జల్లికట్టు తమిళనాడులో సంక్రాంతి పండుగ సందర్భంగా జరుపుకునే ఒక ప్రత్యేకమైన ఆట. ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాకుండా, తమిళ సంస్కృతి, వ్యవసాయం, పశుసంపదలతో ముడిపడి ఉన్న ఒక సంప్రదాయం. సంక్రాంతి వచ్చిందంటే చాలు తమిళనాడులోని ప్రతీ ఊరు జల్లికట్టుకు సిద్ధం అయిపోతుంది. సంవత్సరమంతా పోటీల కోసం తయారు చేసిన ఎద్దులతో బుల్ బ్రీడర్లు రెడీగా ఉంటారు.
ఒకేసారి తమ ఎద్దును వివిధ ప్రాంతాల్లో జరిగే పోటీల్లో పాల్గొనేలా చేస్తారు. జల్లికట్టు అనే పదం రెండు పదాల కలయిక. ఆ పదాలు ‘కల్లి’ (నాణేలు), ‘కట్టు’ (టై), ఇది ఎద్దు కొమ్ములకు కట్టిన నాణేల కట్టను సూచిస్తుంది. జల్లికట్టు అనేది తమిళనాడులో 2,000 సంవత్సరాల కిందటినుంచి వస్తున్న పోటీ. ఎద్దును మచ్చిక చేసుకునే క్రీడ, ఇందులో పోటీదారులు బహుమతి కోసం ఎద్దును మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. అందులో వారు విఫలమైతే ఎద్దు యజమాని బహుమతిని గెలుచుకుంటాడు.