15-04-2025 01:04:04 AM
హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రాంతంలో పోరాటా లన్నీ భూమితోనే ముడిపడి ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. కొము రం భీమ్ జల్, జమీన్, జంగల్ పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం, కమ్యూనిస్టు సోదరుల పోరాటాలన్నీ భూమి కోసమే జరిగాయని తెలిపారు.
భూభారతి పోర్టల్‌ను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావుతో కలిసి సోమవారం శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మా ట్లాడుతూ.. గత పాలకులు రెవెన్యూ చట్టాలను మార్చి తెచ్చిన ధరణి ప్రజల పాలిట భూతంగా మారిందన్నారు. తహసీల్దార్ పైనే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితిని గత పాలకులు తీసుకొచ్చారని, రెవెన్యూ అధికారుల ను దోపిడీదారులుగా చిత్రీకరించి లబ్ధ్ది పొం దాలని ఆనాటి పాలకులు ఆలోచన చేశారని సీఎం దుయ్యబట్టారు.
చట్టాలను చుట్టాలు గా మార్చుకుని వేలాది ఎకరాలు కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా..? అందుకే పేద లకు మేలు చేసేందుకు నూతన ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొచ్చామని సీఎం స్పష్టం చేశారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూభారతిని ప్రారంభించుకున్నామని, పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మం డలాల్లో చేపడుతున్నామని వివరించారు.
వివాదరహిత భూములను రైతులకు కానుకగా ఇచ్చేందుకు మా ప్రభుత్వం ప్రయత్ని స్తోంది, ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్య త రెవెన్యూఅధికారులపైనే ఉందని సీఎం సూచించారు. రెవెన్యూ అధికారులను ప్రజలకు చేరువ చేయాలనేదే మా ఉద్దేశమని, గ త పాలకుల్లా మిమ్మల్ని ప్రజల ముందు దో షులుగా నిలబెట్టే ఆలోచనకు కాంగ్రెస్ ప్ర భుత్వం వ్యతిరేకమన్నారు.
ఆనాటి ముఖ్యమంత్రి రెవెన్యూ అధికారులపై అసెంబ్లీ సాక్షి గా ఏం మాట్లాడారో మీకు తెలుసన్నారు. మేం అవినీతికి పాల్పడే వ్యక్తులపైన కఠినం గా ఉంటాం.. కానీ వ్యవస్థపై కాదని సీఎం పే ర్కొన్నారు. మేం చేసే తప్పులకు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే విధానానికి తాను వ్య తిరేకమని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రెవె న్యూ అధికారులపై దురుద్దేశంతో కొందరు కల్పించిన అపోహలను తొలగిద్దామని సీఎం సూచించారు.
‘ఏ శాఖలో అయినా కొందరు చెడ్డవారుంటారు.. అలాగని, ఎలు క దూరిందని ఇల్లు తగులబెట్టే వ్యవహారం చేశారు’ అని ముఖ్యమంత్రి గత పాలకులపై ధ్వజమెత్తారు. రెవెన్యూ సిబ్బందిని తమ ప్రభుత్వం పూర్తిగా విశ్వసిస్తుందని అన్నారు. రైతు బాంధవులు రెవెన్యూ సిబ్బందేనని ము ఖ్యమంత్రి చెప్పారు.
జూన్ 2 నాటికి భూభారతిని పూర్తిగా అమలు చేస్తామని అన్నారు. భవిష్యత్‌లో ఆధార్ లాగే భూమికి సంబంధించి భూధార్ తీసుకొస్తామని చెప్పారు. రా బోయే రోజుల్లో వ్యవసాయ భూములను స ర్వే చేసి కొలతలు వేసి హద్దులు గుర్తిస్తామని, కలెక్టర్లు ప్రతీ మండలంలో పర్యటించాలని, అందరి సహకారంతో చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలని సీఎం ఆదేశించారు.
ధరణిని బంగాళఖాతంలోకి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
‘భూమికి మనిషికి విడదీయరాని సం బంధం ఉంది. అనేక పోరాటాల ద్వారా భూ మిపై సాధించుకున్న హక్కులను, ఆ హక్కు లు కాలరాయకుండా ప్రజలకు అందించాల్సిన బాధ్యత పాలకులపైన ఉంది’ అని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రాష్ర్టంలో భూభారతి 2025 చట్టాన్ని ప్రా రంభించిన ఈరోజు చాలా చారిత్రాత్మకమ ని, సామాన్యుడికి సైతం అర్థమయ్యే విధంగా ఎలాంటి మతలబు, ఇబ్బందిలేకుండా తయారుచేసినది భూభారత్ 2025 చట్టం అని ప్రకటించడానికి నాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉందన్నారు.
‘దురదృష్టం ఏమిటంటే...ఆత్మగౌరవం కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టంలో భూమితో పెనవేసుకున్నటువంటి ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తూ గత పాలకులు ధరణి చట్టం తీసుకొచ్చారు. గత పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీలో ధరణిపై చర్చ వచ్చిన ప్రతి సందర్భంగా చెప్పాను.
ధరణి అనేది రైతుల పాలిట శాపంగా మా రింది. కొంతమంది పెత్తందారుల కాళ్ల వద్ద రైతుల హక్కులను తాకట్టు పెట్టే విధంగా ఉం దని ఎంత మొత్తుకున్నా గత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. గత కాంగ్రెస్ ప్ర భుత్వాలు పేదలకు పంపిణీ చేసిన 24 లక్షల ఎకరాలకు సంబంధించిన హక్కులను గత ప్రభుత్వం ధరణి తీసుకొచ్చి కాలరాసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా అప్పుడు పీసీసీ అధ్యక్షుడుగా రాష్ర్టంలో అనేక బహిరంగ సభలు నిర్వహించి.. కేంద్ర నాయకత్వాన్ని తీసుకువచ్చి ధరణి నీ బంగాళాఖాతంలో కలిపేస్తామని, ప్రజలకు మేలు చేసే చట్టాన్ని తీసుకొస్తామని ప్రకటించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం. అధికారంలోకి రాగానే ధరణిని మార్చడానికి అనేక రకమైన చర్చలు పెట్టి, రైతులందరికీ మేలు చేసేటువంటి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చి.. తెలంగాణ రైతులకు అంకితం చేస్తున్నాం’ అని డిప్యూటీ సీఎ ం అన్నారు. భూభారతి చట్టం ద్వారా అసైన్డ్ కమిటీలను పునరుద్ధరణ చేసి అసైన్ భూముల్లో సాగు చేసుకుంటున్న అర్హత కలిగిన వారికి పట్టాలు పంపిణీ చేస్తామన్నారు.
భూభారతి చట్టంతో నా జన్మధన్యం: మంత్రి పొంగులేటి
భూభారతి చట్టాన్ని ప్రజలకు అందించడంతో తన జన్మధన్యమైందని రెవెన్యూ, శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నలుగురు కలసి రూపొందించిన 2020 రెవెన్యూ చట్టం- ధరణితో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయిందని, రెవెన్యూ వ్యవస్థ కూడా, తెల్లవారుఝూమున దొరగారి మదిలో మెదిలిన ఆలోచనలకు అనుగుణంగా పరిగెత్తలేకపోయిందని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర సహచర మం త్రులు ఎంతో కృషిచేసి రూపొందించిన ఈ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడితే బీఆర్‌ఎస్ సభ్యులు అపహస్యం చేయడంతో పాటు అడ్డుకునే ప్రయత్నం చేశారని, అయినా ఎన్నికల ముందు ఇచ్చి న హామీని నేటితో నిలబెట్టుకున్నామన్నారు.
ఈ చట్టాన్ని స మర్ధవంతంగా ప్రజలకు అందించేందుకుగాను 4 జిల్లాల్లోని 4 మండలాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశాం. ఖమ్మం, మహబూబ్‌నగర్, ములుగు, కామారెడ్డి జిల్లాలను ఎంపికచేశామని తెలిపారు. అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలు స్వీకరించి 15 రోజుల్లో పరిష్కరిస్తారని తెలిపారు.
ఈనెల 17 నుంచి కలెక్టర్లు రాష్ర్టంలో అన్ని మండలాల్లో ఈ చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తారని, రాష్ర్టంలో అన్నివర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని, భేషజాలకు పోకుండా అవసరమైన మార్పులు చేసి జూన్ 2 తేదీనాటికి సమగ్ర చట్టాన్ని ఉపయోగంలోకి తీసుకువస్తామన్నారు.
మే మొదటివారంలో రాష్ర్టంలో మిగిలిన 29 జిల్లాలలో ఒక్కో మండలాన్ని ప్రయోగాత్మకంగా ఎంపిక చేసి సమస్యలను స్వీకరించి భూభారతి చట్టాన్నిపటిష్టం చేస్తామని, గత ప్రభుత్వంలో జరి గిన తప్పులను సవరించేందుకు ఎమ్మార్వో స్థాయిలో అధికారుల బృందం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ఈ చట్టాన్ని సమ గ్రంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు.