- అభిప్రాయాలు సేకరించి అసెంబ్లీలో చర్చిస్తాం
- అందరి ఆమోదంతోనే తీర్మానం చేస్తాం
- ప్రజల పన్నుల సొమ్ము రైతు భరోసాకే
- ఆగస్టు నాటికి రుణమాఫీ చేసి తీరుతాం
- ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
- హనుమకొండలో అభిప్రాయ సేకరణ సమావేశం
హనుమకొండ, జూలై 15 (విజయక్రాంతి): రాష్ట్రంలోని రైతులందరి అభిప్రాయం మేరకే రైతుభరోసాపై నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో రైతుభరోసా పథకం విధివిధానాలపై ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ వరంగల్ నుంచే రైతుభరోసాకు హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నేరవేరుస్తామని స్పష్టంచేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల విద్యుత్తు లాంటి పథకాలు అమలు చేశామని చెప్పారు. రైతుబంధు ఒకసారి ఇచ్చామని, ఇప్పుడు రైతుభరోసా అమలుకు విధివిధానాల రూపకల్పన కోసం విస్తృతస్థాయిలో అభిప్రాయాలు సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల అభిప్రాయాలను తీసుకుని అసెంబ్లీలో చర్చ పెట్టి రైతు భరోసా కోసం తీర్మానం చేస్తుందని చెప్పారు.
రైతుభరోసా సొమ్ము ప్రజలు పన్నుల రూపంలో చెల్లించినదేనని, అందుకే ప్రతిపైసా సక్రమంగా వినియోగించేందుకు అన్ని వర్గాల సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తీసుకుంటున్నట్టు పునరుద్ఘాటించారు. రైతులకు బీమా సౌకర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని, బీమా కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చేశామని, రైతులు స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకోవచ్చని తెలిపారు.
వ్యవసాయానికి పెద్దపీట: మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ పభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోనియా, రాహుల్‌గాంధీ సూచనల మేరకు ప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తోందని స్పష్టంచేశారు. వచ్చే నెలలో రూ.౨ లక్షల రుణమాఫీ చేస్తామని, సీఎం రేవంత్‌రెడ్డి భీష్మ ప్రతిజ్ఞ చేపట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతుబంధులో జరిగిన అవకతవకలు రైతు భరోసాలో జరగకూడదనే ఉద్దేశంతోనే రైతుల అభిప్రాయాల సేకరిస్తున్నట్లు తెలిపారు. సామాన్య రైతులు, చిన్న సన్నకారు రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుందని ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు.
రైతును రాజు చేయడమే లక్ష్యం: మంత్రి పొంగులేటి
రైతును రాజు చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ రాజ్యం పనిచేస్తోందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి రూ.7 లక్షల కోట్ల అప్పు భారం ఉందన్నారు. ఇన్‌కంటాక్స్, పాన్‌కార్డ్ ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వరని చేస్తున్న ప్రచారం అవాస్తవమని చెప్పారు. రైతు సంక్షేమం విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయదని స్పష్టం చేశారు.
గత సర్కార్ రైతుబంధులో లోపాలు: మంత్రి సీతక్క
గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో అందించిన పథకంలో లోపాలు ఉన్నాయని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. నాడు నిజమైన రైతులకు, కష్టపడే అన్నదాతలకు న్యాయం జరగలేదని చెప్పారు. అసలైన రైతులకు న్యాయం చేసేందుకే రైతుభరోసా పథకానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
సీఎం చిత్తశుద్ధితో రైతుభరోసా: మంత్రి కొండా సురేఖ
సీఎం రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధితో అర్హులైన అన్నదాతలకు రైతు భరోసా ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నారని మంత్రి కొండా సురేఖ చెప్పారు. రైతుబంధు విషయంతో కటాఫ్ పెట్టుకోవాలని అప్పటి సీఎం కేసీఆర్‌కు తాను చెప్పానని, కానీ ఆ విషయాన్ని పట్టించుకోక పోవడంతో ప్రజాధనం దుర్వినియోగం అయిందని ఆరోపించారు. ఇందిరాగాంధీ నిరుపేదలకు అందించిన భూములకు ధరణి రాకతో అన్యాయం జరిగిందని అన్నారు. తమ ప్రభుత్వం ఓపెన్‌మైండ్‌తో వెళ్తోందని చెప్పారు. వైఎస్ హయాంలో రైతులకు మేలు జరిగిందని, కేసీఆర్ ప్రభుత్వం ధరణి పేరుతో భూములు దోచుకుందని విరుచుకుపడ్డారు. కేసీఆర్ సర్కార్‌లో అఖిల పక్షం అని చెప్పి నలుగురు మాత్రమే నిర్ణయం తీసుకున్నారని, తమ ప్రభుత్వం అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టంచేశారు.
పంటల బీమాతోపాటు పశువులకు బీమా వర్తింపచేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈసందర్భంగా పలువురు రైతులు, ప్రొఫెసర్లు, వైద్యులు, రైతుభరోసాకు సంబంధించి పలు సూచనలు చేశారు. సమావేశంలో ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్, ఎంపీలు పోరిక బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, డాక్టర్ మురళినాయక్, కార్పొరేషన్ల చైర్మన్లు సిరిసిల్ల రాజయ్య, జంగా రాఘవారెడ్డి, మార్నేని రవీందర్‌రావు, ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఉమ్మడి వరంగల్‌లోని కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.