calender_icon.png 19 September, 2024 | 9:35 PM

ముద్దుగుమ్మల ఫేవరెట్ ఫుడ్!

19-09-2024 12:00:00 AM

స్టార్ హీరోయిన్లు తమ అందాన్ని.. ఫిజిక్‌ను మెయింటెన్ చేయడానికి డైట్ ఫాలో అవుతూ ఉంటారు.. కానీ తమకు ఇష్టమైన ఫుడ్ ఎదురుగా కనిపిస్తే మాత్రం ఎటువంటి డైట్ ఫాలో అవ్వరని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే అభిమానులు కూడా తమ అభిమాన తారల ఇష్టమైన ఆహారం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వారు ఏం వేసుకుంటారు? ఏం తింటారు? లాంటి విషయాలను చాలామంది ఫాలో అయిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. మరి మన స్టార్ హీరోయిన్స్ ఫేవరెట్ ఫుడ్ గురించి ఇప్పుడు చూద్దాం.. 

కీర్తి సురేష్..

మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచేసిన కీర్తి సురేష్‌కు నాన్ వెజ్ కంటే వెజ్ ఎక్కువ ఇష్టమట. దాంట్లో ఎక్కువగా దోశ.. మరీ దోశను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

దోశ

దోశ చేయడానికి ముందుగా ఒక పాత్రలో బియ్యం, మినపప్పు, మెంతి గింజలను నీటిలో వేసి కడగాలి. తర్వాత మరొక గిన్నెలో అటుకులను కూడా కడగాలి. కడిగిన అటుకులను బియ్యం పాత్రలో వేసి, నాలుగు గంటలు నానబెట్టాలి. దీని తర్వాత నానబెట్టిన బియ్యం అన్ని వస్తువులను గ్రైండర్ జార్లో రుబ్బుకోవాలి. పిండి మందంగా ఉన్నట్లు అనిపిస్తే కొంచెం నీరు కలపాలి. పిండిలో చక్కెర, ఉప్పు కలిపి పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. దోశ చేయడానికి మీడియం మంట మీద పాన్ వేడి చేసుకోవాలి. కొద్దిగా నూనెతో గ్రీజ్ చేసుకోవాలి. తర్వాత దోశ పిండిని పెనంపై వేసి.. లేత బంగారు గోధుమ రంగు వస్తే దోశ బాగా కాలినట్టు. దీన్ని కొబ్బరి చట్నీతో వేడి వేడిగా తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. 

తమన్నా

తమన్నాకు తెలుగు వంటకాలు అంటే ఎంతో ఇష్టమట. తెలుగు వంటకాల్లో ముఖ్యంగా చేపల పులుసును కడుపు నిండా తింటానని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ.

చేపల పులుసు

ముందుగా చేపలను తీసుకొని వాటిని బాగా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఉప్పు, పసుపు, కారం పొడి బాగా పట్టించి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టౌవ్‌పై ఒక పాన్ పెట్టుకుని, పాన్‌లో తగినంత నూనెను వేసుకొని బాగా వేడి చేసి అందులో జిలకర్ర వేసి వేయించాలి. అలాగే ఇందులోనే తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయేవరకు వేయించాలి. బాగా వేగిన తర్వాత తరిగిన టమాటో, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి మెత్తబడేవరకు ఉడికించాలి.

అందులోనే శనగపిండి, పసుపు, మిర్చి పౌడర్ వేసి బాగా కలపాలి. కాస్త నీరు పోసి, మసాలా మంచి వాసన వచ్చేవరకు బాగా ఉడికించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇందులోనే మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి మరో 20 నిమిషాల పాటు బాగా మరిగించాలి. తర్వాత మసాలా పట్టించిన చేపలను వేసి ఒక పది నిమిషాలు పాటు బాగా ఉడికించాల్సి ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత పై నుంచి కొత్తిమీర గార్నిష్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది. 

కాజల్ అగర్వాల్

ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమట. ఒక డైట్ ఫాలో అవుతున్న నేపథ్యంలో వారానికి ఒక్కసారి అయినా ఫుల్లుగా లాగించేస్తూ ఉంటానని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.

హైదరాబాద్ బిర్యానీ

ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. చికెన్‌లో ఉప్పు, కారం పొడి, అల్లం వెల్లుల్లి వేసి బాగా కలపాలి. ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర తరుగు వేయాలి. బిర్యానీ మసాలా కోసం జిలకర్ర పొడి, ధనియాల పొడి, వేయించిన ఉల్లిపాయ, కొద్దిగా నూనె వేసి మళ్లీ కలపాలి. ఈ చికెన్‌లోనే పెరుగు వేసి కలపాలి. ఒక గంట మ్యారినేట్ చేయాలి. బాస్మతి బియ్యాన్ని ఒకసారి కడిగి నీళ్లు పోసి అరగంట నాననివ్వాలి. బియ్యం కోసం స్టవ్ మీద కొద్దిగా నీటిని వేడి చేసి, దానికి కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. తర్వాత షాహి జీర్, నూనె, నెయ్యి వేసుకొని నానబెట్టిన బియ్యం వేసి ఒకసారి కదిలించాలి. 

మ్యారినేట్ చేసిన చికెన్‌లో మిర్చి, జిలకర్ర, లవంగాలు, కొత్తిమీర, కొద్దిగా సోంపు, లవంగాలు, యాలకులు, పుదీనా, ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి వేయించాలి. 80 శాతం ఉడికిన బాస్మతి బియ్యాన్ని మ్యారినేట్ చేసిన చికెన్ మీద వేయాలి. అయితే చికెన్ మొత్తం కింద ఉండనివ్వకూడదు. పైన మరో లేయర్ రైస్ వేసిపైన కుంకుమపువ్వు వేసి మూత గట్టిగా మూయాలి. ఇలా పైన ఒక్కో లేయర్ రైస్, మరొక లేయర్ చికెన్ వేస్తూ మూడు నాలుగు లేయర్స్ వేసుకోవాలి. హైదరాబాద్ బిర్యానీని అతి తక్కువ మంట మీద 20 నిమిషాలు ఉడికించాలి. కావాలంటే దమ్ కూడా పెట్టుకోవచ్చు.  

సమంత..

తెలుగువారి గుండెల్లో తనదైన నటనతో ముద్ర వేసుకున్న టాప్ హీరోయిన్ సమంతకు స్వీట్ పొంగల్ ఫేవరెట్ ఫుడ్ అట.. దాన్ని ఎలా వండుకోవాలో చూసేయండి.. 

స్వీట్ పొంగల్

ముందుగా బియ్యం తీసుకొని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత పెసర పప్పుని కూడా కడగాలి. ఈ రెండింటిని పాన్‌లో వేసి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకూ కుక్కర్‌లో ఉంచాలి. తర్వాత దీన్ని మెత్తగా మ్యాష్ చేయాలి. ఈ మిశ్రమంలో కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్‌లో నెయ్యి వేసి వేడి కాగానే దాంట్లో జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో కొద్దిగా నీళ్లు బెల్లం పొడి కరిగే దాకా ఉంచాలి. ఈ మిశ్రమంలో యాలకుల పొడి వేస్తే మంచి సువాసన, రుచి వస్తుంది. బెల్లం నీళ్లు మరిగిన తర్వాత దాంట్లో మ్యాష్ చేసిన అన్నం, పెసరపప్పు వేసి మిక్స్ చేయాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. దీనిలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ.. మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరిగా జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.