calender_icon.png 28 September, 2024 | 1:00 AM

తొలి స్వదేశీ బ్యాంక్ పీఎన్‌బీ

22-09-2024 12:00:00 AM

భారతీయులు దేశంలో నెలకొల్పిన తొలి స్వదేశీ బ్యాంక్‌గా ఘనత పొందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,  బ్యాంక్ ఆఫ్ బరోడాల తర్వాత మూడో పెద్ద బ్యాంక్‌గా కొనసాగుతున్నది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్థాపనకు పంజాబ్ కేసరిగా పేరొందిన స్వాతంత్య్ర సమరయోధుడు లాలా లజపతిరాయ్ శ్రీకారం చుట్టారు. భారతీయుల డబ్బుతో (డిపాజిట్లు) బ్రిటిష్‌వారు బ్యాంక్ ల్ని నడిపి కొద్దిపాటి వడ్డీని డిపాజిట్‌దారులకు ఇచ్చి, లాభాలను బ్రిటన్ తీసుకె ళుతున్నారన్న కారణంతో లాలా లజపతిరాయ్  స్వదేశీ బ్యాంక్‌ను నెలకొల్పాలంటూ తన స్నేహితుల్ని ఉత్తేజపర్చడంతో 1882 నాటి ఇండియన్ కంపెనీల చట్టం కింద  పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1894లో ప్రారంభమయ్యింది.

1895లో తొలిశాఖను లాహోర్‌లో ప్రారంభించగా లాలా లజపతి రాయ్ తొలి ఖాతాను తీసుకున్నారు. ఆయన సోదరుడు బ్యాంక్‌లో మేనేజర్‌గా చేరారు. అటుతర్వాత పీఎన్‌బీ  కాలక్రమేణా 7 వివిధ బ్యాంకుల్ని టేకోవర్ చేసింది. దేశ విభజన అనంతరం పాకిస్థాన్‌లో వున్న ఆస్తుల్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కోల్పోయినప్పటికీ, ధృడంగా నిలిచింది. 1978 లో లండన్‌లో శాఖను ప్రారంభించడం ద్వారా విదేశాలకు విస్తరించింది.

1969లో కేంద్ర ప్రభుత్వం పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో సహా 14 ప్రధాన ప్రైవేటు బ్యాంక్‌ల్ని జాతీయం చేయడంతో అప్పటి నుంచి ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా అవతరించింది. పీఎస్‌యూ బ్యాంక్‌ల సంఖ్యను తగ్గించే క్రమంలో కేంద్రం ప్రతిపాదించిన విలీన ప్రక్రియలో భాగంగా 2019లో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో మరో రెండు ప్రభుత్వ బ్యాంక్‌లు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను విలీనం చేశారు. 

విస్తరించిన వ్యాపారాలు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ సాంప్రదాయక రిటైల్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్‌లతో పాటు క్రెడిట్ కార్డ్స్, వెల్త్ మేనేజ్‌మెంట్, అసెట్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్, మ్యూచువల్ ఫండ్స్,  ఇన్సూరెన్స్ తదితర విభాగాల్లోకీ విస్తరించింది. పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్, పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్‌లు ఈ బ్యాంక్‌కు సబ్సిడరీలే. 

రూ.1.29 కోట్ల మార్కెట్ విలువ

స్టాక్ మార్కెట్‌లో చురుగ్గా ట్రేడయ్యే పంజాబ్ నేషనల్ బ్యాంక్  ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1.28,939 కోట్లు. గతంలో కొన్ని కుంభకోణాల్లో చిక్కుకోవడంతో ఇతర పీఎస్‌యూ బ్యాంక్‌లతో పోలిస్తే గడిచిన మూడేండ్లలో పీఎన్‌బీ షేరు ఇన్వెస్టర్లకు తక్కువ రాబడినే ఇచ్చింది. 

12 వేలకుపైగా శాఖలు..రూ.15.99 లక్షల కోట్ల ఆస్తులు

పీఎన్‌బీకి 2024 జనవరినాటికి 18 కోట్లకుపైగా ఖాతాదారులున్నారు. ఈ బ్యాంక్ ఆస్తుల పరిమాణం తాజా గణాంకాల ప్రకారం రూ.15.99 లక్షల కోట్లు.  దేశవ్యాప్తంగా 12,000కు పైగా శాఖలు, 1,00,000 మందికిపైగా ఉద్యోగులతో పీఎన్‌బీ బ్యాంకింగ్ సర్వీసుల్ని అందిస్తున్నది. 13,000కు పైగా ఏటీఎంలను ఏర్పాటుచేసింది. తెలుగు రాష్ట్రాల్లో 300కుపైగా పీఎన్‌బీ శాఖలు ఉన్నాయి. ఈ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి 73.15  శాతం వాటా ఉన్నది. పీఎన్‌బీకి ప్రస్తుతం కేజీ అనంత్ కృష్ణన్ నాన్ చైర్మన్‌గా, అతుల్ కుమార్ గోయల్ ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు.