calender_icon.png 15 January, 2025 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లెహరాదో..జెండా పాతాలి!

25-07-2024 12:50:54 AM

చెడ్డీలు వేసుకున్న బుడ్డోడి నుంచి.. కొత్తగా షూ కొనుకున్న కుర్రోడి వరకు.. తొలిసారి బాణం పట్టిన విలుకాడి నుంచి.. గురి ఎక్కుపెట్టడం కూడా రాని షూటర్ వరకు.. ప్రతి ఒక్కరు కలలు కనేది ఆ పతకం కోసమే. దాని కోసం నిద్రాహారాలు మానేసి ఏళ్లకు ఏళ్లు మైదానాల్లోనే పడిగాపులు కాసే వాళ్లు లక్షల మందైతే.. ఆ పతకమే తమ సర్వస్వం అని జీవితాలను అంకితం చేసేవాళ్లు కోకొల్లలు. మరి అంతటి ప్రాముఖ్యం ఉన్న ఒలింపిక్స్‌కు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి పారిస్‌లో ఒలింపిక్ క్రీడా సంబరం మొదలు కానుండగా.. క్రీడా యవనికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించేందుకు మనదేశం నుంచి 117 మంది అథ్లెట్లు విశ్వక్రీడల బరిలో దిగనున్నారు. 

టీ20 ప్రపంచకప్ గెలిచి స్వదేశానికి చేరుకున్న టీమిండియాకు అభిమానులు బ్రహ్మరథం పట్టిన దృశ్యాలు మదిలో మెదులుతుండగానే.. అభిమానులను అలరించేందుకు మన అథ్లెట్లు సిద్ధమయ్యారు. సుదీర్ఘ కాలంగా ఒలింపిక్స్ బరిలో దిగుతున్న భారత్ ఇప్పటి వరకు 35 పతకాలు సాధించింది. అందులో 10 స్వర్ణాలు, 9 రజతాలు, 16 కాంస్యాలు ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడాంశాల్లో మన అథ్లెట్లు సత్తాచాటుతుండటంతో ఈసారి ఒలింపిక్స్‌లో రెండంకెల సంఖ్యలో పతకాలు వస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి.. భారత అథ్లెటిక్స్ చరిత్ర తిరగరాసిన గోల్డెన్‌బాయ్ నీరజ్ చోప్రాపై మరోసారి భారీ అంచనాలు ఉండగా.. ఇప్పటికే రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన తెలుగుతేజం పీవీ సింధు హ్యాట్రిక్‌పై గురిపెట్టింది. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ తన పంచ్ పవర్ చాటేందుకు రెడీ అవుతుంటే.. సాత్విక్ సాయిరాజ్ శెట్టి జోడీ బ్యాడ్మింటన్‌లో పతకం పక్కా అనే ఆశలు రేపుతోంది. రెజ్లింగ్‌లో వినేశ్ ఫొగాట్, ఆర్చరీలో దీపిక కుమారి, షూటింగ్‌లో మనూబాకర్, ఇషా సింగ్, టీటీలో ఆకుల శ్రీజ, శరత్ కమల్ పతకాలు పట్టాలని తహతహలాడుతుంటే.. సుదీర్ఘ విరామం అనంతరం టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన పురుషుల హాకీ జట్టు.. ఈసారి పతకం రంగు మార్చడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరి విశ్వవేదికపై జెండా పాతేందుకు సిద్ధమవుతున్న మన అథ్లెట్లకు ఆల్ ది బెస్ట్ చెబుదాం!