calender_icon.png 11 March, 2025 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశమే ముందన్న భావన అవసరం

23-11-2024 12:39:28 AM

  1. అందరిని ఏకం చేసింది జాతీయ సమైక్యతా భావమే
  2. ‘లోక్ మంథన్’ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  3. గిరిజనుల జీవన విధానంపై చర్చ జరగాలి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  4. విశ్వజనీన భావన అన్నింటికి మూలం : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
  5. భారత్‌ను అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలి : మంత్రి సీతక్క

హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే నేషన్ ఫస్ట్ అన్న భావనను యువత, ప్రజల్లో కలిగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశమే ముందు అన్న భావనను లోక్‌మంథన్ కార్యక్రమం అందిస్తున్నందుకు ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పారామంలో లోక్ మంథన్ భాగ్యనగర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కాగా.. గౌరవ అతిథులుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి లోక్ మంథన్‌ను రాష్ట్రపతి ప్రారంభించారు.

లోక్ అవలోకన్ పుస్తకాన్ని గవర్నర్ ఆవిష్కరించి తొలి ప్రతిని రాష్ట్రపతికి అందజేశారు. అనంతం రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ 2018లో రాంచీలో నిర్వహించిన లోక్-మంథన్ కార్యక్రమంలో తాను పాల్గొన్నట్లు గుర్తు చేశారు. సంస్కృతి, సంప్రదాయాలతో భారతీయతను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

దేశంలోని పౌరులు, యువత భారత సాంస్కృతిక, మేధో వారసత్వాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. గిరిజనులమైనా, గ్రామస్థులమైనా, నగరవాసులమైనా అందరం భారతీయులమే అని రాష్ట్రపతి పేర్కొన్నారు. దేశంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా జాతీయ సమైక్యతా భావం అనే ఆలోచన అందరిని ఐక్యంగా ఉంచిందని స్పష్టం చేశారు.

దేశాన్ని విభజించి బలహీన పర్చేందుకు శతాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని, కానీ పౌరుల్లో ఉన్న భారతీయ స్ఫూర్తి సమైక్యతా జ్యోతిని వెలిగించినట్లు వెల్లడించారు. భిన్నత్వంలోని ఏకత్వం అనేది భారతీయ సంస్కృతిలో భాగమని, ఇది ఇంద్రధనస్సు అంత సుందరంగా ఉంటుందని రాష్ట్రపతి చెప్పారు. ప్రాచీనకాలం నుంచే భారతీయ భావజాల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని వెల్లడించారు.

భారత్‌లోని మత విశ్వాసాలు, కళలు, సంగీతం, సాంకేతికత, వైద్య వ్యవస్థలు, భాష, సాహిత్యం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందినట్లు వెల్లడించారు. లోకానికి ఆదర్శవంతమైన జీవన విలువలను బహుమతిగా మొదట అందించినది భారతీయ తాత్వికతే అని గుర్తు చేశారు. పూర్వీకులు అందించిన ఆ సంప్రదాయాన్ని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

శతాబ్దాలుగా వలసవాద శక్తులు భారతదేశాన్ని ఆర్థికంగా దోపిడీ చేయడమే కాకుండా, దేశ సామాజిక నిర్మాణాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించినట్లు రాష్ర్టపతి చెప్పారు. శతాబ్దాల అణచివేత కారణంగా దేశ పౌరులు బానిసత్వ మనస్తత్వానికి బాధితులయ్యారన్నారు. ఈ పరిస్థితుల్లో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు పౌరుల్లో ‘నేషన్ ఫస్ట్’ అనే భావనను రేకెత్తంచాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.

దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 

విదేశీ కుట్రలను తట్టుకొని నిలబడ్డామని, ఐకమత్యం, సామరస్యంతో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఇతిహాసాలు సైతం ఐకమత్యం సారాన్ని చెప్పాయని గుర్తు చేశారు. విశ్వజనీన భావన అన్నింటికి మూలమని, లోక్‌మంథన్ అనే కార్యక్రమం దేశ ప్రజలకు అర్థవంతమైన మార్గాన్ని నిర్దేశిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

సంస్కృతులు, జీవన విధానాలు, భాషలు..  ఇలా ఎన్నో అంశాల్లో భారత్‌లో భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుందన్నారు. దేశ సమైక్యతను ముందుకు తీసుకెళ్లడంలో అన్ని రాష్ట్రాలు కీలకపాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. 

జాతీయ కుంభమేళా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

లోక్ మంథన్‌ను  ఐక్యత, జాతీయవాదానికి సంబంధించిన కుంభమేళగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అభివర్ణించారు. దేశమే అన్నిటికంటే శ్రేష్ణమైనది అన్న భావనతో లోక్ మంథన్ పని చేస్తుందని, వికసిత్ భారత్‌కు అవసరమైన మార్గదర్శకత్వాన్ని నిర్దేశిస్తుందన్నారు. ఈ వేదికగా జరిగే చర్చలతో భవిష్యత్‌కు సరైన సమాధానం లభిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా  గిరిజన జీవన విధానంపై కీలక కామెంట్స్ చేశారు. గిరిజనుల జీవన విధానంపై చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ మార్పులు వంటి సమస్యలపై చర్చిస్తున్నామన్నారు. గిరిజనుల జీవనశైలి అనేక సమస్యలకు పరిష్కారాలను సూచిస్తుందని స్పష్టం చేశారు.

ప్రాచీనకాలం నుంచే జల్, జంగల్, జమీన్, జంతువులతో వారు మమేకమై ఉన్నారన్నారు. బ్రిటిషర్ల విభజించు, పాలించు నిబంధనల కారణంగా గిరిజనులు, ఇతరులకు మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరిగినట్లు వివరించారు. ఇప్పుడు ఆ కుట్రలను రూపుమాపి అందరం ఒక్కటే అన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.

అందరి అభిప్రాయాలను గౌరవిస్తాం: మంత్రి సీతక్క  

అన్నివర్గాల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాల సమ్మేళనం హైదరాబాద్ అని, అందరి అభిప్రాయాలను తాము గౌరవిస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. దేశంలోని విభిన్న వర్గాల సంస్కృతిని గౌరవించడమే భారతీయత గొప్పతనమ న్నారు. భారత్‌ను ప్రపంచంలోనే అత్యున్నమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.