calender_icon.png 27 October, 2024 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దశాబ్దాల కలకు తొలి అడుగు

14-07-2024 06:03:19 AM

  • ఆమనగల్లులో 50 పడకల దవాఖాన నిర్మాణ పనులకు శంకుస్థాపన 
  • నాలుగు మండలాల ప్రజలకు ప్రయోజనం

రంగారెడ్డి, జూలై 1౩ (విజయక్రాంతి): దశాబ్దాల కలకు తొలి అడుగు పడింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులోని 30 పడకల ఆసుపత్రి 50 పడకలకు అప్‌గ్రేడ్ కాగా, ఇటీవల భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే అప్‌గ్రేడ్ అయినప్పటికీ పూర్తిస్థాయిలో వసతులు, సేవలు, వైద్య సిబ్బంది అందుబాటులోకి రాలేదు. 2018లో మాజీ సీఎం కేసీఆర్ ఆమనగల్లులో నిర్వహించిన ఎన్నికల సభలో దవాఖాన స్థాయి పెంచి మెరుగైన వైద్య సేవలను అందిస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో నాటి సీఎం హామీ అమలుకు నోచుకోలేదు.

అయితే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఆమనగల్లు ప్రభుత్వ దవాఖాన స్థితిగతులను  సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన సీఎం దవాఖాన అప్‌గ్రేడ్ పనులు పూర్తి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర వైద్య విధాన పరిషత్ నిధుల నుంచి మంజూరైన రూ.17.50 కోట్లతో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పనులకు ఎట్టకేలకు పునాది రాయిపడింది. ఆమనగల్లు దవాఖానను అప్‌గ్రేడ్ చేసి వైద్య సేవలను విస్తృతం చేయాలని కొంత కాలంగా పలు సంఘాలు, వివిధ పార్టీల నేతలు నిరసనలు, దీక్షలు చేసి ప్రజల తరఫున గళం వినిపించారు.

ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. ఎట్టకేలకు నిర్మాణానికి అడుగులు పడడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల, మాడ్గుల మండలాల ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. ఏడాదిలోపు నిర్మాణ పనులు పూర్తయితే వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

40 ఏళ్ల నుంచి వైద్య సేవలు.. 

ఆమనగల్లు బ్లాక్ మండల కేంద్రంలో 40 ఏళ్ల క్రితం ప్రభుత్వ దవాఖానకు బీజం పడింది. అప్పట్లో వైద్య సిబ్బంది, వసతులు సరిగా లేకపోవడంతో సేవలు సక్రమంగా అందలేదు. ఆమనగల్లు మండలంలో 30 ఏళ్ల క్రితం విద్యుత్తు తీగలు (పెద్ద లైన్) మరమ్మతు చేసే సమయంలో పలువురు కార్మికులు ప్రమాదవశాత్తు కింద పడి పది మందికి పైగా మృతిచెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికులను సమీపంలో ఉన్న ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లినా వైద్యుల కొరత, సరైన వసతి సేవలు అందుబాటులో లేని కారణంగా నిర్ణీత సమయంలో చికిత్స అందించకపోవడంతో పలువురు మృతిచెందడం అప్పట్లో అందరినీ కలిచి వేసింది.

అంతేకాకుండా హైదరాబాద్  ప్రధాన రహదారి గుండా నిత్యం వేలాది వాహనాలు ఇదే రూట్‌లో రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో పలుమార్లు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నా ఆసుపత్రికి తీసుకెళ్తే సరైన సేవలు అందని పరిస్థితి. ఈ కారణాలతో పాటు ఆమనగల్లు బ్లాక్ సమితిలో ఉన్న ప్రజలకు వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం సంకల్పించడంతో అప్పటి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మదన్‌మోహన్, కల్వకుర్తి ఎమ్మెల్యే సూదిని జైపాల్‌రెడ్డి 40 ఏళ్ల క్రితం ఆమనగల్లు ప్రభుత్వ దవాఖానలో 30 పడకల భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రజలకు మరిన్ని సేవలు అందించాలనే లక్ష్యంతో 50 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు.

మెరుగైన సేవలు అందేలా కృషి.. 

నాలుగు మండలాల కూడలి ఆమనగల్లు కేంద్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నా. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో దవాఖాన అప్‌గ్రేడ్ కోసం నిధులు తీసుకొచ్చి నిర్మాణ పనులు మొదలు పెట్టడం సంతోషకరంగా ఉంది. గతంలో దవాఖాన దుస్థితి చూసి బాధగా ఉండేది. రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు, అత్యవసర వైద్య సేవల కోసం దవాఖానకు వచ్చిన వారికి వైద్యులు అందుబాటు లేకపోవడం ప్రత్యక్షంగా చూశాను.

పలుమార్లు గత ప్రభుత్వానికి దవాఖానలో వైద్య సేవలను పెంచాలని చెప్పినా పెడచెవిన పెట్టారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల, మాడ్గుల మండలాల్లో మెజార్టీ స్థాయిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుపేదలు ఉంటారు. వారందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందక కార్పొరేట్  ఆసుపత్రులను ఆశ్రయించి చికిత్సల కోసం అప్పులు పాలవడం బాధ కలిగించేది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దవాఖానలో వైద్య సేవలపై దృష్టి పెట్టాను. భవిష్యత్తులో 100 పడకలకు మార్చేందుకు కృషి చేస్తా.

  •  కసిరెడ్డి నారాయణరెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే