29-01-2025 12:00:00 AM
పత్రికల సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం జనవరి 29న ‘భారతీయ వార్తాపత్రికల దినోత్సవం’ (ఇండియన్ న్యూస్ పేపర్స్ డే) జరుపుకుంటున్నాం. మన దేశంలో తొలిసారిగా జేమ్స్ ఆగస్టస్ హిక్కీ అనే ఐరిష్ వ్యక్తి నాయకత్వంలో ‘హికీస్ బెంగాల్ గెజిట్’ అనే వారపత్రిక కలకత్తా నుంచి 1780 జనవరి 29న వెలువడింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొనే ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ అయింది.
ఆయన పత్రిక నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా వార్తలను ప్రజలకు చేరవేసేది. దాంతో భయపడిన నాటి బ్రిటీష్ ప్రభుత్వం 1782లో దానిని రద్దు చేసింది. హిక్కీ 1740లో ఐర్లాండ్‌లో జన్మించాడు. 1740లో స్కాటిష్ ప్రింటర్ అయిన విలియం ఫాడెన్ వద్ద అప్రెంటిస్‌షిప్ చేశాడు. న్యాయవాద వృత్తిని వదిలేసి అక్కడే సర్జన్‌గా ప్రాక్టీస్ చేసేవాడు. ఆ తర్వాత బెంగాల్ గెజిట్ ప్రచురణను ప్రారంభించాడు.
ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ప్రభుత్వ పాలనలో పారదర్శకత, ప్రజాప్రతినిధులలో జవాబుదారీతనం పెంచడం, ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య అనుసంధాన కర్తగా నిలవడం వంటివి పత్రికల ప్రధాన బాధ్యతలుగా ప్రజాస్వామ్యవాదులు చెప్తారు. ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడడంలో పత్రికలు ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయనడంలో సందేహం లేదు. అవినీతి, అక్రమాలు జరుగకుండా ‘వాచ్‌డాగ్’ వలె నిలబడాల్సింది కూడా వార్తా పత్రికలే.
ప్రస్తుత డిజిటల్ టెక్నాలజీ యుగంలో సంప్రదాయ వార్తాపత్రికలకు ప్రజలనుంచి ఆదరణ క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. మరోవైపు ఆన్‌లైన్ పత్రికలు, సోషల్ మీడియా ప్రాధాన్యాలు పెరిగాయి. సమాచారం క్షణాల్లో డిజిటల్ వేదికలద్వారా ప్రజలకు చేరుతున్నది. టివీ చానెల్స్ కూడా రాత్రనక, పగలనక వార్తలను చేరవేస్తున్నాయి. దీంతో పత్రికల ముద్రణ తప్పనిసరి కాకుండా పోయింది. పాఠకులు, ప్రజలు, వీక్షకుల ఆదరణనుబట్టే ఏదైనా మనుగడ, అభివృద్ధి సాధ్యమవుతుంది.
ప్రింట్ మీడియాకు తనవైన ప్రత్యేకతలు, ప్రయోజనాలు లేకపోలేదు కనుక రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత మెరుగుపడే అవకాశాలు కూడా లేకపోలేదని పత్రికా వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. భారతీయ వార్తాపత్రికల దినోత్సవ సందర్భాన్ని ఒక లాంఛనంగా కాకుండా ప్రయోజనాత్మకంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
డా బుర్ర మధుసూదన్‌రెడ్డి