calender_icon.png 2 April, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర్మాన్ని, దయా గుణాన్ని నేర్పించేది రంజాన్ పండుగ

31-03-2025 08:26:24 PM

కామారెడ్డిలో ఘనంగా రంజాన్ ఉత్సవాలు..

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ..

కామారెడ్డి (విజయక్రాంతి): ముస్లిం సోదరులకు ధర్మము, దయాగుణం, క్రమశిక్షణ రంజాన్ ఉపవాస దీక్షలో అలవడుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. రంజాన్ ఉత్సవాలలో భాగంగా సోమవారం కామారెడ్డి కోర్టు రోడ్డు వద్ద గల ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. షాహి ఈద్గా వద్ద రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు (నమాజ్) లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ముస్లింల పర్వదినం రంజాన్ ప్రపంచవ్యాప్తంగా రంజాన్ సంబరాలను పేదలు, ధనవంతులు అన్న సంబంధం లేకుండా అందరూ కలిసి కొత్త బట్టలు ధరించి విందులు చేసుకుంటారు. 

దేశంలోని ప్రముఖ మసీదుల్లో ప్రార్థనలు చేసుకొని ఉపవాసాలు ముగిస్తున్న ముస్లింలు భక్తిప్రపత్తులతో పండగ జరుపుకుంటారని తెలిపారు. ప్రతి పండుగ వెనుకా పరమార్థం ఉంటుంది. చెడుపై మంచి సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడం, చరిత్ర గతి మార్చిన వీరులను స్మరించుకోవడం పర్వదినాల్లో సర్వసామాన్య అంశం. వీటితో పాటు మనిషికి క్రమశిక్షణ నేర్పి, ధర్మాన్ని, దయాగుణాన్ని ప్రబోధించే పండగలో రంజాన్ పండుగ ఒకటి అని అన్నారు. ముస్లింలకు అతి పెద్ద పండగ ఇది. ఇస్లాం ధర్మానికి మూలమైన ఖురాన్ రంజాన్ నెలలో అవతరించింది. ఈ పండుగ వెనక మానసిక, శారీరక వికాసం వంటి మరెన్నో విశేషాలు కూడా ఉన్నాయి. నెలవంక దర్శనంతో మొదలై, మళ్లీ నెలవంక దర్శనంతోనే ముగిసే ఈ పర్వదినం ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయురారోగ్యాలతో అందరు కలిసిమెలిసి ఉండాలని అల్లాతో కోరుకున్నానన్నారు. 

మన సమాజంలో సామరస్యం, కరుణ యొక్క స్ఫూర్తిని పెంపొందించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు అద్భుతమైన ఆరోగ్యం, శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను అన్నారు. నా తరపు నుండి అందరికీ ఈద్ ముబారక్ తెలిపారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువన్, ఎస్పీ రాజేష్ చంద్ర, కామారెడ్డి ఏఎస్పి చైతన్య రెడ్డి, ఆర్డిఓ వీణ, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దిన్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, తాసిల్దార్ జనార్ధన్, పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు లద్దూరి కృష్ణ యాదవ్ ముస్లిం సోదరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు షబ్బీర్ అలీనీ కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.