calender_icon.png 28 November, 2024 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇథనాల్‌పై పోరుకు తెర

28-11-2024 02:52:09 AM

  1. మూడు డిమాండ్లను అంగీకరించిన ప్రభుత్వం 
  2. ఉదయం నుంచి ఆందోళన తీవ్రరూపం  
  3. పోలీస్‌స్టేషన్ ముందు ధర్నా 
  4. పోలీసులను తరిమిన రైతులు

నిర్మల్, నవంబర్ 27(విజయక్రాంతి): ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చింది. ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే రైతుల మూడు డిమాండ్లకు అంగీకరించింది. దీంతో  48 గంటల ఆందోళనను తాత్కాలికంగా రైతులు విరమించారు.

తమ సమస్యపై సంఘటితంగా పోరాడితే ప్రభుత్వం దిగివస్తుందని రైతులు నిరూపించారు. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండల కేంద్రం వద్ద నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీతో తమ ప్రాణాలకు ముప్పు ఉందని, పంట పొలాలు నాశనమవుతాయని ఏడాది కాలంగా దిలావర్‌పూర్, గుండంపల్లి టెంబుర్ని, సముందర్‌పెల్లి, రత్నాపూర్, కాండ్లి గ్రామాలకు చెందిన 7 వేల మంది జేఏసీగా ఏర్పడి ఫ్యాక్టరీ వద్దని ఆందోళనలు చేస్తున్నారు.

ఆరు నెలల క్రితమే రైతులు ఫ్యాక్టరీని ముట్టడించి వాహనాలకు నిప్పుపెట్టడంతో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై వివాదం ముదిరింది. రైతులపై కేసులు నమోదయ్యాయి. కలెక్టరేట్ ముట్టడాలు, రాస్తారోకోలు చేసినా ఫ్యాక్టరీ పనులు ఆగకపోవడంతో మంగళ, బుధవారాల్లో  ఐదు గ్రామాల రైతులు భైంసా- నిర్మల్ జాతీయ రహదారిని 48 గంటలపాటు దిగ్బంధిచారు.

రైతుల నిరసన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంగళవారం జాతీయ రహదారిని దిగ్బంధం చేసి ఆరు గంటలపాటు ఆర్డీవోను ముట్టడించారు. రాత్రి 10 గంటల వరకు చలిలోనూ ఆందోళన చేశారు. 

పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల పరుగులు 

ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న యువకులను పోలీసులు బుధవారం వేకువజామునుంచే అదుపులోకి తీసుకోవ డంతో మళ్లీ ఐదు గ్రామాల ప్రజలు ఆందోళనలు తీవ్రతరం చేశారు. పోలీసు బందోబస్తును ఛేదించి ఐదువేల మంది పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించి అరెస్టయిన వారిని విడుదల చేయాలని నినాదా లు చేశారు.

పోలీసులు ఠాణా చుట్టూ ఇనుపకంచెలు వేసి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి జనాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రజలు ఒక్కసారిగా వాటిని తెంచు కుని అరెస్టయిన నాయకులను విడిపించుకున్నారు.

ఆందోళనకారులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో వారంతా ఒక్కసారిగా ఎదురుతిరగడంతో జనానికి పోలీసులు భయపడి పరుగులు తీశారు. అనంతరం ఆందోళనకారులు జాతీయ రహదారిపై బైఠాయించి వంటా వార్పు నిర్వహించి సాయంత్రం ఐదు గంటలవరకు ఆందోళన చేశారు. 

రంగంలోకి కోదండరాం, వేం..

పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని గ్రహించిన ప్రభుత్వం మరోసారి కలెక్టర్, ఎస్పీతో సంప్రదింపులు జరిపి ఆందోళనలు చేస్తున్న నాయకులతో చర్చలు జరిపింది. అంతకుముందు హైదరాబాద్ నుంచి ఎమ్మె ల్సీ కోదండరాం, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి జోక్యం చేసుకొని రైతుల డిమాండ్లను ముఖ్యమంత్రికి విన్నవించారు.

జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి  ఆందోళన చేస్తున్న రైతులను ప్రభుత్వం తరఫున చర్చలకు పిలిచారు. దీంతో జేఏసీ తరఫున అయిదుగురు రైతులు అధికారులతో చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటించి కలెక్టర్ కార్యాలయంలో చర్చలకు వెళ్లారు. గంటసేపు చర్చలు నిర్వహించారు.

రైతుల మూడు డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం సమా చారం అందించింది. ఫ్యాక్టరీ పనులను ఆపడం, జేఏసీ నేత, ఉపాధ్యాయుడు విజయకుమార్‌పై సస్పెన్షన్ వేటు ఎత్తివేయడం, పెట్టిన కేసులను ఉపసంహరిం చుకోవడం వంటి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో వాటిని ప్రభుత్వం అంగీకరించింది.

రాతపూర్వకంగా ఇవ్వాలని రైతు నేతలు పట్టుబట్టినా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యం కాదని, ఫ్యాక్టరీ పనులు ఆపే బాధ్యత తమదని రైతులకు వివరించారు. అయితే ప్రభుత్వం తమ డిమాండ్లను అమలు చేయకపోతే మళ్లీ ఆందోళన చేస్తామని    హెచ్చరించారు.

ఆది నుంచి వివాదాస్పదమే..

 గుండంపల్లి, దిలావర్‌పూర్ గ్రామాల మధ్య పంట పొలాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రభుత్వం మంజూరుచేయడంపై ఆది నుం చి వివాదమే నడుస్తోంది. ఐదుగురు రైతుల నుంచి సుమారు 45 ఎకరాల భూమి కొనుగోలు చేసి 30 ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్మిస్తు న్నారు. ఇప్పటికే 20శాతం పనులు పూర్తయ్యాయి.

అయితే ప్రజలకు, పంటలకు హాని కలిగించే ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వడంపై రైతులు మొదటినుంచి ఆందోళన చేస్తున్నారు. చివరకు ప్రభుత్వం చేపట్టిన కులగ ణన సర్వేను బహిష్కరించడం, ప్రభుత్వ పథకాల సహాయ నిరాకరణ వంటి ఆందో ళనలకు శ్రీకారం చుట్టడంతో సఫలీకృతులయ్యారు.

రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండారైతులు స్వచ్ఛందంగా ఉద్యమాన్ని నడిపి ప్రభుత్వంపై గెలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే రైతుల ఆందోళనల నేపథ్యంలో  సంయమనం పాటిస్తూ చర్చ లు జరిపి ప్రభుతాన్ని, రైతులను ఒప్పించేలా కలెక్టర్, ఎస్పీలు ప్రయత్నించడంతో వివా దం తాత్కాలికంగా సమసిపోయింది.

తాత్కాలికంగా ఆందోళన విరమణ..

 చర్చలు సఫలం కావడంతో జిల్లా అధికారులు సాయంత్రం ఆరు గంటలకు దిలువార్‌పూర్ చేరుకుని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తెలిపారు. దీంతో రైతులు తాత్కాలికంగా ధర్నాను విరమించారు. అంతకుముందు రైతుల ఆందోళనలను కవరేజీ చేస్తున్న మీడియాపై పోలీసులు, గ్రామస్థులు ఆంక్షలు విధించారు. నిజామాబాద్ నుంచి ప్రత్యేక బలగాలను తీసుకువచ్చి జాతీయ రహదారిపై మోహరించడంతో ఉద్రిక్తత చోటు చేసుకోగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

రైతులు ఆందోళనలు చేస్తున్నా ప్రజాప్రతినిధులు మద్దతు తెలపకపోవ డంతో తమ నాయకులు కనిపించ లేదంటూ ప్లకార్డులు పెట్టి నిరసన తెలిపారు. ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా రైతులు విజయం సాధించడంతో ఇథనాల్ ఫ్యాక్టరీ కథ సుఖాం తం అయ్యింది. రైతులు జాతీయ రహదారిపై పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు.