23-02-2025 12:26:38 AM
26న మహాశివరాత్రి
మహాశివరాత్రి వేడుకలు ప్రధానంగా రాత్రిపూట జరుగుతాయి. ఇది శివుని గౌరవార్థం జరుపుకునే పండుగ. ఈ రోజున శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు. లింగోద్భవ కాలానికి అత్యంత విశిష్ఠమైంది. ఇవాళ్టి రోజున ప్రజలు కఠిన ఉపవాసం ఉంటారు.
అనేకమంది భక్తులు చుక్క నీరు కూడా తీసుకోరు. వారు రాత్రంతా జాగరణ చేస్తారు. ‘ఓం నమః శివాయ’ అంటూ పంచాక్షర మంత్రాన్ని జపిస్తూనే కాలం గడుపుతారు. రాత్రి ప్రతి మూడు గంటలకు ఒకసారి పాలు, పెరుగు, తేనె, గులాబీ నీరు మొదలైన వాటితో శివ లింగాన్ని అభిషేకిస్తారు.
లింగానికి మారేడు (బిల్వ) దళాలను సమర్పిస్తారు. ఈ పత్రాలు అత్యంత పవిత్రమైనవి. ఎందుకంటే, వాటిలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
పుష్పదంతంలోని శివ మహిమ్న స్తోత్రం లేదా రావణుడి శివ తాండవ స్తోత్రం వంటి పరమేశ్వర శ్లోకాలను అత్యంత ఉత్సాహంతో, భక్తితో ప్రజలు పాడతారు. శివరాత్రి సమయంలో శివనామాలను పరిపూర్ణ శ్రద్ధతో, ఏకాగ్రతతో ఉచ్చరించేవారు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారని హైందవ ధర్మగ్రంథాలు చెబుతున్నాయి.
వారు నేరుగా ఆత్మరూపులుగా శివుని నివాసానికి చేరుకుని అక్కడ సంతోషంగా నివసిస్తారు. జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతారు. మహాశివరాత్రి పర్వదినం రోజు 24 గంటలూ అశేష భక్తజనులతో అన్ని శివాలయాలు కిటకిట లాడుతుంటాయి.
కన్నీళ్లతో అభిషేకం..మారేడు దళాలతో ఆరాధన
‘మహాభారతం’లోని శాంతిపర్వంలో భీష్ముడు బాణాల పాన్పుమీద విశ్రాంతి తీసుకుంటూ, ధర్మం గురించి ప్రవచిస్తూ ఉంటాడు. అదే సమయంలో రాజు చిత్రభానుడు మహా శివరాత్రిని జరుపుకున్నాడు. ఈ కథ ద్వార మహాశివరాత్రి మహత్తు మనకు తెలుస్తుంది.
ఒకప్పుడు జంబూద్వీపం మొత్తాన్ని పాలించిన ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు చిత్రభానుడు. ఆనాటి మహాశివరాత్రి రోజు అతను తన భార్యతో కలిసి ఉపవాసం చేస్తూ ఉంటాడు. అప్పుడు అష్టావక్రుడు అనే మహర్షి రాజు ఆస్థానానికి వచ్చాడు. ఆయన అడుగుతాడు రాజును
“రాజా! ఈరోజు నువ్వు ఉపవాసం ఎందుకు పాటిస్తున్నావు?”
చిత్రభానునికి తన గత జన్మ సంఘటనలను గుర్తు చేసుకునే వరం ఉంది. ఆ ఋషితో ఇలా అన్నాడు:
“మహానుభావా! గత జన్మలో నేను వారణాసిలో వేటగాడిని. నా పేరు సుస్వరుడు. పక్షులు, జంతువులను చంపి అమ్మడమే నా జీవనాధారం. ఒకరోజు నేను జంతువులను వెతుకుతూ అడవుల్లో తిరుగుతున్నాను. రాత్రి చీకటి నన్ను చుట్టు ముట్టింది. ఇంటికి తిరిగి రాలేక, ఆశ్రయం కోసం ఒక చెట్టు ఎక్కాను. అది ఒక మారేడు (బిల్వ) వృక్షం.
ఆ రోజు నేను ఒక జింకను కాల్చాను. కానీ, దానిని ఇంటికి తీసుకెళ్లడానికి నాకు సమయం లేదు. నేను దానిని అదే చెట్టు కొమ్మకు కట్టాను. ఆకలి, దాహంతో బాధపడుతూ రాత్రంతా మేల్కొని ఉన్నాను.
అయితే, ‘నా రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న నా పేద భార్యాపిల్లలు’ గుర్తుకు వచ్చి చాలా కన్నీళ్లు పెట్టుకున్నాను. ఆ రాత్రి గడిచి పోవడానికి నేను బిల్వచెట్లు ఆకులను కోసి నేలపై పడవేస్తూ గడిపాను.
అలా, తెల్లవారింది. నేను ఇంటికి తిరిగి వచ్చి జింకను అమ్మేశాను. నా కోసం, నా కుటుంబం కోసం కొంత ఆహారం కొన్నాను. నేను ఉపవాసం విరమించబోతున్నప్పుడు ఒక అపరిచితుడు నా వద్దకు వచ్చి ఆహారం కావాలన్నాడు.
నేను మొదట అతనికి సేవ చేసి, ఆ తరువాతే నా ఆహారాన్ని తీసుకున్నాను. కొన్నాళ్లకు నా మరణ సమయంలో జరిగిన సంఘటన నాకు బాగా గుర్తుంది.
అప్పుడు శివుని ఇద్దరు దూతలు నావద్దకు రావడం చూశాను. వారు ఆత్మరూపుణ్ణయిన నన్ను శివుని నివాసానికి తీసుకెళ్లడానికి వచ్చారని అర్థమైంది. మహాశివరాత్రి నాడు మారేడు చెట్టుకింద లింగాన్ని ఆ దళాలతో పూజించిన ఫలితం నాకు అలా సిద్ధించింది. ఈ గొప్ప యోగ్యతను నేను మొదటిసారిగా ఆనాడు తెలుసుకున్నాను. చెట్టు అడుగున ఒక లింగం ఉందని వారు నాకు చెప్పారు.
నేను జార విడిచిన ఆకులు నాకు తెలియకుండానే లింగంపై పడ్డాయి. కుటుంబ సభ్యుల కోసం దుఃఖంతో కార్చిన నా కన్నీళ్లతో లింగానికి అభిషేకం జరిగింది. ఆనాటి పగలు, రాత్రంతా నేను ఉపవాసమే ఉన్నాను.
అలా, నాకు తెలియకుండానే భగవంతుడిని అర్చించిన పుణ్యఫలాన్ని పొందాను. పరమేశ్వరుని నివాసంలో నివసిస్తూ, చాలా యుగాలపాటు దైవిక ఆనందాన్ని అనుభవించాను. ఇప్పుడు నేను చిత్రభాను రాజుగా పునర్జన్మ పొందాను..” అలా, ఆ రాజు ఇచ్చిన సమాధానంతో అష్టావక్రునికి మహాశివరాత్రి గొప్పతనం తెలిసివచ్చింది.
శ్రీ స్వామి శివానంద‘డివైన్ లైఫ్ సొసైటీ’ సౌజన్యంతో..