calender_icon.png 3 April, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు కన్నీళ్లే మిగిలాయి!

02-04-2025 01:07:51 AM

  1. 10 లక్షల మందితో ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్ సభ!
  2. కనీవినీ ఎరుగని విధంగా రజతోత్సవం
  3. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టనున్న కేసీఆర్
  4. ఎర్రవల్లిలో ఉమ్మడి వరంగల్ నాయకులతో కేసీఆర్ సమావేశం

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో కనీవినీ ఎరుగని విధంగా రజతోత్సవ మహాసభను నిర్వహిస్తామని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ సభను 10 లక్షల మందితో నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేయాలని పార్టీ నేతలకు సూచించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులతో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో తన ఫాంహౌస్‌లో మంగళవారం కేసీఆర్ సమావేశమయ్యారు. సభ విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని నేతలకు కేసీఆర్ సూచించారు. సభ బాధ్యతను ఆ జిల్లా నాయకులకే అప్పగించారు.

భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. వేసవి కాలం కావడంతో సభకు హాజరయ్యే వారికి చిన్నపాటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. అందుకోసం 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల నీళ్ల బాటిళ్లు అందుబాటులో ఉంచాలని నాయకులతో కేసీఆర్ చెప్పారు.

రజతోత్సవ సభ కోసం జనం ఆతృతతో ఎదురుచూస్తున్నారని కేసీఆర్ అన్నారు. సభకు ప్రజలే స్వచ్ఛందంగా తరలివస్తారని చెప్పారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఎల్కతుర్తిలో బహిరంగ సభకు భూమిపూజ చేయనున్నట్లు వెల్లడించారు. కాగా కాంగ్రెస్ పాలన వింతగా ఉన్నదని, మార్పు కోరుకున్న రైతుల కళ్లల్లో కన్నీళ్లే మిగిలాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

రైతులకు ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా తాను ఊహించలేదని పార్టీ శ్రేణులతో అన్నారు. ప్రభుత్వ చర్యలతో రైతులు, వివిధ వర్గాల ప్రజలు మనోధైర్యం కోల్పోతున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో కేటీఆర్‌తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ నేతలు మధుసుదనా చారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావవు, తాటి కొండ రాజయ్య, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

154 ఎకరాల్లో సభా ప్రాంగణం

తెలంగాణలోని అన్ని ప్రాంతాలను కలిపే జాతీయ రహదారి 563, 763కు జంక్షన్‌గా ఉండే ఎల్కతుర్తిని సభా కేంద్రంగా కేసీఆర్ ఎంచుకున్నారు. కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు అక్కడ 1,213 ఎకరాలను ఇప్పటికే చదును చేశారు. ఇందులో 154 ఎకరాల్లో రజతోత్సవ మహాసభ ప్రాంగణం ఉండనుంది. స భకు హాజరయ్యే వారికోసం పార్కింగ్ కోసం ఏకంగా 1,059 ఎకరాలు కేటాయించనున్నారు. 50 వేల వాహనాలను నిలిపేందుకు వీలుగా పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నారు.

ఉద్యమకాలం నుంచి వరంగల్ సెంటిమెంట్

తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో, ప్రత్యేక రాష్ర్టంలో సెంటిమెంట్‌గా ఉంటున్న వరంగల్‌లో బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను లక్షలాది మందితో ఏప్రిల్ 27న నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ ఎంచుకున్నారు. అందులో భాగంగా ఎల్కతుర్తిలో సభాస్థలాన్ని పలువురు నాయకులు పరిశీలిం చారు. ఈ సభా వేదిక మీద నుంచే కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను కేసీఆర్ ఎండగట్టనున్నారు.