- జీరో కరెంట్ బిల్లు రాక పలువురు ఆవేదన
కార్యాలయాల చుట్టూ పేదల ప్రదక్షిణలు
అధికారుల వల్లే అన్యాయమని ఆగ్రహం
మళ్లీ సర్వే చేయాలంటున్న నిరుపేద జనం
నిర్మల్, జూన్ 28 (విజయక్రాంతి) : అర్హులైన వారికి గృహజ్యోతి పథకం అందిస్తామన్న ప్రభుత్వ హామీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభాసుపాలైంది. జిల్లావ్యాప్తంగా పథకం అందక పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు కరెంట్ బిల్లు మాఫీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ప్రకటించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు పథకాల అమలు కోసం దరఖాస్తులు స్వీకరించింది.
సర్కారు హామీల్లో ఒక్కటైన గృహజ్యోతి పథకం జీరో కరెంట్ బిల్లు లబ్ధిదారుల ఎంపికపై విద్యుత్ సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. నిర్మల్ జిల్లావ్యాప్తంగా మొత్తం గృహ విద్యుత్ కనెక్షన్లు 1,96,120 ఉన్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ప్రజావాణి వేదికల్లో మొత్తం 1,13,299 దరఖాస్తులు అందాయి. అందులో 88,775 దరఖాస్తులను గృహజ్యోతి పథకానికి అర్హులుగా గుర్తించారు. వీరిలో చాలామందికి జీరో బిల్లు అమలు కావడం లేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు
దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమందికి 3 నెలలుగా జీరో బిల్లు వస్తోంది. ఇక 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న మరికొందరు జీరో బిల్లు రాక ఆందోళన చెందుతున్నారు. జీరో బిల్లు అమలు కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల కొండపూర్ గ్రామస్తులు 200 మంది ఏకంగా కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. భైంసా, ఖానాపూర్‌లోనూ నిత్యం వందల సంఖ్యలో ప్రజలు విద్యుత్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. విద్యుత్ ప్రజావాణిలో సైతం వెయ్యికిపైగా మంది జీరో బిల్లు కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. అయితే, అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో నిరాశలో మునిగిపోయారు. మరోసారి రీ సర్వే చేసైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
మూడు నెలల నుంచి తిరుగుతానా..
200 యూనిట్లకు బిల్లు రాదంటే దరఖాస్తు పెట్టిన. ఇంట్లో ఉండేది నేనొక్కదాన్నే. రెండు బల్బులు, ఒక ఫ్యాన్ వాడుతా. నెలంతా 50 యూనిట్లు కాల్తది. కానీ, నాకు జీరో బిల్లు ఇస్తలేరు. మూడు నెల్ల నుంచి ఆఫీసు చుట్టూ తిరుగుతానా. ఎవ్వరూ ఏం చెప్తలేరు. జీరో బిల్లు రావాలని కోరుకుంటాన.
మల్లవ్వ, కొండపూర్
కరెంట్ కట్ చేస్తమంటున్నరు
200 యూనిట్ల కంటే తక్కువనే కరెంట్ వాడుతం. ఇంతవరకు జీరో బిల్లు రాలేదు. మూడు నెలల నుండి అధికారులకు చెపుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రతినెల బిల్లు ఇస్తున్నరు. కట్టక పోతే కరెంట్ కట్ చేస్తమంటున్నరు. అధికారులు వెంటనే మాకు న్యాయం చేయా లి. జీరో బిల్లు వచ్చేటట్లు చూడాలి.
సుకన్య, గృహిణి