calender_icon.png 9 March, 2025 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తేలనున్న ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం

03-03-2025 12:00:00 AM

నేడు ఉదయం 8 గంటలకు కౌంటింగ్

ఉమ్మడి మెదక్‌కు ఎమ్మెల్సీ దక్కేనా..?

బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపుపై ఉత్కంఠ

మెదక్, మార్చి 2 (విజయక్రాంతి): మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రులు, టీచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 8 గంటల నుండి కరీంనగర్‌లో కౌంటింగ్ ప్రారంభించనున్నారు.  ఈ నియోజకవర్గానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 15 మంది, పట్టభద్రుల స్థానానికి 56 మంది మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే సోమవారంతో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.

కాగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈసారి ఓటర్లు పోటెత్తిన విషయం తెలిసిందే. ఈ జిల్లా నుండి పట్టభద్రుల స్థానానికి బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి పోటీ చేయడంతో సర్వత్రా ఉత్కంఠం నెలకొంది. ఈసారి ఉమ్మడి జిల్లాకు ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందా అనేది వేచి చూడాల్సిందే. ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరపున పట్టభద్రుల స్థానానికి నరేందర్‌రెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే. 

అభ్యర్థుల్లో టెన్షన్..

ఎమ్మెల్సీ పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సోమవారం ప్రారంభమవుతున్న దృష్ట్యా అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. అసెంబ్లీ సాధారణ ఎన్నికల మాదిరిగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ప్రధాన పార్టీల పట్టభద్రుల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారంతోపాటు నగదు, మద్యం పంపిణీ చేశారు. ఎలాగైనా ఓట్లను రాబట్టుకోవాలని ప్రలోభాలకు గురి చేశారు. ఇదే తరహాలో టీచర్స్ నియోజకవర్గ అభ్యర్థులు సైతం హోరాహోరీగా ప్రచారం సాగించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అభ్యర్థుల గెలుపోటములపై కార్యకర్తల్లో టెన్షన్ నెలకొంది. కొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.