calender_icon.png 3 February, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలుపు నలిపితేనే రైతు గెలుపు

03-02-2025 12:31:19 AM

  • రసాయనిక మందులతో వరిలో కలుపు నివారణ
  • కలుపు రకాన్నిబట్టి మందు పిచికారీ చేయాలి
  • తగిన సమయంలో సరైన మోతాదులో వాడాలి: గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త నరేశ్

సూర్యాపేట, ఫిబ్రవరి 2: వరిలో కలుపును నివారించడం ద్వారానే ఆశించిన దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కూలీల కొరతతో పాటు కూలిరేట్లు విపరీతంగా పెరుగడంతో రైతులు ఇతర పద్ధతులను అనుసరిస్తున్నారు. కలుపును నివారించేందుకు అనేక రకాల హెర్బిసైడ్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.  అయితే ఏ మందు, ఎంత మోతాదులో వాడాలనే విషయం గురించి గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త దొంగరి నరేశ్ వివరించారు. ఆయన తెలిపిన వివరాలు..

డ్రమ్ సీడర్, నేరుగా వెదజల్లే వరిలో : పైరజో సల్ఫ్యూరాన్, ఈథైల్ 10 శాతం పొడి 80 గ్రాములు ఎకరాకు 20 కిలోల ఇసుకలో కలిపి విత్తిన 3 నుంచి 5 రోజులలో చల్లుకోవాలి. దాంతో వెడల్పాకు కలుపు మొక్కలు, తుంగను నివారించవచ్చు. ప్రెటిలాక్లోర్ 30 శాతం, పైరజో సల్ఫ్యూరాన్ ఈథైల్ 0.75శాతం గుళికలు విత్తిన 3 నుంచి 5 రోజులకు 800 గ్రాములు ఎకరాకు చల్లుకోవాలి. వీటితో వెడల్పాకు కలుపు, తుంగ, ఏకవార్షిక గడ్డిజాతి కలుపును అరికట్టవచ్చు.

కలుపు 2/4 ఆకుల దశలో

 సైహాలో ఫాప్ బ్యూటైల్ 10 శాతం ద్రావకం 400 మిల్లీ లీటర్లు తీసుకొని 1.5 మిల్లీ లీటర్ నీటికి కలిపి ఎకరాకు పిచికారీ చేయడం వల్ల ఊదగడ్డిని నివారించవచ్చు.

 ఫెనాక్సీప్రోప్ ఈథైల్ 9.3శాతం ద్రావకం, 250 మిల్లీ లీటర్లు ఎకరాకు పిచికారీ చేయడం వల్ల ఊద, ఏకవార్షిక గడ్డిని నివారించవచ్చు.

 మెట్ సల్ఫ్యూరాన్ మిథైల్ 10 శాతం, క్లోరి మ్యూరాన్ ఈథైల్ 10శాతం 8గ్రాములు పిచికారీ చేయడం వల్ల వెడల్పాకు కలుపు, తుంగను అరికట్టవచ్చు.

 పెనాక్సులం 1.02శాతం, సైహలోపాస్ బ్యూటైల్ 5.1 శాతం ద్రావకాన్ని 800 నుంచి 900 మిల్లీ లీటర్లు పిచికారీ చేయాలి. దాంతో వెడల్పాకు, తుంగ, ఏకవార్షిక గడ్డిజాతి కలుపు చనిపోతుంది.

 ట్రయాఫామోన్ + ఇథాక్సీ సల్ఫ్యూరాన్ను 90 గ్రాములు ఎకరాకు పిచికారీ చేసుకోవాలి.

నాటు వేసిన వరిలో : నాటు వేసిన 3 నుంచి 5 రోజుల్లోపు ప్రెటిలాక్లోర్ 50 శాతం ద్రావకం 500 మిల్లీ లీటర్లు లేదా ఆక్సాడయార్జిల్ 80 శాతం డబ్ల్యూపీ 50 గ్రాములు లేదా పైరజో సల్ఫ్యూరాన్ ఈథైల్ 70 శాతం నీటిలో కరిగే గుళికలు 120 గ్రాములు లేదా బెన్ సల్ఫ్యూరాన్ మిథైల్ 0.6 శాతం, ప్రెటిలాక్లోర్ 6 శాతం గుళికలు 4 కిలోలు లేదా ప్రెటిలాక్లోర్ 6.0 శాతం, పైరజో సల్ఫ్యూరాన్ ఈథైల్ 0.15 శాతం గుళికలు ఎకరానికి 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి.   

కలుపు 4 ఆకుల దశలో

కొన్ని రకాల గడ్డి, వెడల్పాకు, తుంగ కలుపు మొక్కలు ఉన్నప్పుడు బిస్పురైబాక్ సోడియం 10 శాతం ద్రావకాన్ని ఎకరాకు 80 నుంచి 100 మిల్లీ లీటర్లు పిచికారీ చేయాలి. 

 కొన్ని రకాల వెడల్పాకు కలుపు ఉంటే 2,4 డీ ఈథైల్ ఎస్టర్ను ఎకరాకు 1.0 లీటర్ పిచికారీ చేయాలి.  

 పెనాక్సులం 2. 67 శాతం ద్రావకం 400 మిల్లీ లీటర్లు ఎకరాకు పిచికారీ చేయడం వల్ల కొన్ని రకాల వెడల్పాకు, తుంగను అరికట్టవచ్చు. 

 పెనాక్సులం 1.02 శాతం, సైహలోఫాప్ బ్యూటైల్ 5.1 శాతం ద్రావకాన్ని 800 నుంచి 900 మిల్లీ లీటర్లు పిచికారీ చేసి కొన్ని రకాల వెడల్పాకు కలుపు, తుంగ, ఏకవార్షిక గడ్డిజాతి కలుపును నివారించవచ్చు. 

 ట్రయాఫామోన్, ఇథాక్సి సల్ఫ్యూరాన్ను 90 గ్రాములు ఎకరాకు పిచికారీ చేసుకోవాలి.

జాగ్రత్తలు

కలుపు మందును సిఫారసు చేసిన మోతాదులో అనువైన సమయానికి సరైన పద్ధతిలో మాత్రమే పిచికారీ చేయాలి. 

మందు పిచికారీకి సరైన నాజిల్ను ఉపయోగించాలి. ఖచ్చితమైన సూచన లేకుండా ఇతర సస్యరక్షణ మందులతో కలిపి వాడకూడదు.

సరైన మందులతో తేలిక

వరిలో కలుపు నివారణకు అనువైన రసాయనిక మందులు మార్కెట్లో లభిస్తున్నాయి. మొలిచిన కలుపును బట్టి మందును ఎంపిక చేసుకుని కలుపు 2- 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మందును సరైన మోతాదులో పిచికారీ చేస్తే నశిస్తుంది. కలుపును నివారిస్తేనే పంట మొక్కలు బాగా ఎదిగి ఆశించిన దిగుబడులు సాధించవచ్చు.
 దొంగరి నరేశ్,  కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి