“ఏమెయి నడుగులు లేనిది
యేమరుదో పర్ణశాల యిదికాదొకొ యే
రాముడనుగానో రాముడు
రామంబెడబాసి క్షణము బ్రతుకగ గలడే?”
అంటూ మారీచుని సంహరించి తిరిగి వచ్చిన శ్రీరామచంద్రమూర్తి పర్ణశాలలో సీతాదేవి లేని స్థితికి చింతిస్తూ అంతా వెదకి నిరాశావేదనతో తన ఉనికే లేదేమోనన్న భావాన్ని వెలువరిస్తున్న ఈ పద్యం ‘భాస్కర రామాయణం’లోని అరణ్యపర్వంలోనిది. తెలుగు సా హిత్యం ప్రారంభించిన నన్నయ భట్టు గద్య పద్యాలున్న చంపూ కావ్య ధోరణికి మార్గం వేశాడు. ఆ దారిలోనే తదనంతర కవులు సా గిపోవడం మన సాహిత్య చరిత్రలో గమనించవచ్చు. కొన్నికొన్ని స్థలాల్లో ద్విపద కావ్యా లు, నిర్వచన కావ్యాలు, గద్య కావ్యాలు ఆవిర్భవించినా అధికశాతం కావ్యాలు చంపూ పద్ధతిలో వెలువడ్డవే మనకు కనిపిస్తాయి. గద్య పద్యాత్మకంగా తెలుగులో వచ్చిన మొద టి రామాయణం ‘భాస్కర రామాయణమే’ అన్నది సాహిత్య చరిత్రకారుల అభిప్రాయం.
నలుగురు కవుల రచన
భాస్కర రామాయణాన్ని పూర్తి చేసింది న లుగురు కవులు. వారు మల్లికార్జున భట్టు, కు మార రుద్రుడు, భాస్కరుడు, అయ్యలార్యుడు. అయినప్పుడు ఇది ‘భాస్కర రామా యణము’గా ఎందుకు ప్రఖ్యాతి చెందిందో కూడా సాహిత్య చరిత్రకారులు వివిధ చర్చోపచర్చలు చేసి కారణాల్ని తెలియజేశారు. ఈ గ్రంథానికి సంబంధించిన నామచర్చ మాత్రమేగాక రచయితల్లో ఒకరైన భాస్కరుని గురించి కూడా సాహిత్య లోకంలో విస్తృత చర్చ జరిగింది. కొందరు ఈ భాస్కరుడు ‘హుళక్కి భాస్కరుడే’ అన్నారు. మరికొందరు ఈ రచయిత ‘మంత్రి భాస్కరుడు’ అని నిర్ణయించారు. ఈ మంత్రి భాస్కరుడు కవిబ్రహ్మ తిక్కన తాతగారు. స్వయంగా తిక్కనయే
“సార కవితాభిరాము గుంటూరు విభుని
మంత్రి భాస్కరు మత్పితామహుని దలతు”
అని చెప్పుకున్నాడు. ఈ కారణంగా రామాయణ కర్తయైన భాస్కరుడు ఈయనేనని భావించారు. పైగా, తిక్కన ‘ఉత్తర రామా యణం’ మాత్రమే రచించారు. అసలు రా మాయణాన్ని తాతగారు రచించారు. కనుక ఆయన ‘ఉత్తర రామాయణం’ రచన వరకే పరిమితమైనాడని చాగంటి శేషయ్య వంటి సాహిత్య చరిత్రకారులు భావించారు. అయి తే, చివరకు అనేక చర్చోపచర్చల అనంతరం విమర్శకులు “ఈ రచన చేసింది హుళక్కి భాస్కరుడే” అని పలు ప్రమాణాలతో నిర్ధారించారు.
ఈ తరహా పద్యాలే సాక్ష్యాలు
“అమర హుళక్కి భాస్కర మహాకవి
చెప్పగ నున్న యుద్ధకాం
డము తరువాయి చెప్పి బ్రకట
ప్రతిభాషణు డప్పలార్య స
త్తము సుతుడయ్యలార్యుడు...”
అన్న యుద్ధకాండంలో చెప్పబడ్డ పద్యాన్ని అంతర్గత సాక్ష్యంగా స్వీకరించి, ఆరుద్ర వంటి సాహిత్య చర్రితకారులు అనేకులు ఈ రామాయణ కర్తలలో ఒకరైన భాస్కరుడు ‘హుళక్కి భాస్కరుడే’ కాని, ‘మంత్రి భాస్కరుడు కా దని’ నిర్ధారించారు. అంతేగాక, తిక్కన శిష్యులైన కేతన వంటి వారెవ్వరూ తిక్కన తాత రామాయణ కృతికర్త అన్న మాటలేవీ చెప్పలేదు. ఆయనను కవిగా పేర్కొన్నారు తప్ప, ఆయన కృతులేవీ పేర్కొనలేదు.
‘భాస్కర రామాయణం’
పద్య గద్యాత్మకం
చంపూ కావ్యం పద్య గద్యాత్మకం. ఆ మా ర్గంలోనే ‘భాస్కర రామాయణం’ కూడా ర చింపబడింది. ఇది తెలుగులో వెలువడ్డ తొలి చంపూ రామాయణం. అప్పటికే ద్విపద రా మాయణం తెలుగులో వచ్చింది. ఈ రామాయణ కవుల్లో మల్లికార్జున భట్టు బాలకాండ ము, సుందర కాండము, కు మార రుద్రుడు అయోధ్యకాండము, హుళక్కి భాస్కరుడు అ రణ్యకాండము, యుద్ధకాండములోని కొంత భాగము, కి ష్కింధ కాండము మాత్రం బా ల సుందర కాండములు రచించిన మల్లికార్జున భట్టు రాశారు. యుద్ధకాండంలో మిగిలిన భాగాన్ని అప్పలార్య సుతుడు అయ్యలార్యుడు పూర్తి చేశాడు. ఈ విధంగా ‘భాస్కర రామాయణం’ నలుగురు కవులతో పూర్తయింది.
కందుకూరి వారి నిర్ధారణ
నలుగురు కవులతో రచన జరిగిన ఈ రా మాయణానికి భాస్కరుని పేర మాత్రమే ‘భాస్కర రామాయణ’మనే పేరు ఎందుకొచ్చిం దో సాహిత్య చరిత్రకారులు పలువురు చర్చించారు. ప్రారంభంలో బాలకాండను మల్లికా ర్జునుడు రాయడమేగాక రామాయణంలోని కిష్కింధ, సుందరకాండలు కూడా అంటే స గం రామాయణం రాసిన మల్లికార్జునుని పేర ప్రచారం కాలేదన్న విషయంలో కీ.శే. కందుకూరి వీరేశలింగం కొంత చర్చించారు. భాస్క రుడు రామాయణం రాయాలనుకొని తన కుమారుడైన మల్లికార్జునునితో ప్రారంభింపజేసి తాను మాత్రం అరణ్యకాండ తీసుకొని, తన సహపాఠియైన కుమార రుద్రునితో అ యోధ్యకాండ రాయించాడు. మళ్లీ కిష్కింధాన్ని, సుందరాన్ని కుమారునితోనే రాయిం చి, యుద్ధకాండ కొంత రాసిన తరువాత తన మిత్రుడైన అయ్యలార్యుని అనుమతితోనే అతనికి అప్పగించి ఈ రామాయణాన్ని ముగించాడు. “ఇదంతా భాస్కరుని ప్రమేయంతోనే జరిగింది కనుక ఈ రామాయణం ‘భాస్కర రామాయణం’గా ప్రసిద్ధి పొందిం ది” అని కందుకూరి వారు భావించారు.
మూడు కాండలు
ముక్కంటికి అంకితం
ఈ రామాయణం అంకితం పొందిన వారి విషయం కొం త వైవిధ్యాన్ని కలిగి ఉంది. మ ల్లికార్జునుడు రచించిన మూ డు కాండలు ముక్కంటికి అంకి తం ఇచ్చినట్టుగా ఆ పరమశివుణ్ణి గురించిన పద్యాలు ఉన్నా యి. అయోధ్యకాండ విషయం లో కుమార రుద్రుడు సాహిణి మారనను స్తుతిస్తూ పద్యాలు చెప్పినట్టు కనబడతాయి. కొన్నికొన్ని చోట్ల శివస్తుతుల మధ్యలో సాహిణి మారన పద్యాలు కనిపిస్తాయి. ఇవన్నీ లేఖకుల చిత్తాన్నిబట్టి ఉండవ చ్చునేమోనని ఆరుద్ర భావించారు. “బహుశా సాహిణి మారనయే భాస్కరుని గౌరవించి అతని పుత్రునితో, మిత్రునితో ఈ కృతికి శ్రీకా రం చుట్టించినాడేమో” అనికూడా ఆరుద్ర ని ర్ధారణకు వచ్చారు. కాకపోతే, “కృతి పూర్తయ్యేలోగా సాహిణి మారన మరణించి ఉండవ చ్చు” అనీ చెప్పారు. 32 మంది మంత్రులను ప్రశంసించే ఒకానొక సీసమాలికలోని ఒక పంక్తిలో.. “...కొనియె భాస్కరు చేత దెనుగు రామాయణం బారూఢి సాహిణి మార మంత్రి..” అన్న దాన్నిబట్టి ఈ భావన కలుగుతున్నదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రేరకుడు, కారకుడు,
రచయితా హుళక్కియే!
హుళక్కి భాస్కరుడే ‘భాస్కర రామాయ ణం’ ప్రేరకుడు, కారకుడు మాత్రమేగాక దాని రచనలోను భాగస్వామి అన్నది అత్యధిక సాహిత్య చరిత్రకారులు నిర్ణయించిన వాస్త వం. గురజాడ శ్రీరామమూర్తి, కందుకూరి వీరేశలింగం, చిలుకూరు నారాయణ రావు, కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి, ఆరుద్ర మొదలైన సాహితీ ప్రముఖులంతా ‘భాస్కర రామాయణ కర్త మంత్రి భాస్కరుడు కాదని, రచయి త ఖచ్చితంగా హుళక్కి భాస్కరుడే’ అని నిర్ధారించిన విషయం గమనించదగింది.
‘భాస్కర రామాయణం’ అరణ్యకాండలో వున్న గద్యెం
“సకల సుకవిజన ప్రణుతయశస్కర భాస్క ర ప్రణీతంబైన శ్రీరామాయణ మహాకావ్యంబునందు నారణ్యకాండంబున బ్రథమాశ్వాస ము..” అంటూ ఉన్నదాన్నిబట్టి భాస్కరుడు ‘సకల సుకవి జన ప్రణుత యశస్కరుని’గా తనను తాను చెప్పుకున్నాడు. ఆయన కవిత్వ ప్రతిభ అనన్యసా మాన్యమైంది. భాస్కరుని రచనగా వెలువడ్డ ‘భాస్కర రామాయణం’లోని అరణ్యకాండలో సీతను రావణుడు అ పహరించుకొని పోయే సందర్భాన్ని
అభివర్ణిస్తూ
“ఓలిశృంగంబు లెత్తిన కేలుగాక
నిర్ఝురంబుల పెనుమ్రోత నిగిడి బెరయ
గిరిలు జనక రాజాత్మజ పరిభవంబు
జగము లెఱుగ నాక్రోశించు పగిది దోచె”
అన్న మాటలను గమనిస్తే “ఏదైనా ఒక అన్యాయం జరిగితే చూసేవారు ‘అయ్యో!’ అ ని చేతులెత్తి మొత్తుకున్నట్టుగా ప్రకృతిని మానవీకరణం చేశాడు” అన్న సుప్రసిద్ధ సాహితీ వేత్త డా॥ గండ్ర లక్ష్మణరావు మాటలు భాస్కరుని విషయంలో అక్షరసత్యాలు.
కావ్య లక్షణాలు పుష్కలం
“హుళక్కి భాస్కరునిది ప్రౌఢమైన కవిత్వం. ఔచిత్యం, రసపోషణ వంటి కావ్య లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. నాటకీయతలోని వ్యంగ్యం ఆయనకు బాగా తెలుసు” అని పలువురు పండితుల స్థిరాభిప్రాయం. సీతాపహరణ ఘట్టంలో భాస్కరుడు, సీతాదేవి ఆక్రందనను 17 పద్యాల్లో రాశాడు. వాటిలో ఎక్కువ కంద పద్యాలే. పాఠకుని హృదయా ల్ని ద్రవింపజేసే ఘట్టంగా ఇది నిలిచింది.
“అంత నఖిల దిశలు ‘హారామ! హానాథ’
యను నెలుంగు వినుచు నడల దొడగె
జనక తనయ నీడ జాడ సింహాది స
త్వముల గములు వెంట దగులు చుండె”
అంటూ ఆమె ఆర్తనాదాలకు సకల జంతుజాలాలు క్రూరమృగాలతోసహా ఆ బాధ వెం ట పరుగెత్తడం వర్ణించిన విధానం అపురూపమైంది.
“నిప్పు చెదలంట నేర్చునే?”, “నిలువు నీరగుట”, “మిడుతలు కార్చిచ్చుపై జన్న సరణి”, “నీ వారే విధి భోయిన నేమగు” వంటి అనేకమైన తెలుగు పలుకుబళ్లు, జాతీయాలు, సామెతలను తన రచనలో ప్రయోగించడం భాస్కరుని కవిత్వంలో మనం అడుగడుగునా గమనించగలం. అక్కడక్కడా కుమారుడైన మల్లికార్జున కవిత్వంలో భాస్కరుని ప్రభావం కనిపిస్తుంది. తెలుగులో ఎన్నో అవాల్మీకాలకు దారిచూపిన కవికూడా ఈ హుళక్కి భాస్కరుడే కావడం గమనార్హం. లక్ష్మణరేఖ గీయ టం వంటి వాల్మీకి రాయని విషయాలు (ప్రక్షిప్తాలు) ఎన్నెన్నో ఈ రచనలో మనకు కనిపిస్తాయి. సామాన్య జనుల్లో ఉండే అనేకాంశాలకు మాన్యత కల్పించి తన గ్రంథంలో పొందుపరచిన కవి హుళక్కి భాస్కరుడు. ఎందరో తదనంతర కవులకు మార్గదర్శకుడై నిలచిన ఈ కవి గొప్ప శబ్ద విద్యావేది.
“రక్షశ్శిక్షణ దక్షరామ విశిఖ విశిఖ వ్రాతం
బులోలిన్ భవత్ పక్షా పేక్ష సమక్ష రాక్షస..”
వంటి అనుప్రాసయుత పద్యాలకు ఈ రామాయణం ఒక నిధి వంటిది. ఇంతటి ప్రతిభాశాలి మార్గదర్శనంలో నలుగురు ప్రతిభా వంతుల కవితాఝరిని ప్రవహింపజేసిన రామాయణ గంగ చిరస్థాయిగా నిలిచి లోకాన్ని పునీతులను చేస్తుందని ఘంటాపథంగా చెప్పవచ్చు.
చరిత్రలో అదొక విషాదమే
సాహిణి మారన ప్రతాపరుద్రుని కాలం వాడుగా చరిత్రకారులు భావించారు. తెలుగునాట వున్న కొన్ని భాగాలను ఏలిన అధికారి అన్న విషయాలను తెలిపే శాసన ఆధారాలు కనిపిస్తున్నాయి. ఆయన కాలం నాడే ఈ రామాయణ రచన జరిగిందని భావిస్తే ఇది క్రీ.శ. 1310కి పూర్వమే జరిగి ఉండాలి. సాహిణి మారన ఏలిన ప్రాంతంలోనే భాస్కరుడు, అతని కుమారుడు, అతని మిత్రుడు రచించిన ‘భాస్కర రామాయణ’ రచన జరిగి ఉంటుందన్నది నిర్ధారిత సత్యం. కానీ, రచన పూర్తికాక ముందే మారన కాలధర్మం చెందడం, ఈ రచన అంకితమంతా అస్తవ్యస్తం కావడం దురదృష్టకరం. తొలి తెలుగు చంపూ రామాయణాన్ని సాహిణి మారన అందుకోలేక పోవడమనేది చరిత్రలో జరిగిన ఒక విషాదమే. భాస్కరుని విషయంలోనూ అదొక తీరని లోటే అన్నది కాదనలేని సత్యం.