్, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ 8374233366, ఇతర వన్య ప్రాణులు పట్టుకోవడం కోసం యానిమల్ వారియర్ 9697887888 నంబర్లకు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.