calender_icon.png 14 January, 2025 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కత్తుల రత్తయ్య’ లాంటి పాత్రలెన్నో ఎస్వీఆర్‌కు చాన్సులిచ్చిన సినిమా

14-01-2025 01:01:19 AM

ఒక అమాయకుడు స్వార్థపరుల కత్తుల బోనులో చిక్కుకుని ఎలా బయటపడ్డాడనే అంశంతో, క్రైమ్ సస్పెన్స్ మేళవింపుతో రూపుదిద్దుకున్న చిత్రం ‘మొనగాళ్లకు మొనగాడు’. మోడరన్ థియేటర్ (సేలం) తన 102వ సినిమాగా నిర్మించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 1966, జనవరి 14న విడుదలైంది.

1963లో హిందీ చిత్ర నిర్మాత ఎస్‌ఎం సాగర్ ‘ఉస్తాదోం కే ఉస్తాద్’ సినిమాను నిర్మించాడు. బ్రిజ్ దర్శకత్వం నిర్వహించిన ఈ చిత్రం అప్పట్లో బాగా ఆడింది. షకీల నటించిన ఆఖరి సినిమా కూడా ఇదే. మోడరన్ థియేటర్స్ తిరుచెంగోడు రామలింగం సుందరం ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా హక్కులు కొని తొలుత తమిళంలో నిర్మించారు.

అక్కడ విజయం సాధించటంతో తెలుగులో ‘మొనగాళ్లకు మొనగాడు’ పేరుతో విడుదల చేశారు. నలుగురు మొనగాళ్ల కథే ఈ సినిమా. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఆ రోజుల్లో విశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. ముఖ్యంగా కత్తుల రత్తయ్య పోలీసు అధికారి అనిగాని, ప్రకాశ్ దొంగల నాయకుడని కానీ తెలియకుండా చివరి వరకు సస్పెన్స్‌ను కొనసాగించి ఉత్సుకతను నింపిన తీరుకు అప్పట్లో ప్రేక్షక లోకం జేజేలు పలికింది.

సాధారణంగా సస్పెన్స్ సినిమాలు ఒకసారి చూస్తారు. సస్పెన్స్ విడిపోయాక అంత ఉత్సాహం ఉండదు. కానీ ఈ సినిమాను ప్రేక్షకులు పదేపదే చూసేలా చేయడం చెప్పుకోదగ్గ విషయం. కత్తుల రత్తయ్యగా ఎస్వీ రంగారావు ఆహార్యం మెక్సికన్ రౌడీల తరహాలో భిన్నంగా ఉండడంతో బాగా ఆకట్టుకుంది.

హిందీ వెర్షన్‌లో నటించిన షేక్ ముఖ్తార్ కన్నా ఎస్వీఆర్ నటనే బాగుందని విమర్శకులు మెచ్చుకున్నారు. ‘కత్తుల రత్తయ్య’ వంటి పాత్ర ఎస్వీఆర్‌కు మళ్లీ దొరికేలా చేసిన సినిమా ఇదేనంటే అతిశయోక్తి కాదు. ఇందులో ‘వచ్చామే నీ కోసం- మెచ్చామే నీ వేషం’ అనే కవ్వాలీ జుగల్బందీ పాటలో సావిత్రి అతిథి నటిగా కనిపిస్తుంది. హరనాథ్, కృష్ణకుమారి, బాలయ్య, చలం, ప్రభాకర్‌రెడ్డి, రావి కొండలరావుతోపాటు పకీర్ స్వామి, భానుమతి ఇందులో నటించగా, ఎస్‌డీ లాల్ దర్శకత్వం వహించారు. వేదాచలం (వేదా) మార్కు బాణీలు సంగీత ప్రియులను రంజింపజేశాయి.