29-03-2025 12:00:00 AM
తొలి విడతగా 17 కుటుంబాలకు రూ.10.82 కోట్ల చెక్కులను అందచేసిన ఆర్డీవో దామోదర్‌రావు
భద్రాచలం, మార్చి 28 (విజయ క్రాంతి) భద్రాచలం దేవాలయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబె ట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. దేవాలయం అభివృద్ధికి గత ప్రభుత్వం 100 కోట్లు బడ్జెట్లో పెట్టి విధులు కేటా యించిన చివరకు పైసా కూడా ఖర్చు చేయకపోవడంతో భద్రాద్రి వాసులు రామ భక్తులు తీవ్ర నిరాశ నిష్పములకు గురయ్యారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వారం లోపే ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఒకే హెలికాప్టర్ పై భద్రాచలం వచ్చి రామయ్య దర్శనం చేసుకున్న అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం భద్రా చలం దేవాలయం అభివృద్ధికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు..
ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి భద్రాచలం వచ్చినప్పుడు రామయ్యను దర్శించుకుని దేవాలయం అభివృద్ధి కోసం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. నిధులు కేటాయిస్తాం వెంటనే అవసరమైన భూసేకరణ చేయండి అని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినప్పటికీ సుమారు సంవత్సరం కాలం గడిచినప్పటికీ అభివృద్ధి ఊసే జరగలేదు.
అయితే భూసేకరణ కమిటీ పలు దుపాలుగా మాడవీధులు విస్తరణ కోసం దేవాలయం అభివృద్ధి కోసం ఇల్లు కోల్పోతున్న ఇంటి యజమానులతో పలు దపాలు చర్చలు జరిపి, చివరికి రాష్ట్ర ప్రభుత్వం గత మూడు రోజుల క్రితం మంజూరు చేసిన 35 కోట్ల రూపాయలలో శుక్రవారం నాడు తొలి విడత 17 మంది ఇంటి యజమానులకు రూ10 . 82 కోట్ల నష్టపరిహారం భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు ద్వారా అందజేశారు. మొత్తం 40 కుటుంబాలు వారు దేవాలయ విస్తరణకు అభివృద్ధికి ఇల్లు కోల్పోతుండగా వారికి రూ 34. 45 కోట్లు అందజేస్తారు.
ఏప్రిల్ 6 తేదీన జరిగే శ్రీరామనవమికి ముఖ్యమంత్రి వచ్చి మాడవీధులకు దేవాలయం అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారని అందుకే దానికి అవసరమైన ప్రణాళికలు జిల్లా యంత్రాంగం రూపొందిస్తుందని దానిలో భాగమే ఈరోజు ఇంటి యజమానులకు చెక్కులు అందజేయడం జరిగినట్లు తెలుస్తున్నది.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఇంటి యజమానులకు చెక్కులు పంపిణీ చేయడంతో రామాలయం అభివృద్ధికి ఒక అడుగు ముందుకు పడినట్లు అయింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా మిగతా నిధులు కూడా వెంటనే మంజూరు చేసి దేవాలయం అభివృద్ధికి బాట లు వేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భద్రాద్రి వాసులు రామ భక్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు.